ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ... అన్ని పార్టీలు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాయి. తమతో కలిసి వచ్చే పార్టీల కోసం వెతుక్కుంటున్నాయి. అయితే టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం పొత్తుల విషయాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ తో పొత్తుండదని ఇప్పటికే తేల్చి చెప్పిన కేసీఆర్... సీపీఐని కూడా దూరం పెడుతున్నారు. తాము టీఆర్ ఎస్ తో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నా... కేసీఆర్ తమను పట్టించుకోవడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఉద్యమ పార్టీగా పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు ఫక్తు రాజకీయ పార్టీగా మారిపోయింది. తెలంగాణలో అధికారాన్ని దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఏ పార్టీతో పొత్తు లేకుండా అత్యధిక స్థాయిలో లోక్ సభ, అసెంబ్లీ స్థానాలను గెల్చుకుని సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కలలు కంటోంది. కేసీఆర్ వ్యూహాలు, ఆశలు ఎలా ఉన్నా గత చరిత్రను పరిశీలిస్తే... టీఆర్ ఎస్ బలంపై చాలా సందేహాలు వస్తున్నాయి. 13 ఏళ్ల ఉద్యమ చరిత్ర ఉన్న టీఆర్ ఎస్ ఇప్పటిదాకా మూడు పదుల అసెంబ్లీ స్థానాలను గెలుచుకోలేకపోయింది. తెలంగాణలో ఉద్యమం ఉవ్వెత్తున జరిగిన రోజుల్లో కూడా కేసీఆర్ అత్యధిక స్థానాలు గెలుచుకోలేక పోయారన్నది వాస్తవం. కాంగ్రెస్, బీజేపీలు తీసుకున్న నిర్ణయం వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారమైంది. కాంగ్రెస్, బీజేపీలను తెలంగాణకు అనుకూలంగా మార్చడంలో టీఆర్ ఎస్ దే మెయిన్ రోల్. గత దశాబ్ద కాలంలో జేఏసీలు, ఉద్యమ పార్టీల మద్దతుతో ఉద్యమాన్ని తీవ్రం చేయడంతో పాటు... క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఉద్యమాన్ని నడిపించడంలో కేసీఆర్ విజయవంతమయ్యారన్నది నిజం. తెలంగాణ ఏర్పాటు విషయంలో కేసీఆర్ హీరో అన్ని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలతో పాటు టీడీపీకి కూడా ట్రై చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో టీఆర్ఎస్ వంద సీట్లు, 16 పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవాలన్న కేసీఆర్ ఆశలు నెరవేరడం కష్టమే. హైదరాబాద్ జంట నగరాలతో పాటు జీహెచ్ ఎంసీ పరిధిలో మొత్తం 24 అసెంబ్లీ స్థానాలున్నాయి. అయితే రాజధానిలో అంతంత మాత్రమే బలమున్న టీఆర్ ఎస్ ఎక్కువ సీట్లను గెలుచుకుంటుందా అనే ప్రశ్నకు సమాధానం కష్టమే. జీహెచ్ఎంసీ కాకుండా తెలంగాణలో 95 స్థానాలున్నాయి. ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ మాంచి ఊపు మీదే ఉన్నా... దక్షిణ తెలంగాణలో ఆ పార్టీకి పెద్దగా బలం లేదు. దక్షిణ తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ కు పెద్దగా కేడర్ లేదు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో గులాబీ పార్టీ హవా నడుస్తుంటే... నల్లగొండ, మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో ఎన్ని సీట్లు గెలుస్తారో ఆ పార్టీ నాయకులే చెప్పలేకపోతున్నారు. తెలంగాణ తెచ్చింది మేమే అంటూ కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ముందుకెళ్తుంటే... మోడీ క్రేజ్ ను అడ్డుపెట్టుకుని బీజేపీ దూసుకుపోతోంది. హైదరాబాద్ లో ఎంఐఎం తన సీట్లన్నీ దాదాపుగా గెలుచుకునే అవకాశముంది. తెలంగాణలో అన్ని పార్టీల కంటే బలమైన కేడర్ ఉన్న టీడీపీ కూడా టీఆర్ ఎస్ కు పోటీ ఇచ్చే అవకాశముంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజీపీతో పాటు మిగతా పార్టీల నుంచి కూడా టీఆర్ ఎస్ కు బలమైన పోటీ ఖాయంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచి... సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత సత్తా కేసీఆర్ కు ఉందా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో నెలకొన్నాయి. తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలుచుకుంటామన్న ఆయన ధీమా వాపా, బలుపా అన్నది త్వరలోనే తేలనుంది.    

మరింత సమాచారం తెలుసుకోండి: