ప్రజారాజ్యం పార్టీని పునరుద్ధరించాలని కేంద్రమంత్రి చిరంజీవి భావిస్తున్నారా?. పీఆర్పీని కాంగ్రెస్ లో కలిపేసినందుకు మెగాస్టార్ ఫీలవుతున్నారా?. తమ్ముడు పవన్ కల్యాణ్ పార్టీ పెట్టడంతో అన్నయ్య మనసు కూడా సొంత పార్టీ వైపు లాగుతోందా?. సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సమావేశంలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు అర్థమేంటి?. కేంద్రమంత్రి చిరంజీవి కొత్త విషయాన్ని బయట పెట్టారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావాలని అభిమానులు తనపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. పీఆర్పీని పునరుద్ధరించాలని బలవంతం చేస్తున్నారని వెల్లడించారు. అయితే చిరంజీవి మాత్రం సోనియా గాంధీకి ఇచ్చిన మాట కోసం కాంగ్రెస్ లోనే కొనసాగుతానన్నారు. అయితే చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు కొత్త అనుమానాలకు తెరలేపుతున్నాయి. మెగాస్టార్ పీఆర్పీని పునరుద్దరించే ఆలోచనలో ఉన్నారా అన్న సందేహాలకు తావిస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లోకి మెరుపు వేగంతో దూసుకొచ్చిన చిరంజీవి... అదే స్పీడ్ తో పాతాళానికి పోయారు. తనకున్న లక్షలాది మంది అభిమానుల మీద ఆశలు పెట్టుకుని 2009లో చిరంజీవి పీఆర్పీని స్థాపించారు. ఎన్నికలకు కేవలం తొమ్మిది నెలల ముందు రాజకీయాల్లోకి వచ్చి అధికారాన్ని అందుకోవాలన్న మెగాస్టార్ ఆశలపై అభిమానులు నీళ్లు చల్లారు. సినిమాలు చూసి ఈలలు వేసే ఫ్యాన్స్ అందరూ... పోలింగ్ బూత్ లో ఓట్లు వేయరని నిరూపించారు. దీంతో పార్టీని నడపలేక కాంగ్రెస్ లో విలీనం చేశారు చిరంజీవి. రాష్ట్రంలో తమ ప్రభుత్వం కష్టాల్లో ఉన్న సమయంలో ఆదుకున్న చిరంజీవికి... కాంగ్రెస్ హైకమాండ్ ప్రాధాన్యత ఇచ్చింది. కేంద్ర మంత్రి పదవిలో కూర్చోబెట్టింది. పైగా రాష్ట్రం విడిపోయాక సీమాంధ్ర ప్రాంతంలో సముచిత స్థానం కల్పించింది. అయితే అంతా బావుందనుకున్న సమయంలో అభిమానుల పేరు చెప్పి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. పీఆర్పీని పునరుద్ధరించాలన్న ప్రతిపాదన నిజంగా అభిమానులే చేశారా?.. లేకపోతే వారి పేరుతో చిరంజీవి మనసులో బయట పెట్టారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. మొత్తానికి తమ్ముడు పార్టీ పెట్టిన రెండ్రోజులకే చిరంజీవి పీఆర్పీ పునరుద్ధరణ ప్రస్తావన తీసుకురావడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: