తెలంగాణ వచ్చేసింది, ఆ ప్రాంత వ్యాప్తంగా టీఆర్ ఎస్ సీట్ల సునామీని సృష్టిస్తుంది.. అనే ఊహాగానాలున్నాయి. దాదాపుగా అన్ని సర్వేలూ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజల మనుసులను గెలుచుకొన్నదని, ఇదే ఊపులో ఎన్నికల్లో కూడా సంచలనాత్మక విజయం సాధిస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ క్రెడిట్ మొత్తం టీఆర్ ఎస్ సొంతం అని, తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ కన్నా టీఆర్ఎస్్ కే అనుకూల పరిస్థితి ఉంటుందని అంటున్నారు. మరి ఇలాంటి ఊహాగానాలు, విశ్లేషణలు, సర్వేలూ యావత్ తెలంగాణలోనూ నిజం అయినా... ఆ రెండు జిల్లాల్లో మాత్రం టీఆర్ఎస్ కు అంత సీన్ లేకపోవచ్చని అంటున్నారు విశ్లేషకులు. రంగారెడ్డి, హైదరాబాద్ లే ఆ రెండు జిల్లాలు. ఆవిర్భావం నుంచి ఈ రెండు జిల్లాల్లో బలపడలేకపోయింది టీఆర్ ఎస్. ఇక్కడ పార్టీని బలవర్ధకం చేసుకోవడానికి కేసీఆర్ అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే అది సాధ్యం కాలేదు. కనీసం టీఆర్ ఎస్ సభలూ, సమావేశాలు నిర్వహించినప్పుడు కూడా సరైన స్పందన రాదిక్కడ! తెలంగాణ వచ్చాక కూడా ఈ పరిస్థితిలో మార్పేమీ లేదని, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి జెండాపాతే అవకాశాలేమీ లేవని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికీ ఈ రెండు జిల్లాల్లో కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ ల హవా ఉంటుందని, కనీసం బీజేపీ అయినా రెండు మూడు నియోజకవర్గాల పరిధిలో ప్రభావం చూపగలదు కానీ, టీఆర్ఎస్ కు మాత్రం ఆ అవకాశం ఉండదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ రెండు జిల్లాల పరిధిలోని ఎంపీ సీట్లపై తెలుగుదేశం, వైకాపాలు బోలెడు ఆశలు కూడా పెట్టుకొన్నాయి. సెటిలర్లు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాల్లో టీఆర్ఎస్ కు స్థానం దక్కే అవకాశాలు లేవనేది విశ్లేషకులు మాట!

మరింత సమాచారం తెలుసుకోండి: