వరాలిచ్చే దేవుడే దిగి వచ్చిన తగ్గించలేని ఒక భయంకర రోగంగా మారిందీ వరకట్నం. కట్టబెట్టేందుకు కూతుర్ని కని, ఆమెతో పాటు కట్టలు కట్టలుగా కట్నాలు కూడా ఇచ్చి, అల్లుడి చేతిలో అవమానాల్ని భరిస్తున్న తల్లిదండ్రులెందరో. తమ ఆస్తిలో ఆడబిడ్డకి సైతం వాటా ఉందనే ఆలోచనలతో మొదలైన వరకట్నం ఈనాడు మగవాడు ఆస్తి సంపాదించుకునేందుకు ఒక వ్యాపారంగా మారింది. పుట్టినప్పటి నుండి అమ్మాయి భవిష్యత్తు గురించి కలలు కని.. నేడు నిద్ర కూడా పట్టక తడి అవుతున్న కన్నులెన్నో. గుండెలపై పెట్టుకు పెంచిన కూతుర్ని, నేడు గుండెలపై భారంగా చూస్తున్న మహానుభావులెందరో. మగవానితో సమానంగా విద్యాబుధ్ధులు నేర్చి, సమాజశ్రేయస్సుకై తమ వంతు సాయన్ని చేర్చి, తండ్రి కూర్చిన సంపదలు కట్నం ఇస్తే తప్ప మగువకి విలువ లేదా? అసలు కట్నం ఎందుకివ్వాలి? మగవానితో సమానంగా ఆస్తి, అంతస్తు పంచేందుకు చిహ్నంగానా? లేక కొందరు పురుషుల అహాన్ని చల్లార్చేందుకా? చిరిగిపోయిన కాగితాల్లో, చరిత్ర పుటల్లో మగ్గిపోయిన రోజులని గుర్తుకుతెచ్చుకుందాం. కన్యాశుల్కం ఇచ్చి మరీ పెళ్ళి చేసుకున్న వారెందరో. మన జీవితాల్లోకి వచ్చే మగువకి తను కన్న కలలని నిజమని నిరూపిద్దాం. మనవి ఉన్నతమైన ఆలోచనలని చాటి చెపుదాం. వరకట్నం రూపుమాపటానికి మన వంతు ప్రయత్నం చేద్దాం. పెరిగిన కట్నం లేని పెళ్లిళ్ల సంఖ్యని చూస్తూ, ఆ సంఖ్య శూన్యం కావాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: