రాహుల్ దూతలు మళ్లీ రాష్ట్రానికి వస్తున్నారు. పద్దెనిమిది పార్లమెంట్ నియోజకవర్గాలు..వాటి పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్స్ కు దరఖాస్తులు స్వీకరించిన పరిశీలకులు మిగిలిన నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. అసలే విభజన సెగలతో అట్టుడుకుతున్న రాష్ర్ట పార్టీలో విభేదాలతో పరిశీలకులు షాక్ తింటున్నారు విభజన సెగలతో రాష్ర్టం అట్టడుకుతుంటే మరోవైపు రాహుల్ దూతలమంటూ ఎంపీ స్ధానాలవారీగా రాష్ర్టానికి వచ్చిన పరిశీలకులకు సీమాంధ్రలో పార్టీ నేతలు చుక్కలు చూపించారు. నియోజకవర్గాల వారీగా పార్టీ ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు వచ్చిన పరిశీలకులకు సీమాంధ్రలో స్పందన కరువైంది. రాష్ర్ట విభజనకు హైకమాండ్ దూకుడుగా వెళుతుండటంతో సీమాంధ్ర లో అభ్యర్ధులు కరువైన పరిస్ధితి ఆ పార్టీ పరిశీలకులను తెల్లమొహం వేసేలా చేసింది. అయితే తెలంగాణలో పరిస్ధితి ఇందుకు భిన్నంగా ఉంటుందని ఊహించిన రాహుల్ దూతలకు అక్కడ పార్టీలో గ్రూపు తగాదాలు షాక్ కు గురిచేశాయి. ఎలాగైతేనేం 18 లోక్ సభ నియోజకవర్గాలకు వాటి పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకూ దరఖాస్తులను స్వీకరించారు. అయితే మధ్యలో సంక్రాంతి రావడంతో పండుగ వేళ తాము అందుబాటులో ఉండమని పార్టీ నేతలు తెగేసి చెప్పడంతో రాష్ర్టం విడిచివెళ్లిన ఎఐసీసీ పరిశీలకులు మళ్లీ రాష్ర్టానికి వస్తున్నారు. యువనేత రాహుల్ సహా పార్టీ అగ్రనాయకత్వం ఫిబ్రవరి నెలాఖరుకు ఈ ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించడంతో పరిశీలకులు తమ పని ముగించుకునేందుకు రాష్ర్టానికి మరోవిడత రానున్నారు. తొలివిడత అభిప్రాయ సేకరణలోనే రాహుల్ దూతలకు దిమ్మతిరిగింది. దీంతో మలివిడత పరిశీలనలో మార్గదర్శకాల విషయంలో జాగ్రత్తలు తీసకుంటున్నారు. ఎంత సమయమైనా కేటాయించి ముఖాముఖీ ఫిర్యాదుల స్వీకరణకు పరిశీలకులు ప్రాధాన్యత నిస్తున్నారు. తొలివిడత జరిపిన పరిశీలనలో సిట్టింగ్‌ ఎంపీలకు ఇవ్వాలని కొందరు, ఇవ్వకూడదని మరికొందరు ఫిర్యాదుల పరంపరను కొనసాగించారు. దీంతో కొన్ని చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. మెదక్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ వంటి ప్రధాన కేంద్రాల్లో ఘర్షణ పూరిత వాతావరణం నెలకొన్న సంఘటనలు ఉన్నాయి. అదేవిధంగా సిట్టింగ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపైన కూడా శరపరంపరగా ఫిర్యాదులు వస్తున్నాయి. మొత్తంమీద విభజన నేపథ్యంలో సీమాంధ్రలో పోటీకి అభ్యర్ధులు పెద్దగా ఉత్సాహం చూపకపోతుంటే తెలంగాణ నుంచి మాత్రం ఎన్నికల బరిలో దిగేందుకు పెద్దసంఖ్యలో నాయకులు పోటీపడుతున్నారు. తమ నాయకులకు టిక్కెట్లు ఇవ్వాలంటూ రాహుల్ దూతలకు ఈ థఫా తెలంగాణ ప్రాంతం నుంచి వినతులు వెల్లువెత్తే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: