సీమాంధ్ర ప్రాంత పీసీసీ చీఫ్ గా రఘువీరారెడ్డి నియమితుడు కావడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కాంగ్రెస్ పార్టీని రెండుగా విభజిస్తూ అధిష్టానం రెండు పీసీసీలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు ప్రాంతాల్లోనూ ఎన్నికలను ఎదుర్కోవడానికి వీలుగా కాంగ్రెస్ ఇలా సన్నద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ పదవి కోసం చాలా మంది ఆశావహులే ఉన్నా... ఆ పదవి రఘువీరా రెడ్డినే వరించింది. మెగాస్టార్ చిరంజీవి, బొత్స సత్యనారాయణతో పాటు ఆనం రామనారాయణరెడ్డి తో సహా అనేక మంది నేతలు సీమాంధ్ర పీసీసీ చీఫ్ పదవిని ఆశించారు. అయితే వారందరినీ కాదనుకొని కాంగ్రెస్ అధిష్టానం రఘువీరను పీసీసీ చీఫ్ గా ఎంపిక చేసింది. మరి ఇప్పుడు జనిస్తున్న సందేహం ఏమిటంటే... రఘువీర ను రెడ్డి అనుకొని పీసీసీ చీఫ్ ను చేశారా? సీమాంధ్ర ప్రాంతంలోని రెడ్లను ఆకట్టుకోవచ్చనే కాంగ్రెస్అధిష్టానం ఆయనకు ముఖ్యపదవిని ఇచ్చి సత్కరించిందా? వాస్తవానికి రఘువీరా రెడ్డి "రెడ్డి'' కాదు. గొల్ల సామాజికవర్గానికి చెందిన ఈయన ఇంటి వాళ్లు తరాలుగా "రెడ్డి'' ని తగిలించుకొన్నారు. అయితే అధిష్టానం అంత అమాయకత్వంతో పదవిని ఇవ్వలేదని, రఘువీరా రెడ్డి "యాదవ్' అనే విషయం ఢిల్లీ పెద్దలకు ఎరుకేనని బీసీ వర్గాలను ఆకట్టుకొనే పనిలో భాగంగా రఘువీరను పీసీసీ చీఫ్ గా చేశారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అధిష్టానికి విధేయుడు కావడం, బలహీన వర్గానికి చెందిన వాడు అయినందు వల్లనే రఘువీరకు ఆ పదవి దక్కిందని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: