ప్రేమ...రెండక్షరాల ఈ పదానికున్న చరిత్రని వర్ణించటానికి నా ఈ రెండు పదుల వయసు సరిపోదు కాని ఈ రెండు దశాబ్దాల్లో ప్రేమ విలువ ఎంత దిగజారిపోయిందో మాత్రం తెలుసు. పరిచయంతో మొదలయ్యే ప్రేమని పరిణయం తర్వాత కూడా కొనసాగిస్తున్న జంటలెన్ని. సాక్షులు లేని ఆక్రమణగా ప్రేమ మారిపోతుంది కాని ఆత్మసాక్షి ఒకటుందని అది ప్రత్యక్ష సాక్షి అని మరచిపోతున్నారు. ఒకరు చూసి నవ్వితే ప్రేమా? ఏడిస్తే ఓదారిస్తే ప్రేమా? కన్నీటి తడి తగలకుండా నిత్యం నీ ప్రేయసి/ప్రేమికుడిని నీవల్ల నవ్వుతూ నిత్యం బ్రతికేలా చేయటం ప్రేమలో ఒక భాగం. గత 30 ఏళ్ళల్లో విజ్ఞానం పెరిగిందో లేదో గాని విచక్షణ మాత్రం తగ్గుతూనే ఉంది. ప్రేమ కూడా విజ్ఞానమే కాని విచక్షణారహిత జ్ఞానం కాదు. ప్రేమ ఒక వ్యసనమే కాని అది ఆరోగ్యానికి హానికరం కాకూడదు. ప్రేమ ఒక సంగమమే కాని సంయోగం మాత్రమే కాకుడదు. ప్రేమ ఒక అద్భుతం దాన్ని అద్వైతంగా మార్చొద్దు. యాసిడ్ దాడులు, ఆత్మహత్యలు, హత్యలు, విడాకులు, పెళ్ళిళ్ళు, సంబరాలు,.....వీటి మధ్య బలైపోతున్న జీవితాలెన్నో, ప్రేమ విలువని దిగజారుస్తున్న దాఖలలు కూడా అన్నే. అమ్మ ఆలోచనలో ప్రేమ ఉంటుంది. నాన్న ఆచరణలో ప్రేమ ఉంటుంది. సన్నిహితుల సహచర్యంలో ప్రేమ ఉంటుంది. మన జీవనవిధానంలో అణువణువూ ప్రేమ నిండి ఉంటుంది.....మిత్రమా, ప్రేమని నిలబెడదాం, మనం కూడా నిలబడదాం. ప్రేమ గౌరవాన్ని పెంచుదాం మనం తలెత్తుకుని తిరుగుదాం. అపరభగీరధుడు గంగ కోసం చేసినంత తపస్సు చేయకపోయినా ప్రేమ ఉషస్సుని నిలిపేందుకు సముద్రంలో నీటిబొట్టంత సాయమైనా చేద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: