పిల్లలు చందమామని చూస్తూ గోరుముద్దలు తినే రోజులు తగ్గిపొయాయి. వీడియో గేమ్స్, కార్టూన్స్ చూస్తూ ఏం తింటున్నామో కూడా తెలీకుండా భోజనం తినేసే పిల్లలు తప్ప అమ్మమ్మ నాన్నమ్మల కథలు వినేవాళ్ళు లేరు. నేటి మేటి రెస్టారెంట్లలో తప్ప కలిసి కూర్చుని అమ్మ చేతి వంటని ఆస్వాదించే యువత తగ్గిపోయింది. సోషల్ నెట్వర్కులు, ఫొన్లు, మెసేజుల్లొ ప్రేమించుకునే జంటలు తప్ప కన్నులతో ప్రేమించుకుని మనసుతో నవ్వుకునే వాళ్ళ సంఖ్య తగ్గింది. అమ్మతో ఫొన్లో క్షేమసమాచారాలు తెలుసుకునే వారు తప్ప ఒళ్ళో పడుకుని కబుర్లు చెప్పి, లేదా అమ్మ చెప్తే వినే బిడ్డలు లేరు. మన గజిబిజి బతుకులే ఈ మార్పుకి కారణమా ? ఆత్మీయులు అవసరానికి వచ్చే రోజులు పోయి, అవసరానికి ఆత్మీయతలు ఏర్పడే రోజులు వచ్చాయి. ఒకప్పుడు పరిణయానికి పరిచయాలు ఏర్పాటు చేసేవారు కాని ఇప్పుడు పరిచయాల్ని పరిణయంగా మారుస్తున్నారు. ఆనందాన్ని అమ్మకానికి పెట్టేస్తున్నారు, దాని విలువ జీవితం అని గ్రహించేసరికి జీవితకాలం గడిచిపొతుంది. ఆకాశంలో చందమామని అమ్మ వేలితో చూసిన మనం, అదే చందమామపై మన కాలివేళ్ళతో అడుగులేయాలని ఆరాటపడుతున్నాం. డబ్బు కష్టాల్ని ఆత్మీయుల వల్ల దూరం చేసుకునే రోజుల నుండి, డబ్బుపై ఇష్టంతో కష్టపడి ఆత్మీయులని దూరం చేసుకునే స్థాయికి ఎదిగాం. అనుభవాల్ని నాటకాలుగా చూపేవాళ్ళం కాని ఇప్పుడు నటననే అనుభవంగా మిగుల్చుకుంటున్నాం. ప్రేమకోసం ఓడిపోయే నాటి నుండి గెలుపుకోసం ప్రేమని ద్వేషించే స్థితికి వచ్చాం. బంధాలు, అనుబంధాలు మనం వేసుకునే చొక్కా విలువ చేయని ఈ రోజున, ఎవరి చొక్కా వెనుక ఉండే గుండెల్లోనూ మనకి స్థానం దక్కదు. ఇకనైనా పదుగురి హృదయాలలో చోటు సంపాదించేలా, వారి జీవితాల్లో సైతం మన విలువ పెంపొందించేలా జీవనాన్ని మలుచుకుందాం. బంధాల్ని నిలుపుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: