ఎన్డీయేలో కొత్త మిత్రుల కోసం బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేనలను కూటమిలోకి తెచ్చేందుకు ఓ వైపు ప్రయత్నాలు సాగుతూ ఉండగానే పొరుగునే ఉన్న తమిళనాడులో అయిదు పార్టీలు ఎన్డీఏ కూటమిలో చేరాయి. ఎండీఎంకే, డీఎండీకే, పీఎంకే సహా ఆరు పార్టీలతో తమిళనాడులో బీజేపీ మహా కూటమిని ఏర్పాటు చేసింది. అధ్యక్షుడు రాజ్ నాథ్ సమక్షంలో పొత్తు లాంఛనం పూర్తయింది. డీఎంకే, అన్నాడీఎంకే లేకున్నా.. ఈ సారి తమ కూటమి మెజార్టీ లోక్ సభ స్థానాలను సాధిస్తుందని బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ హవాతో కేంద్రంలో అధికారం ఖాయం అని ధీమాగా ఉన్న బీజేపీకి అన్నీ శుభశకునాలే వస్తున్నాయి. కొత్త మిత్రులు లేక దిగాలుగా ఉన్న ఆ పార్టీ చెంతకు ఒక్కొక్కరే నడిచి వస్తున్నారు. ఇటీవలే బీహార్ లో లోక్ జన శక్తి పార్టీతో పొత్తు కుదుర్చుకున్న బీజేపీ.. ఏపీలోనూ తెలుగుదేశం పార్టీ, పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీతో గ్రాండ్ అలయన్స్ పేరుతో కూటమి ఏర్పాటు చేయబోతోంది. ఏపీ పొత్తులపై ఓ వైపు చర్చలు సాగుతుండగానే తమిళనాడులో బీజేపీ అలాంటి కూటమిని లాంఛనంగా ఏర్పాటు చేసుకుంది. బీజేపీ సహా ఆరు పార్టీలు లోక్ సభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయనున్నాయి. వైగో నేతృత్వంలోని ఎండీఎంకే, సినీ నటుడు విజయ్ కాంత్ ఆధ్వర్యంలోని డీఎండీకే, రాందాస్ పీఎంకే, కేఎండీకే, ఐజేకే పార్టీలు ఒకే గొడుకు కిందకు చేరాయి. చెన్నైలో బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ సమక్షంలో ఆయా పార్టీల మధ్య పొత్తుపై చర్చలు ముగిసాయి. తమిళనాడులో చాలా రోజుల తర్వాత ఇన్ని పార్టీలతో కలిసి బరిలోకి దిగడం శుభపరిణామం అని, ఈ మిత్రబంధం విజయవంతం అయి లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి కూటమి వీలైనన్ని సీట్లను గెల్చుకుంటుందని బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. దేశంలో మోడీ ప్రభంజనం వీస్తున్న మాట వాస్తవమే అని, ఎన్డీయే అధికారంలోకి వచ్చి ఆయన ప్రధాని కావడానికి తమ వంతు కృషి చేస్తామని గ్రాండ్ అలయన్స్ నేతలు విజయ్ కాంత్, రాందాస్ అన్నారు. మోడీతో పవన్ భేటీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం అహ్మదాబాద్ లో గుజరాత్ సిఎం నరేంద్రమోడీతో భేటీ అవుతున్నారు. దేశంలో, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: