కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎంతో ఉన్న సఖ్యత గురించి అందరికీ తెలుసు...గతంలో కాంగ్రెస్ ..ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంది.. రీసెంట్ గా అసదుద్దీన్ , అక్బరుద్దీన్ ల కేసుల విషయంలో ఈ రెండు పార్టీల మధ్య రిలేషన్ దెబ్బతిన్నది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఐతే రాజకీయాల్లో ఇదంతా కామనే అని మరోసారి ఈ రెండు పార్టీలు ప్రూవ్ చేస్తున్నాయి...ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో మళ్లీ పాతబస్తీ పార్టీతో నయాదోస్తీ కట్టేందుకు కాంగ్రెస్ రెడీ అయింది.. హైదరాబాద్ లో బలమైన రాజకీయ పార్టీగా గుర్తింపు పొందిన ఎంఐఎం మరోసారి కాంగ్రెస్ పార్టీతో జత కట్టే సూచనలు కనిపిస్తున్నాయి. మేయర్ మాజిద్ హుస్సేన్ రాజీనామా ఆమోదం కోసం నిర్వహించిన కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో ఇరు పార్టీల మధ్య జరిగిన హైడ్రామా... పొత్తు అంశాన్ని చెప్పకనే చెప్పినట్లయింది. మేయర్ మాజిద్‌ హుస్సేన్‌ రాజీనామాను కౌన్సిల్ తిరస్కరించింది. కాంగ్రెస్, ఎంఐఎం ఫ్లోర్ లీడర్లు మేయర్ రాజీనామాకు ఆమోదం తెలపలేదు. మరోవైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఎలా రాజీనామా చేస్తారంటూ ప్రశ్నించిన టీడీపీ, బీజేపీ... సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. కాగా కాంగ్రెస్, ఎంఐఎంల ఒప్పందం ప్రకారం ఎంఐఎంకు చెందిన మేయర్ పదవీకాలం జనవరిలోనే ముగిసింది. అయితే, అంతకుముందు కాంగ్రెస్ మేయర్ బండ కార్తీక రెడ్డి రెండు నెలలు అదనంగా ఉన్నందున తాను కూడా రెండు నెలలు అదనంగా ఉన్నానని మాజిద్ చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి విషయంలో జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్-ఎంఐఎం పార్టీల సఖ్యతను వెల్లడిస్తున్నాయి. నిన్నటివరకూ పార్టీ ఆదేశానుసారమే రాజీనామా చేసినట్టు చెప్పుకున్న మేయర్ మాజిద్ హుస్సేన్, ఎంఐఎం కార్పొరేటర్లు ఇప్పుడు మాట మార్చారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మేయర్ గా బాధ్యతలు నిర్వహించిన బండ కార్తీకరెడ్డి రెండు నెలల పాటు అధికంగా ఉండటంతో రెండు నెలల పాటు మేయర్ గా కొనసాగామని చెప్పుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ దిడ్డి రాంబాబు కూడా మేయర్ మాజిద్ హుస్సేన్ రాజీనామాను ఆమోదించకపోవడానికి ఎన్నికల కోడే కారణమంటున్నారు. ఎన్నికల వ్యవహారం ముగిసిన తర్వాత మాజిద్ రాజీనామాను ఆమోదించి మేయర్ పీఠాన్ని తాము సాధించుకుంటామంటున్నారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల పొత్తు ఖరారయితే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వివిధ నియోజకవర్గాలలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న ఆశావహుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ ఈ సమయంలో ఎవరితోనైనా పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమైంది. గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీని బలోపేతం చేయాలంటే ఎంఐఎంతో పొత్తు కంపల్సరీ అని భావిస్తోంది...మరి ఈ బంధం ఎలా కలుస్తుందో...ఎన్నాళ్లు నిలుస్తుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: