రాష్ర్ట విభజన ఎపిసోడ్ లో అనేక కీలక మలుపులు తిరుగుతున్నాయి. రేపు(గురువారం) లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టగానే పార్టీకి, పదవికి రాజీనామా చేసేందుకు సీఎం కిరణ్ సిద్ధమౌతున్నట్లు తాజా సమాచారం. ఐదుగురు మంత్రులు మాత్రమే కాంగ్రెస్‌లో కొనసాగే అవకాశం ఉందంటున్నారు. మిగిలిన సీమాంధ్ర మంత్రులందరూ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నారు. ఎక్కువ మంది సీమాంధ్ర మంత్రులు కిరణ్‌తో కలిసి వెళ్లేందుకు అవకాశం ఉంది. కొంత మంది సీమాంధ్ర మంత్రులు టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలిసింది. తాజాగా అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదం పొందగానే రాజీనామా చేస్తారని తాజాగా కథనాలు వస్తున్నాయి. గవర్నర్ లేకపోవడంతో రాజీనామా లేఖను ఎవరికి ఇవ్వాలనే దానిపై కిరణ్ తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ల సదస్సులో పాల్గొనేందుకు గవర్నర్ నరసింహన్ బుధవారం ఢిల్లీకి వెళ్లారు. అక్కడ విభజన అంశాలపై అధిష్టానంతో మాట్లాడే అవకాశాలున్నాయి. ఐదు రోజుల పాటు గవర్నర్ హస్తినలో ఉండే అవకాశాలున్నాయి. దీనితో సీఎం కిరణ్ తన రాజీనామా అంశంపై సీమాంధ్ర మంత్రులతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు మంత్రులు ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రాజీనామా చేశాక..? సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశాక పార్టీ పెడతారా? పెట్టరా? ఒకవైపు సొంత పార్టీకి ఏర్పాట్లన్నీ జరిగిపోయాయనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు అలాంటిదేమీ లేదని కిరణ్‌ వర్గం నేతలే కొందరు చెబుతున్నారు. కిరణ్‌ పార్టీ పెడితే ఆయన వెనక ఎవరెవరు వెళతారనేది హాట్‌టాపిక్‌గా మారింది. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఆరుగురు ఎంపీలైతే ఖచ్చితంగా కిరణ్‌ తోటే ప్రయాణం చేసే అవకాశం కనపడతోంది. రాష్ట్ర మంత్రుల్లోనే రూట్లు సెపరేటుగా కనపడుతున్నాయి. కొందరు టీడీపీ, వైసీపీల్లో బెర్తులు రిజర్వ్‌ చేసుకుంటుంటే.. అది కుదరనివాళ్లు కిరణ్‌ వైపు వచ్చేట్లున్నారు. మంత్రులు డొక్కా, బాలరాజు, కొండ్రు, ఆనం, రఘువీరారెడ్డి, శైలజానాథ్, కన్నా లక్ష్మీనారాయణలు కాంగ్రెస్‌లోనే కొనసాగాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరంతా పార్లమెంట్‌ సమావేశాల తర్వాత ఉండే రాజకీయ వాతావరణాన్ని బట్టే నిర్ణయం తీసుకోవాలని వెయిట్‌ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అధిష్టానం అయితే కిరణ్‌ పట్ల విచిత్రంగా వ్యవహరిస్తోంది. ఆరుగురు ఎంపీలను బహిష్కరించిన హైకమాండ్‌ కిరణ్‌పై మాత్రం చర్య తీసుకోనంటోంది. మొత్తానికి రాష్ర్ట చరిత్రలో మరో కీలక అధ్యాయం కొనసాగబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: