నగారా మోగింది. ఎన్నికల వేళయ్యింది. పార్టీల, నాయకుల తలరాతలు మార్చే రోజు ఆసన్నమైంది. వీటన్నిటికంటే కూడా సామాన్యుడు తన హక్కును, బాధ్యతను చక్కగా నిర్వర్తించాల్సిన రోజు వచ్చింది. అవును.. ఓటు వేయడం ఒక హక్కు. ఒక బాధ్యత. అంతా ఊహించినట్లే, 16వ లోక్ సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి వీఎస్ సంపత్ షెడ్యూల్ను విడుదల చేశారు. ఈసారి ఏకంగా తొమ్మిది దశల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడానికి రంగం సిద్ధం చేశారు. లోక్ సభ ఎన్నికలతోపాటే ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిసా అసెంబ్లీలకూ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. తెలంగాణలో ఏప్రిల్ 30న, సీమాంధ్రలో మే ఏడో తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఐదేళ్లకోసారి ఎన్నికలు వస్తూనే ఉంటాయి. కానీ, చాలా సందర్భాల్లో దేశవ్యాప్తంగా ఫలితాలు ఒకేలా ఉంటూ ఉంటాయి. శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు.. కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ప్రజలు దాదాపు ఒకేలా స్పందిస్తూ ఉంటారు. ప్రాంతీయ పార్టీలు ఇబ్బడిముబ్బడిగా వచ్చిన తర్వాత ఈ పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. రాష్ట్రాలవారీగా హవా కనిపిస్తూ ఉంటోంది. ఇంతకీ, అన్ని ప్రాంతాల్లోనూ ఇలా ఫలితాలు ఒకేలా రావడానికి కారణం ఏమిటి? దీనికి జవాబు.. అందరికీ తెలిసిందే. ప్రభుత్వ విధానాలు. ధరల పెరుగుదల వల్ల రాజమండ్రిలోని వెంకటలక్ష్మి పడే ఇబ్బంది.. కరీంనగర్లోని సీతవ్వ ఎదుర్కొనే సమస్య ఒకటే. పెట్రోలు ధర పెరుగుదలతో కాశ్మీరులోని ఇమామ్ జేబూ ఖాళీ అవుతుంది. పంజాబ్లోని జర్నైల్ సింగ్ జేబూ ఖాళీ అవుతుంది. పన్ను వసూళ్లతో చిన్న ఉద్యోగిపై పడే భారం ఎంతో పెద్ద జీతం ఉన్న ఉద్యోగిపైనా అంతే భారం పడుతుంది. అందుకే అంతా ఒకేలా స్పందిస్తూ ఉంటారు. సర్వ సాధారణంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటును వేస్తూ ఉంటారు. కనీసం రాబోయే ప్రభుత్వమైనా మంచిగా ఉంటుందని ఆశాభావంతోనే ప్రతిపక్ష పార్టీకి ఓటు వేస్తారు. అందుకే, మన దేశంలో సాధారణంగా ఐదు, పదేళ్లకోసారి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. కానీ, ఓటు హక్కును వినియోగించుకొనే సందర్భంలో ఇటీవలి కాలంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. నిరక్షరాస్యులు ఇప్పటికీ ఎప్పట్లాగే తమ ఓటు హక్కును క్రమం తప్పకుండా వినియోగించుకుంటున్నారు. కానీ, విద్యావంతులు ఎక్కువైన తర్వాత ఓటు హక్కును వినియోగించుకునే వారి సంఖ్య తక్కువవుతోంది. తెలివితేటలు ఎక్కువై కొంతమంది.. నిరాశా నిస్పృహలతో మరికొంతమంది ఓటుకు దూరమవుతున్నారు. పట్టణాల్లో టీవీలు వచ్చిన తర్వాత బద్ధకం మరింత ఎక్కువవుతోంది. దీనికి నిర్లక్ష్యం తోడవుతోంది. అందుకే, పట్టణాల్లో ఓటు హక్కును వినియోగించుకోవడం తక్కువవుతోంది. ఓటు వేయకపోతే మన వాణిని వినిపించేదెలా?? ఉదాహరణకు గల్ఫ్ దేశాల్లోనూ, ఈజిప్టు వంటి నియంతృత్వ దేశాల పరిస్థితినే ఒకసారి చూద్దాం. అక్కడ రాజుదే అధికారం. ప్రజలు బానిసలే. అందుకే, ఏళ్ల తరబడి బానిసత్వంలోనే మగ్గుతారు. గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులిలా మారుతుంది. బానిసత్వంలో ఉన్నప్పుడు ఆగ్రహం కట్టలు తెంచుకున్నప్పుడు మహోద్యమాలు రాజుకుంటాయి. ఇటీవలి కాలంలో అక్కడ జరిగిందదే. సామాన్య ప్రజలు.. ఆర్థికంగా, శారీరకంగా బలహీనులు.. అధికార అండదండలు ఏమాత్రం లేనివారు రోడ్లపైకి వచ్చి తమ సత్తా చూపితే.. మహా బలవంతులు, క్రూర నియంతలు అయిన రాజులే తోక ముడవాల్సి వచ్చింది. దేశం నుంచి పారిపోవాల్సి వచ్చింది. అప్పటికీ తల ఎగరేసిన రాజులు ఊచలు లెక్కించాల్సి వచ్చింది. అటువంటి ఉద్యమాలు మన దగ్గర ఎందుకు రావు? ఏదో ఒక పార్టీయో నాయకుడో పిలుపు ఇస్తే తప్పితే.. డబ్బులు ఇచ్చి లారీలు పెట్టి తరలిస్తే తప్పితే మనం ఎందుకు కదలం? విద్యుత్తు చార్జీలూ సర్ చార్జీలతో బండను మోదినట్టు ప్రభుత్వం మనని బాదుతోందని తెలుసు. అయినా నిమ్మకుంటాం. ఏడాదికి 15 సార్లు ప్రభుత్వం పెట్రోలు ధరలను పెంచుతుంది. పెట్రోలు ధర లీటరుకు ఒక్కసారిగా 50 నుంచి 80 రూపాయలు అయిపోతుంది. అప్పుడు కూడా మౌనంగానే డబ్బులు ఇచ్చి పెట్రోలు పోయించుకుంటాం. ఎవరైనా ఒక వ్యక్తికి అన్యాయం జరిగినప్పుడు.. వాడు ఏం తప్పు చేశాడో అనే ఆలోచిస్తాం తప్పితే.. అన్యాయాన్ని నిలువరించడానికి ప్రయత్నం చేయం. చివరికి, ఆ అన్యాయం మన దగ్గరకు వచ్చిన తర్వాత కూడా అంతే. ఓటు హక్కును వినియోగించుకోవడంలోనూ ఇదే నిర్లక్ష్యం. అలక్ష్యం. బద్ధకం. కానీ, మనలో చలనం రావాలంటే.. మనల్ని కదిలించాలంటే ఆ ఘటన అత్యంత క్రూరమైనదై ఉండాలి. ఇటీవల మన దేశంలోనూ ఒక ఉద్యమం వచ్చింది ఈజిప్టు తరహాలో. ప్రజలు రోడ్లు మీదకు వచ్చి ప్రభుత్వం మెడలు వంచారు. దశాబ్దంన్నర పాటు ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన ముఖ్యమంత్రిని ఇంట్లో అంట్లు తోముకోమని పంపేశారు. అదే నిర్భయ ఘటన. ఆ చైతన్యం అక్కడితో ఆగిపోరాదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా రావాలి. ప్రతి మనిషి ఒక ఉద్యమకారుడు కావాలి. ఆ సమయం ఆసన్నమైంది కూడా. ఎందుకంటే, ఒక వ్యక్తి విద్యుత్తు చార్జీల బాధితుడు. మరొక వ్యక్తి పెట్రో ధరల బాధితుడు. ఇంకొక వ్యక్తి వడ్డీ రేట్ల బాధితుడు. మరొకడు శాంతి భద్రతల బాధితుడు. ఒక వ్యక్తికి ప్రభుత్వమంటేనే ఏవగింపు కలిగింది. ఇంకొక వ్యక్తికి అసలు ఈ దేశంలో ప్రభుత్వం, రాజ్యాంగం, చట్టం అనేవి ఉన్నాయా అన్న అనుమానం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ను కేంద్ర ప్రభుత్వం విభజించిన తీరును చూసిన చాలామందికి కేంద్ర ప్రభుత్వంపై ఇటువంటి ఏవగింపే కలిగింది. ఛీ అన్నారు. చీదరించుకున్నారు. అసలు భారతదేశంలో ఎందుకు ఉన్నాం. తమిళుల తరహాలోనే మనం కూడా ప్రత్యేక దేశం కోరుదాం. ఓటు బ్యాంకు రాజకీయాలే పరమావధి అయిన ఈ ప్రభుత్వంలో మనకు న్యాయం జరగదని తీవ్ర మనో వ్యథకు, ఆందోళనకు గురైన వారు ఉన్నారు. ఇప్పుడు వీరంతా ఏ పార్టీనీ నమ్మడం లేదు. ఏ పార్టీ అయినా ఒకటే. మనలను నమ్మించి గొంతు కోసేదేనని భావిస్తున్నారు. ఇటువంటి నిరాశాపూరిత వాతావరణంలోనే ఓటింగ్ కు దూరంగా ఉంటున్నారు. కానీ, ఈ సమయంలో చేయాల్సింది ఓటింగ్ కు దూరంగా ఉండడం కాదు. కసిగా పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు వేయడం. ఢిల్లీ ప్రజలు చేసిందిదే. ఈ ప్రభుత్వం తమకు భద్రత కల్పించలేదని భావించారు. ఈ ప్రభుత్వం తమ గోడును వినడం లేదని ఆందోళన చెందారు. ఈ ప్రభుత్వంతో తమకు వీసమెత్తు కూడా ఉపయోగం లేదని భావించారు. అందుకే, తమ అధికారాన్ని పక్కాగా ఉపయోగించుకున్నారు. ఢిల్లీలోని అధికార పార్టీని నామరూపాలు లేకుండా చేసేశారు. ఒక సామాన్యుడికి అధికారం కట్టబెట్టారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజలంతా చేయాల్సింది ఇదే. మనది ప్రజాస్వామ్యం. ఇక్కడ ఐదేళ్లకోసారి మనకు తిరుగులేని అధికారం వస్తుంది. దానిని ఉపయోగించుకోవాలి. ఐదేళ్లకోసారి వీళ్లు కాకపోతే వాళ్లు, వాళ్లు కాకపోతే వీళ్లు అన్న పరిస్థితి ఉండకూడదు. మనకు నచ్చని పార్టీని నామరూపాలు లేకుండా తుడిచిపెట్టేయాలంతే. అందుకే ఈసారి కసిగా ఓటు వేయాలి. ఎవరికి ఓటు వేస్తావన్నది కాదు. ఓటు వేయాలి అంతే.

మరింత సమాచారం తెలుసుకోండి: