నీ జననం నీకు తెలిసేసరికి కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. నీ మరణం గూర్చి నీవు అంచనా వేసేసరికి అన్ని సంవత్సరాలు అయిపోతాయి. ఈ రెండింటి నడుమ నీ ప్రయాణం ఎన్నో రోజులు సాగదు.ఈ పయనంలో అడుగుతీసి అడుగు వేసే లోపు మరుగున పడిపోయే జ్ఞాపకలెన్నో. మన బతుకుల్లో ప్రతిక్షణం ఒక అద్భుతం. ఆస్వాదించితే మన జీవితమే మరో మహాభారతం. విజయాన్ని మరుక్షణం మర్చిపోతాం. పరాజయాన్ని ప్రతిక్షణం గుర్తుతెచ్చుకుని చింతిస్తాం. పరాజయాన్ని పాఠంగా చేసుకుని విజయాన్ని విపులంగా చదువు. చంద్రునిలో సైతం మచ్చలున్నప్పుడు మనలోని లోపాలెంత. నీ కన్నీటి సాగరంతో ఏ క్షణంలోనూ నీ జీవితమార్గాన్ని తడిపే యత్నం చేయకు. నీ పాదముద్రలను మరొకరి పయనంలో అడుగులుగా మార్చే ప్రయత్నం చెయ్యి. నీ కదిలే కరములు కర్తవ్యాన్ని నిర్వర్తించిన రోజున నీ కర్ణభేరికి కరతాళధ్వనులు వినిపిస్తాయి. నీ దేహాన్ని ధైర్యంగా నడపగలిగితే దైనందిన వ్యవస్థలోనైనా మార్పులు తేవచ్చు. నీ ప్రయాణం కష్టంగానే ఉంటుంది. అనుభవించు. నిజం నిష్టురంగానే ఉంటుంది. ఆలకించు. ఆద్యంతం ఈ జీవితం ఉత్కంటభరితంగానే ఉంటుంది అయినా ప్రేమించు. నవ్వు..నీ ఆనందాన్ని పదిమందికి పంచినప్పుడు. విలపించు..వేరొకరి కష్టాన్ని నువ్వు అనుభవించినప్పుడు. ఓడిపో..మరొకరి హృదయాన్ని గెలుస్తున్నప్పుడు. చచ్చిపో...పదుగురి జీవితాల్లో నువ్వు బతికుండేటప్పుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: