విభజన నేపధ్యంలో కీలకమైన ఉద్యోగుల పంపిణీ గందరగోళంగా మారుతోంది. ఉన్నతస్థాయి అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో ఈ అంశంపైనే దృష్టి కేంద్రీకరించినప్పటికీ ఫలితాలు ఆశించినట్టుగా ఉండటం లేదు. విభజన ప్రక్రియలో మిగిలిన అంశాల్లో ఎంతో కొంత పురోగతి కనిపిస్తున్నప్పటికీ ఉద్యోగుల పంపిణీ విషయంలో భిన్నమైన స్థితి నెలకొనడంపై ఉన్నతస్థాయి అధికారవర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ అంశంపై సమీక్షించిన రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ సైతం తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. నిర్ధేశించిన గడువు తేది ముగిసి వారం రోజులవుతున్నా వివరాలు ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ఉన్నతస్థాయి అధికారులు తాజాగా శనివారం(12వతేది)లోగా ఉద్యోగులకు సంబంధించిన పూర్తిస్థాయి వివరాలను అందచేయాలని వివిధ శాఖల అధిపతులకు ఆదేశాలు జారీ చేశారు. అప్పటికి కూడా వివరాలు అందకపోతే సంబంధిత నోడల్‌ ఆఫీసర్లు జీతాలతో పాటు అలవెన్స్‌లను నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సంతకంతో మంగళవారం హెచ్‌ఓడిలకు అంతర్గత సర్క్యులర్‌ జారీ చేశారు. విభజన ప్రక్రియలో భాగంగా సచివాలయంలోని శాఖలతో పాటు, వివిధ హెచ్‌ఓడిలకు ఉద్యోగులకు సంబంధించిన పూర్తి వివరాలను అందచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీనికోసం ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను కూడా రూపొందించారు. ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని మార్చి 31వ తేదిలోగా పూర్తిస్థాయిలో వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లా, జోనల్‌, మల్టీజోనల్‌తో పాటు రాష్ట్ర క్యాడర్‌కు చెందిన అన్ని స్థాయిల ఉద్యోగుల వివరాలను పూర్తిస్థాయిలో అందచేయాలన్నది ఈ ఆదేశాల సారాంశం.

మరింత సమాచారం తెలుసుకోండి: