శ్రీరాముడు అంటే ఆదర్శ పాలకుడు. రాజు అనేవాడు ఎలా ఉండాలో ఆచరణలో చూపిన మహానుభావుడు. కొన్ని వేళ ఏళ్ల కిందట ఆయన పరిపాలించినా.. ఇప్పటికీ ఆయనను స్మరించుకుంటున్నామంటే.. ఆయన పాలనను కీర్తిస్తున్నామంటే. ఆయన వ్యక్తిత్వాన్ని ఆచరించాలని ఉద్బోధిస్తున్నామంటే ఆయన ఎంత మహోన్నతుడో అర్థం చేసుకోవచ్చు. రాముడు ఆదర్శ పాలకుడు కనకనే. ఆయన రాజ్యాన్ని రామ రాజ్యమని, ఆయన రాజ్యంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో తులతూగారని, ప్రజలకు కొరత అనేదే తెలియదని, దేనికీ లోటు లేదని చెబుతూ ఉంటారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో తులతూగే అటువంటి రామ రాజ్యం కావాలని అభిలషిస్తూ ఉంటారు. అటువంటి రామ రాజ్యం మళ్లీ వస్తే మంచిదే కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో దానిని కోరుకోవడం అత్యాస, దురాశ అవుతుంది. రాముడు లాంటి పాలకుడు కావాలని కోరుకోవడం కూడా అంతే. మన భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు మరి కొద్ది రోజుల ముందు ఉన్న ప్రస్తుత కీలక సమయంలో రాముడు లాంటి పాలకుడు కావాలని మనం కోరుకోనక్కరలేదు. కనీసం, రాముడిలో ఒకటో వంతు లక్షణాలు ఉన్న నాయకుడు అయినా చాలని సరిపెట్టుకుందాం. అటువంటి నాయకుడు ఎలా ఉండాలో ఓసారి చూద్దాం. రాముడు తన రాజ్యంలో ప్రజలందరినీ సమానంగా పరిగణించాడని, అందరినీ గౌరవించాడని చెబుతారు. తన గురువు విశ్వామిత్రుడిని, గిరిజన మహిళ శబరిని ఒకేలా చూశాడని చెబుతూ ఉంటారు. మనం అటువంటి రాముడు కావాలని కోరుకోనవసరం లేదు. కానీ, కులం, మతం, ప్రాంతం అనే భేదాలతో మనల్ని విభజించే నాయకుడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఎన్నుకోవద్దు. మన దగ్గర కొంతమంది నాయకులు ఒక కులానికే పరిమితం. వాళ్లు అధికారంలోకి వస్తే కేవలం వాళ్ల కులానికే ప్రాధాన్యం ఇస్తారు. మిగిలిన కులాలు నష్టపోతాయి. ఇటువంటి నాయకులు మనకొద్దు. అలాగే, మరికొంతమంది నాయకుల తమ కులంతోపాటు మతానికే ప్రాధాన్యం ఇస్తారు. మతం అంటే ఇష్టం. మనం మన ఇష్టపూర్వకంగా ఆచరించేదే మతం. దానిని మరెవరో రుద్దకూడదు. కేవలం కొన్ని కులాలు, కొన్ని మతాలకే పరిమితమైన పిపీలకాలు నాయకులు కాజాలరు. అలాగే ప్రాంతీయ విద్వేషాలతో మనల్ని విభజించే నాయకులు కూడా మనకొద్దు. ప్రాంతీయ విద్వేషాల కారణంగా ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రజలంతా ఎంత క్షోభ అనుభవించారో అందరికీ తెలిసిందే. అందుకే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే వారే కాదు.. వాటికి ఆజ్యం పోసి సహకరించేవారిని కూడా మనం ఎన్నుకోరాదు. రాముడు అరిషడ్వర్గాలను జయించిన వాడని చెబుతారు. అంటే, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్య్సర్యాలను జయించిన వాడని అర్థం. నిజంగా ఇంత ఆదర్శ పురుషుడు మన కళ్లెదుటే ఉంటే వాడిని అసమర్థుడని, పనికిమాలిన వాడని అంటారు తప్పితే గొప్పవాడని కీర్తించలేని సమాజం మనది. అందుకే, ఇన్ని అద్భుత లక్షణాలు ఉన్న నాయకుడు మనకు అక్కర్లేదు. కానీ, తరాలు తిన్నా తరగని ఆస్తిని పోగేసుకోవాలనే పేరాశ ఉన్న నాయకుడు మనకు అక్కర్లేదు. తాను తినడమే కాకుండా తన వాళ్లకు దోచిపెట్టే నాయకుడు అసలే అక్కర్లేదు. మరీ ముఖ్యంగా పేదల కడుపు కొట్టే.. పేదల నోటి దగ్గర ముద్దను కూడా దిగమింగే నాయకులను అస్సలే మనం ఎన్నుకోవద్దు. అలాగే, ప్రజలు, పార్టీలు, నాయకుల మీద కక్ష, పగ, ప్రతీకారాలతో రగిలిపోయే నాయకులు కూడా మనకు వద్దు. అరిషడ్వర్గాలన్నీ ప్రమాదమే అయినా, మోహం, మదం మరింత ప్రమాదకారులు. అందుకే అధికార దాహమే ధ్యేయంగా కలిగిన నాయకులను కూడా ఎన్నుకోవద్దు. మరికొంతమందికి అధికారం వచ్చిన తర్వాత కళ్లు నెత్తికి ఎక్కుతాయి. వారికి ప్రజలు కనిపించరు. అధికార మదంతో భూమ్మీద నిలబడరు. అటువంటి నాయకులు కూడా మనకు అక్కర్లేదు. శ్రీ రాముడి పాలనలో బంగారు పంటలు పండాయని అంటారు. ముక్కారు వానలు కురిశాయని, అన్నదాత ఇంట ధనలక్ష్మి తులతూగిందని చెబుతారు. ఇప్పుడు పంటల్లో బంగారం పండనక్కరలేదు. మన పంట మన చేతికి వస్తే చాలు. ఇప్పుడు అయితే అతి వృష్టి లేకపోతే అనావృష్టి. అందుకే మన నాయకుడి పాలనలో కరువు కాటకాలు రాకుండా ఉండాలి. అవి లేకుండా ఉంటే అతివృష్టితోనూ మన పంటలు నాశనం కాకూడదు. రైతుకు సరసమైన ధరకు విత్తనాలు, ఎరువులు దొరకాలి. పండిన పంటకు సరసమైన ధర దొరకాలి. కొంతమంది నాయకులు అడుగు పెడితే పండే పంటలు కూడా ఎండిపోతాయి. భూములు బీళ్లుగా మారతాయి. అటువంటి నాయకులను మనం ఎన్నుకోవద్దు. రాముడు ధైర్యవంతుడు. ప్రమాదం వస్తే తప్పించుకుని పారిపోడు. వాటికి ఎదురేగి వాటిని పరిష్కరిస్తాడు. అందుకే మన నాయకుడు కూడా పిరికివాడు కాకూడదు. ధైర్యవంతుడినే మనం మన నాయకుడుగా ఎన్నుకోవాలి. అలాగని, ప్రతి ఒక్కరినీ ధిక్కరించే మొండివాడిని కూడా ఎన్నుకోరాదు. ధైర్యవంతుడంటే మన నాయకుడు ఢిల్లీ పాలకుల కాళ్లు తుడిచి కళ్లకు అద్దుకునేవాడు కాకూడదు. వాళ్ల అడుగులకు మడుగులు ఒత్తేవాడు కారాదు. అవసరమైతే వాళ్లను ఎదిరించేవాడు కావాలి. ధైర్యవంతుడంటే.. ఇతర పార్టీలు, నాయకుల ఒత్తిళ్లకు లొంగిపోయే వాడు మన నాయకుడు కాకూడదు. రెండు మాటలు మాట్లాడేవాడు మన నాయకుడు కారాదు. తాను న్యాయం, ధర్మం అనుకున్నా దానిని తూచా తప్పకుండా అమలు పరచలేని వాడు మన నాయకుడు కారాదు. వీటన్నిటితోపాటు ఏ రోటి దగ్గర ఆ పాట పాడే అవకాశవాది మన నాయకుడు కారాదు. కుల పోరాటాలను రెచ్చగొట్టేవాడు మన నాయకుడు కారాదు. తన స్వార్థ ప్రయోజనాలే పరమావధిగా ప్రజల జీవితాలతో ఆడుకునేవాడు మన నాయకుడు కారాదు. మనకు అచ్చంగా రాముడు అవసరం లేదు. ఒకవేళ నిజంగా రాముడే వచ్చినా ఆయనను స్వీకరించే పరిస్థితిలో మన సమాజం లేదు. అందువల్ల, ప్రజలను బాధించని, వేధించని, క్షోభించేలా చేయని వాడే మన నాయకుడు కావాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: