తెలంగాణ వచ్చేసింది కనక ఇప్పుడు టీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండాలి? తెలంగాణ వ్యాప్తంగా ఆ పార్టీ జెండాలు రెప రెపలాడుతూ ఉండాలి. సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్, అసెంబ్లీ, లోక్ సభ.. ఇలా ఏ ఎన్నికలైనా సరే.. ఒంటరిగా బరిలోకి దిగిన టీఆర్ఎస్ ఘన విజయం సాధించాలి. క్లీన్ స్వీప్ లు చేసేయాలి. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఐ.. ఏ పార్టీలైనా సరే దానితో పొత్తుకు తహతహలాడాలి. ప్లీజ్ మమ్మల్ని చేర్చుకోండి. మాతో పొత్తు పెట్టుకోండి అని బతిమలాడితే.. ‘సింహం మాత్రమే సింగిల్ గా వెళుతుంది. పందులే గుంపులు గుంపులుగా వస్తాయి’ అంటూ వాళ్లని టీఆర్ఎస్ ఈసడించుకోవాలి. అభ్యర్థులు ఎవరనే వాళ్లతో సంబంధం లేదు.. కేసీఆర్ కుక్కని నిలబెడితే అది కూడా లక్ష ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించాలి. తన పోరాటంతో తెలంగాణను తీసుకొచ్చిన టీఆర్ఎస్ పై అంతగా ప్రజాభిమానం వెల్లివిరియాలి. గజ్జెకట్టిన తెలంగాణవాదంతో టీఆర్ఎస్ లోనూ తెలంగాణలోనూ ఆనందోత్సాహాలు వెల్లి విరుస్తూ ఉండాలి. కానీ, తెలంగాణ రాష్ట్ర సమితి 13 ఏళ్లపాటు ఉద్యమం చేసినా.. తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి ఇప్పుడు ఇందుకు పూర్తి భిన్నం. మాతో పొత్తు పెట్టుకోండి బాబూ అంటే ఆ పార్టీయే మిగిలిన పార్టీలను దేబిరించాల్సిన పరిస్థితి. ఇంకా చెప్పాలంటే, చివరికి మాది సమైక్య వాదమేనని కుండ బద్దలు కొట్టిన సీపీఎంతో అయినా పొత్తు పెట్టుకుందామని భావించాల్సిన దుస్థితి. వాస్తవానికి, కేసీఆర్ ఎప్పటి నుంచో తమది ఒంటరి పోరేనని, 2014 ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఎప్పటి నుంచో చెబుతున్నారు. తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత కూడా ఆయన తన మాటకు కట్టుబడి ఉన్నారు. నిన్న మొన్నటి వరకు ఎవరితో పొత్తు పెట్టుకోకుండానే ఎన్నికలకు వెళ్లాలని, వందకుపైగా అసెంబ్లీ సీట్లు సాధించేసి మూడింట రెండు వంతుల మెజారిటీతో తొలి తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కలలు కన్నారు. కానీ, కొద్ది రోజుల్లోనే ఆయన కలలు కల్లలుగా మారుతున్న చిత్రం కళ్లకు కట్టింది. తెలంగాణ వాదం ఓట్లన్నీ తన సొంతం అని భావించిన కేసీఆర్ కు ఇప్పుడు అసలు వాదం స్పష్టమైంది. తెలంగాణ వాదం ఓట్లను కాంగ్రెస్, బీజేపీ పంచుకుంటున్నాయని తెలిసింది. దానికితోడు, ప్రత్యేక రాష్ట్రం వచ్చేసింది కనక టీడీపీకి సంప్రదాయ బద్ధంగా ఉన్న ఓట్లన్నీ ఆ పార్టీకే పడనున్నాయని, దీనికితోడు చంద్రబాబు విసిరిన ‘బీసీ కే సీఎం పదవి’ పాచిక కూడా పారుతోందని కాస్త ఆలస్యంగా అర్థమైంది. టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకుని.. కాంగ్రెస్, సీపీఐ, ఎంఐఎం కలిస్తే... తాను ఒంటరిగా వెళితే ఎన్నికల్లో నష్టపోక తప్పదనే తత్వం బోధపడింది. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ వాదమే టీఆర్ఎస్ ప్రాణం. వాదం ఉంటేనే టీఆర్ఎస్ కూ నాలుగు ఓట్లు పడతాయి. వాదం లేకపోతే టీఆర్ఎస్ కూడా అవుటవక తప్పదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రాకముందు తెలంగాణ వాదం తారస్థాయిలో ఉంది. అందుకే టీఆర్ఎస్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తెలంగాణ వచ్చేసిన తర్వాత వాదం అనేది ఉండదు. తదుపరి తెలంగాణకు ఏం కావాలి? ఎవరు కావాలి? అనే విషయంపైనే ప్రజలు కూడా ఆలోచిస్తారు. తమకు ఎవరు మేలు చేస్తారని భావిస్తారో వాళ్లకే ఓట్లు వేస్తారు. అంతే తప్పితే, తెలంగాణను తెచ్చిందని టీఆర్ఎస్ నో, తెలంగాణను ఇచ్చిందని కాంగ్రెస్ నో నెత్తి మీద పెట్టుకునే పరిస్థితి ఉండదు. కాకపోతే, అభిమానం ఉంటుందంతే. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. అభిమానం వేరు. ఎన్నికల్లో ఓట్లు వేయడం వేరు. టీఆర్ఎస్ మీద 2001 నుంచీ ప్రజల్లో అభిమానం ఉంది. ఆ పార్టీయే తెలంగాణను తెస్తుందని, తెలంగాణకు అదే చాంపియన్ అని ప్రజలు భావించారు. దానిమీద అభిమానం పెంచుకున్నారు. కానీ, ఏ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఓట్ల శాతం నాలుగు శాతాన్ని దాటలేదు. 2009 ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ ఓట్ల శాతం 3.99. సరే.. తెలంగాణ కోసం ఉద్యమించింది కనక.. ఇప్పుడు తెలంగాణ వచ్చింది కనక కొంతమంది ఆ పార్టీ వైపు మొగ్గారనుకుందాం. అది మరో ఆరు శాతం ఓట్లు పెరిగితే చాలా ఎక్కువగా భావించవచ్చు. అంతే తప్ప, తెలంగాణ తెచ్చింది కనక గతంలో ఉన్న నాలుగు శాతం ఓట్లు ఇప్పుడు 34 శాతం కావడమనేది దాదాపు అసాధ్యమనే భావించవచ్చు. అదే జరిగితే అది నిజంగా ప్రపంచంలో ఎనిమిదో వింతే. ఈ నేపథ్యంలోనే, పెద్ద పల్లి ఎంపీ వివేక్ చేయించిన సర్వేలోనూ, టీఆర్ఎస్ సొంతంగా చేయించుకున్న సర్వేలో కూడా ఈ విషయం స్పష్టమైందని తెలుస్తోంది. కాంగ్రెస్ తో పొత్తు లేకుండా ఒంటరిగా వెళితే టీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ తప్పదనేది ఆ సర్వేల సారాంశం. నిజానికి, టీఆర్ఎస్ కు భావోద్వేగపరమైన ఓట్లు తప్ప సంస్థాగతమైన ఓట్లు లేవు. కాంగ్రెస్ కు సంస్థాగతమైన ఓట్లు దండిగా ఉన్నాయి. వాటికి ఇప్పుడు భావోద్వేగపరమైన ఓట్లు కూడా కొంతలో కొంత తోడవుతున్నాయి. దీంతో ఆ పార్టీ పరిస్థితే తెలంగాణలో కాస్త మెరుగ్గా ఉందని సర్వేల్లో స్పష్టమైంది. దానితో పొత్తు పెట్టుకుంటేనే బయటపడవచ్చని కూడా టీఆర్ఎస్ అగ్ర నేతలకు అర్థమైందని తెలుస్తోంది. అందుకే.. టీఆర్ఎస్ కు మా ద్వారాలు తెరిచే ఉన్నాయని దిగ్విజయ్ సింగ్ పదే పదే చెప్పినా ఎడమ కాలితో తన్నేసిన కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని పావులు కదుపుతున్నారు. ఇందుకు వీలైనన్ని మార్గాల్లో ఎత్తులు వేస్తున్నారు. అయితే, ఇప్పటి వరకూ టీఆర్ఎస్ కోసం ఎదురు చూసిన కాంగ్రెస్ ఇప్పుడు తలుపులు మూసేసింది. బీజేపీ కూడా టీడీపీతో పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక, సీపీఐ, ఎంఐఎం పార్టీలు కాంగ్రెస్ తో కలిసే వెళుతున్నాయి. ఇక మిగిలింది సీపీఎం, వైసీపీ, న్యూ డెమోక్రసీ, ఆర్ఎల్ డీ, బీఎస్పీ పార్టీలు. వాస్తవానికి, వీటిలో సీపీఎం చివరి వరకు సమైక్య వాదానికి కట్టుబడి ఉంది. మిగిలిన అన్ని పార్టీలూ పిల్లి మొగ్గలు వేసినా సీపీఎం మాత్రం తన సిద్ధాంతానికి కట్టుబడి ఉంది. ఇప్పుడు ఎన్నికల వేళ, ఆ పార్టీతోనూ పొత్తుకు టీఆర్ఎస్ సై అంటోంది. ఆ పార్టీ ఏడు సీట్లు అడుగుతోందని, చర్చలు జరుగుతున్నాయని టీఆర్ఎస్ నేతలే స్పష్టం చేశారు. ఒకవేళ టీఆర్ఎస్ తో పొత్తుకు సీపీఎం కూడా ఛీ అందనుకోండి. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ తో పొ్తును పరిశీలించవచ్చు. దీనిని కాదనడానికి వీల్లేదు. సమైక్య వాదమన్న సీపీఎంతో పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, కొండా దంపతులను పార్టీలో చేర్చుకున్న తర్వాత వైసీపీ, టీఆర్ఎస్ పొత్తుకు కూడా అవకాశాలు ఉన్నట్లే. ఒకవేళ వైసీపీ కూడా కాదందని అనుకోండి. అప్పుడు దిలీప్ కుమార్ నేతృత్వంలోని ఆర్ఎల్ డీతో పొత్తుకు టీఆర్ఎస్ ప్రయత్నించవచ్చు. చివరికి బీఎస్పీతో అయినా కలిసి సాగాలని నిర్ణయించవచ్చు. బీఎస్పీ భావజాలం, టీఆర్ఎస్ భావజాలం ఒకటే కనక చివరికి ఇది కుదరవచ్చేమో చూడాలి మరి. అది కూడా కుదరలేదనుకోండి. కేసీఆర్ ఇప్పటి వరకు పదే పదే చెప్పినట్లు ‘సింహం’ సింగిల్ గానే వెళుతుంది ఎన్నికలకి.

మరింత సమాచారం తెలుసుకోండి: