రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనపై కేంద్రం సమాలోచన చేస్తుందా..? రాష్ట్రపతి పాలనను వెనక్కి తీసుకొని.. మళ్లీ కొత్తగా అమలు చేయాలని చూస్తుందా..? రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనపై కేంద్రం సమాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించి నెల రోజులు పూర్తి అవుతోంది. రాష్ట్రపతి పాలన విధించిన రెండు నెలలోపు అంటే మే 1లోపు పార్లమెంట్ దాన్ని ఆమోదించాలి. ఈ నేపథ్యంలో రాజ్యాంగ నిబంధన నుంచి తప్పించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త ఎత్తు వేస్తున్నట్టు తెలుస్తోంది.ఇప్పుడు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సందడి జోరందుకున్నందున ఎంపీలందరూ ఎన్నికల ప్రచార హడావుడిలో ఉన్నారు. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనకు ఆమోద ముద్ర వేసేందుకు ఈ నెల 7 లోపు పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశం కావాలి. కానీ అది సాధ్యమయ్యేలా కనిపించడంలేదు. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేసినట్టుగా ప్రకటించి, వెంటనే మళ్లీ రాష్ట్రపతి పాలన విధించే యోచనలో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీనివల్ల కేంద్రానికి.. పార్లమెంటు ఆమోద ముద్ర కోసం మరో రెండు నెలల సమయం లభించినట్టవుతుంది. ఈలోగా.. అంటే ఏప్రిల్ 7 నుంచి మే 12 లోపు ఎన్నికల హడావుడి ముగిసిపోతుంది. అయితే, ఈ నిర్ణయాన్ని ఎవరైనా కోర్టులో సవాల్ చేస్తే ప్రభుత్వం న్యాయస్థానం నుంచి ప్రశ్నలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకు ముందెన్నడూ ఇలా జరిగిన సందర్భాలు లేవు కాబట్టి.. ఇప్పుడు తుది నిర్ణయం కేంద్ర కేబినెట్ చేతుల్లోనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: