ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో ఎవరైనా కాస్తంత మంచి పేరున్న మంత్రి ఉన్నారంటే... అది ఏకే ఆంటోనీ మాత్రమే. కేరళ మాజీ ముఖ్యమంత్రి అయిన ఆంటోనీ ప్రస్తుతం రక్షణశాఖ మంత్రిగా ఉన్నాడు. అత్యంత కీలకమైన బాధ్యతల్లో ఉన్నా ఆంటోనీకి నిజాయితీ పరుడిగా పేరుంది. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉండిన ఆయన ఆస్తుల జాబితాను చూసి, ఆయన పాలనా వ్యవహారాలను సమీక్షించే శైలిని బట్టి ఈ విషయాన్ని చెప్పవచ్చు. ప్రతిపక్ష నాయకులు కానీ, జాతీయ మీడియానే గానీ, ఇంకెవరైనా కానీ ఆంటోనీ విషయంలో ఏవైనా ఆరోపణలు చేయాలంటే ఆచితూచి స్పందిస్తారు. ఆ మధ్య రాజ్యసభలో ఆంటోనీ మీద ఏదో ఆరోపణ చేసిన బీజేపీ నేత అరుణ్ జైట్లీ.. వెనువెంటనే తన మాటలను వెనక్కుతీసుకొన్నాడు. ఆంటోనీ నిజాయితీ మీద తమకు నమ్మకం ఉందని స్పష్టం చేశాడు. దేశ భద్రతకు సంబంధించిన అత్యంత ముఖ్య శాఖ అయిన రక్షణ విభాగానికి ఆంటోనీ లాంటి వ్యక్తి అవసరం కచ్చితంగా ఉందని జాతీయ మీడియా విశ్లేషణలు వచ్చాయి. అయితే అక్కడికీ నీతిమంతుడే అయినప్పటికీ సౌమ్యుడు కూడా కావడంతో తన శాఖలో అవినీతిని నియంత్రించలేకపోయాడన్న ఆరోపణలు వచ్చాయి. అయితే అవి ఆంటోనీ రాజకీయ జీవితంపై మచ్చగా నిలవలేవవు. మరి అలాంటి నేపథ్యం ఉన్న నేత ఇప్పుడు తాను పోటీ చేయడం లేదని ప్రకటించాడు. తాను ప్రత్యక్ష్య ఎన్నికల్లో పోటీ చేయడంపై తనకు ఆసక్తి లేదని ప్రకటించాడు. ప్రస్తుతానికి అయితే ఆంటోని రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. పార్టీ కష్టకాలంలోఉన్న ప్రస్తుత సమయంలో అలాంటి వారు ప్రత్యక్ష్య ఎన్నికల్లో పోటీ చేస్తే కొంతమంచి జరుగుతుందని కాంగ్రెస్ పెద్దలు అనుకొన్నారు. అయితే వారి ఆశలపై నీళ్లు చల్లుతూ తనకు ప్రత్యక్ష్య పోరుపై ఆసక్తిలేదని ఆంటోనీ స్పష్టం చేశాడు. కేరళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ప్రజల్లో కూడా మంచోడన్న అభిప్రాయం ఉన్న వ్యక్తి పోటీపై ఆసక్తి చూపకపోవడం కాంగ్రెస్ కు నిజంగా మైనస్సే!

మరింత సమాచారం తెలుసుకోండి: