తెలుగుదేశం- భారతీయ జనతా పార్టీల మధ్య పొత్తు కుదిరింది. అచ్చంగా పుష్కరం తరువాత.. పచ్చ పార్టీ, కాషాయదళంలోకి కలిసి వస్తున్నట్లు జవదేకర్‌ జీ ముసిముసి నవ్వులు చిందిస్తూ ప్రకటించారు. కానీ చంద్రబాబు చాణక్యుడు. ప్రకాష్‌ జవదేకర్‌ ఒక జాతీయ పార్టీకి జాతీయ నాయకుడు అయితే కావొచ్చు గాక.. కానీ చంద్రబాబు పాటవం ముందు ఆయనది దిగదుడుపే. చంద్రబాబు తన అంతరంగాన్ని బయటపడనివ్వకుండా అభావంగా ఉన్న హావభావాలతో.. తాము ఈ పొత్తు కుదుర్చుకుంటున్న నేపథ్యాన్ని వివరించారు. కేవలం దేశం బాగుండడం కోసమే ఈ పొత్తు అని ఆయన అభివర్ణించారు. పొత్తు వల్ల ఇరు పార్టీలకు లబ్ధి ఉంటుందన్న మాట నిజమే కానీ.. కేంద్రంలో దుర్మార్గపు కాంగ్రెస్‌ పాలనను అంతమొం దించడానికి, అన్ని పార్టీలూ ఒక్కటి కావాల్సిన అవసరాన్ని గుర్తించి ఈ పొత్తుకు సిద్ధపడినట్లు ఆయన వివరించారు. చంద్రబాబు మాటలను విన్నవారు ఎవరైనా.. పొత్తుల రూపేణా ఆయన చాలా పెద్ద త్యాగానికి సిద్ధపడుతున్నట్లు భ్రమపడినా ఆశ్చర్యం లేదు. బాబు మాత్రం ఆ స్థాయిలో రక్తి కట్టించారు. ముగిసిన పొత్తు పర్వాన్ని పక్కన పెడితే.. ఆ సందర్భంగా వెల్లువెత్తిన నిరసనల్ని గమనించాలి. తెలంగాణ భాజపా శ్రేణులు యావత్తూ ఈ పొత్తులు వద్దంటూ నినదించాయి. వీరి వెనుక అక్కడి పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఉండి నడిపించాడా? లేదా అనేది వేరే సంగతి. కానీ కిషన్‌రెడ్డి ఈ పొత్తులను ఆదినుంచి ధిక్కరిస్తున్నాడని గుర్తించాలి. అందుగురించి కిషన్‌రెడ్డి, తెదేపాను వ్యతిరేకించే ఇతర పార్టీలకు అమ్ముడుపోయాడంటూ కూడా పచ్చదళం ఓ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ధిక్కార స్వరానికి గాను కాషాయ పార్టీ ఎన్నికలు ముగిసిన వెంటనే.. కిషన్‌పై వేటు వేయనున్నదని కూడా మరో ప్రచారం వచ్చింది. అయితే వ్యవహారాన్ని లోతుగా గమనిస్తే.. కిషన్‌ ఆందోళన సబబు అని మనకు అనిపిస్తుంది. తెలంగాణ ప్రాంతంలో భాజపా ఉనికి కొన్ని ప్రాంతాల్లో బలంగానూ, కొన్ని ప్రాంతాల్లో నామమాత్రంగానూ, కొన్నిచోట్ల శూన్యంగానూ ఉంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనే కల సాకారం కావడంలో కాంగ్రెస్‌తో సమానంగా ప్రజల మన్ననను చూరగొనగల అవకాశం ఆ పార్టీకి వచ్చింది. అందులో సందేహం లేదు. కనీసం ఈ అంశాన్ని చాటుకుంటూ.. తమ అండ లేకుండా అసలు రాష్ట్రం వచ్చేదే కాదని చెప్పుకుంటూ.. వారు పల్లెపల్లెకూ తిరిగితే పార్టీ నిర్మాణం కచ్చితంగా సాధ్యం అవుతుంది. భాజపా అస్తిత్వం శూన్యంగా ఉన్న చోట్ల కూడా కొంత పునాది ఏర్పాటు చేసుకోవడం వారికి ఇప్పుడు సాధ్యం అవుతుంది. తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్‌, తెరాసలు ప్రచారం చేసుకున్న మైలేజీ ప్రకారం ఎన్నికల్లో ఆ ఇద్దరికే తొలి ఎడ్వాంటేజీ ఉంటుందని అనుకోవచ్చు. అయితే.. పార్టీ నిర్మాణం పరంగా.. భాజపాకు ఇది మహదవకాశం. ఏ పార్టీకైనా చరిత్రలో తమ హవా అటు ఇటుగా ఉన్న ప్రాంతంలో పూర్తిస్థాయిలో నిలదొక్కుకోవడానికి ఇంతకంటె మంచి అవకాశం ఎప్పటికీ రాదన్న సంగతి మాత్రం వాస్తవం. తలవని తలంపుగా అంది వచ్చిన సువర్ణావకాశాన్ని భాజపా చేజేతులా జార్చుకుంది. అయితే ఇక్కడే చంద్రబాబు చాణక్యాన్ని మెచ్చుకోవాలి. పొత్తులు అంటూ లేకుంటే తెలంగాణ ప్రాంతంలో భాజపా నిలదొక్కుకుంటుందని, ఎప్పటికీ సొంత అస్తిత్వం గల పార్టీగా ఆవిర్భవిస్తుందని చంద్రబాబుకు తెలుసు. ఇప్పుడు మైలేజీ సాధించిన కాంగ్రెస్‌, తెరాస పార్టీలతో పాటూ భాజపా కూడా తన స్థాయిని తను తయారుచేసుకుంటే.. ఇక రెండు కళ్ల పేరుతో రెండు నాలుకల ధోరణి ప్రదర్శించిన తన పార్టీ పరిస్థితి ఏంటి? భాజపా ఎంత బలపడితే అంత మేర తెలుగుదేశం పతనం కావడమే అని ఆయన చాలా ముందుగా గ్రహించారు. అందుకే ఆ పార్టీ బలోపేతం కాకుండా.. ముకుతాడు వేయడానికి పొత్తు అస్త్రం ప్రయోగించారు. భాజపా అగ్ర నాయకత్వం ఈ విషయాన్ని బేరీజు వేయలేనంత అసమర్థ, అవివేక నాయకత్వం కాదు. అయితే.. ప్రస్తుతం సంక్లిష్టంగా ఉన్న రాజకీయ నేపథ¸్యంలో రేపు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎన్డీయేకు నెంబర్‌గేం అవసరం అయితే.. అప్పుడు ఇతర చిన్నచితక పార్టీలతో బేరసారాలు చేయడానికి, లోపాయికారీ డీల్స్‌ కుదిర్చడానికి వారికి ఒక చంద్రబాబు వంటి నాయకుడి అవసరం ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో సీట్లను ఒరగబెడతాడని కాదు గానీ.. రేపటి అవసరాలకు ఆదుకుంటాడనే ఉద్దేశంతో భాజపా ఆయన పొత్తులకు అంతగా రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి తెచ్చింది. కిషన్‌ తదితరులకు ఎంతమాత్రం ఇష్టంలేని డీల్‌ చేయించింది. ఏతావతా రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. దేశ ప్రయోజనాల కోసమే, దేశాభివృద్ధికి మోడీ నాయకత్వం అవసరం గనుకనే.. భాజపా చేతుల్లోకి రాజ్యాధికారం రావాలి గనుకనే పొత్తులు కుదుర్చుకున్నాం అనే డైలాగులు పైకి పలుకుతూ.. చంద్రబాబు.. చాలా చక్కగా.. ఆ పార్టీకి తెలంగాణ ప్రాంతంలో మరెప్పటికీ కోలుకోలేని రీతిలో మరణశాసనం లిఖించేశాడు. ఇప్పటి అసంతృప్తులు, విలాపాలు కొన్నాళ్లకు సర్దుకుంటాయి. కానీ భాజపా ఇప్పుడు అందుకోగల అవకాశం ఉన్న వైభవస్థితికి మరెప్పటికీ చేరుకోదు అన్నది ఖరారు!!

మరింత సమాచారం తెలుసుకోండి: