వైఎస్ఆర్ కాంగ్రెస్ సీమాంధ్ర జాబితా విడుదలైంది. ఇందులో ఏమీ మెరుపులు మరకలు లేవు. దాదాపు అన్నీ ఊహించిన పేర్లే. గత ఏడాది కాలంగా వార్తల్లో నలుగుతున్న పేర్లే. ఊహించినట్టే, చెల్లెలు షర్మిలకు జగన్ షాక్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో, జగన్ జాబితా ఫ్యామిలీ ప్యాకేజీలా ఉండడం విశేషం. జగన్ తన కుటుంబంలోనే దాదాపు ఆరుగురికి సీటు ఇచ్చారు. ఇక, శివరామిరెడ్డి కుటుంబంలో ముగ్గురికి టికెట్లు ఇస్తే.. ధర్మాన, సుజయ కృష్ణ రంగారావు, మేకపాటి, భూమా తదితర కుటుంబాలకు కూడా రెండేసి సీట్లు ఇచ్చారు. సీమాంధ్రలోని దాదాపు 20 సీట్లను కేవలం నాలుగైదు కుటుంబాలకే కట్టబెట్టారు. జగన్ జాబితాలో అనూహ్యంగా కనిపించిన పేరు విశాఖపట్నం లోక్ సభ నుంచి వైఎస్ విజయలక్ష్మిది. వాస్తవానికి, ఆమెకు ఈసారికి విశ్రాంతి ఇస్తారని కానీ కడప జిల్లా నుంచే బరిలో నిలుపుతారని భావించారు. విశాఖ సీటు నుంచి షర్మిల పోటీ చేస్తారని భావించారు. కానీ, షర్మిలను పూర్తిగా పక్కనబెట్టి అక్కడి నుంచి విజయలక్ష్మిని నిలిపారు. షర్మిల పోటీ చేయనని చెప్పారని వైసీపీ నేతలు చెబుతున్నా.. షర్మిల, జగన్ మధ్య కొన్నాళ్లుగా విభేదాలు ఉన్నాయన్న కథనాలకు ఈ పరిణామం బలం చేకూరుస్తోంది. రాజశేఖర రెడ్డి పోలికలతో దూసుకుపోయే స్వభావంతో చక్కగా మాట్లాడగలిగే షర్మిల తనకు పోటీగా మారవచ్చని జగన్ భావిస్తున్నారంటూ కొన్నాళ్లుగా వెలువడుతున్న వార్తలకు ఇప్పుడు ఆమెకు టికెట్ ఇవ్వకపోవడం బలం చేకూరుస్తోంది. అయితే, విశాఖ నుంచి విజయలక్ష్మిని నిలబెట్టడం ద్వారా అక్కడ షర్మిలకు ఇద్దామని భావించామని, కానీ, ఆమె కాదనడంతో తల్లిని నిలబెట్టాల్సి వచ్చిందని చెప్పుకొనేందుకు ఒక అవకాశం వచ్చింది. ఈ అంశాన్ని పక్కనపెడితే, ముందు నుంచీ ఊహించినట్లే జగన్ ఫ్యామిలీలో చాలామందికి టికెట్లు లభించాయి. బాబాయ్ అలకకు ఫలితం దక్కింది. వైవీ సుబ్బారెడ్డికి ఒంగోలు దక్కింది. ఇక కడప లోక్ సభ నుంచి అవినాశ్ రెడ్డి, రాజంపేట నుంచి మిధున్ రెడ్డి, పులివెందుల నుంచి జగన్ ఎప్పటినుంచో అనుకుంటున్నవే. కాకపోతే, కొన్ని రోజులుగా సందిగ్ధంలో ఉండిపోయిన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి విషయంలో స్పష్టత వచ్చింది. ఆయన కోరుకున్నట్లే ఆయనకు కమలాపురం సీటు ఇచ్చారు. ఇంతమందికి సీట్లు ఇచ్చిన జగన్ తన బిడ్డలకంటే ప్రాణంగా చూసే చెల్లెలు షర్మిలను దూరం పెడతారని భావించలేం. అయితే, నిజానిజాలను షర్మిలే బయటపెడితే బాగుంటుంది. ఇక, తన కుటుంబానికే పెద్దపీట వేసుకుంటే ఏం బాగుంటుందని అనుకున్నాడో ఏమో జగన్ పార్టీలోని కొంతమంది కుటుంబాలకు పెద్దపీట వేశారు. అయితే, వీరిలో చాలామంది గతంలో కూడా రాజకీయాల్లో ఉన్నవారే. మేకపాటి సోదరులు ఎప్పటినుంచో ప్రజా ప్రతినిధులుగా ఉన్నారు. భూమా దంపతులు అంతే. ధర్మాన సోదరులు కూడా ఇదే పరిస్థితి. ఇక, ఒక్క నరసాపురంలో ప్రసాదరాజు మినహా తన దగ్గరకు వచ్చిన మిగిలిన వారందరికీ జగన్ న్యాయం చేశారని భావించవచ్చు. ప్రసాదరాజు గెలిచే అవకాశం లేదని తేలడంతో కొత్తపల్లి సుబ్బారాయుడును పార్టీలోకి తీసుకున్నారు. దీంతో ప్రసాదరాజుకు మొండిచేయి మిగిలింది. మరొకపక్క, కోస్తాలో ప్రాధాన్య కులమైన కాపులకు జగన్ పెద్దపీట వేశారు. నలుగురికి ఎంపీలుగా, దాదాపు 20 మందికి ఎమ్మెల్యేలుగా టికెట్లు ఇచ్చారు. కాకినాడ నుంచి చలమలశెట్టి సునీల్, ఏలూరు నుంచి తోట చంద్రశేఖర్, గుంటూరు నుంచి బాలశౌరి, అనకాపల్లి నుంచి గుడివాడ అమర్నాథ్ కు టికెట్ ఇవ్వడం ద్వారా కాపులను ఆకర్షించడానికి ప్రయత్నించారు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీని పెట్టడం, కాపుల్లో కొంతమంది టీడీపీకి అనుకూలంగా మారుతున్నారన్న కథనాల నేపథ్యంలో ఇక్కడి కాపులకు పెద్దపీట వేయడం ద్వారా ఆ సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు జగన్ ప్రయత్నించారు. అలాగే, తనకు అత్యంత అండదండలు అందిస్తున్న ఎస్సీలకు కూడా 28 సీట్లు ఇచ్చారు. జగన్ జాబితా చూస్తే, కొత్త పాతల కలయికగా ఉంది. యువత, సీనియర్ల మిళితంగా ఉంది. టీడీపీ తరహాలోనే ఇందులోనూ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేశారు. ఉదాహరణకు అనకాపల్లి అభ్యర్థి అమర్నాథ్, చలమలశెట్టి సునీల్, తోట చంద్రశేఖర్ గతంలో పీఆర్పీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మళ్లీ వాళ్లకు టికెట్లు ఇచ్చారు. తోట చంద్రశేఖర్ నియోజకవర్గం మార్చారంతే. అలాగే, సుజయ్ కృష్ణ రంగారావు, పినిపె విశ్వరూప్, పార్థసారథి, బాలశౌరి, ఎస్పీవై రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చినవాళ్లు. కాకపోతే, వీరిలో పార్థసారథి మినహా మిగిలిన వారంతా కొంత కాలం కిందే పార్టీలోకి వచ్చినవారు. ఇక, కోనేరు ప్రసాద్, అయోధ్య రామిరెడ్డి జగన్ కేసుల సహచరులు. కాగా, శాంతి, కొత్తపల్లి గీత, బొడ్డు వెంకటరమణ చౌదరి, వంకా రవీంద్ర, బుట్టా రేణుక, శ్రీధర్ రెడ్డి, అవినాశ్ రెడ్డి, వి.వరప్రసాదరావు, మిథున్ రెడ్డి, సామన్య కిరణ్ రాజకీయాలకు కొత్తవారు. మరో ముఖ్య విశేషం ఏమిటంటే, కాపులతోపాటు కమ్మవారికి కూడా జగన్ తన జాబితాలో పెద్దపీట వేయడం. ఆ వర్గానికి చెందిన బొడ్డు వెంకటరమణ చౌదరి, వంకా రవీంద్ర, కోనేరు ప్రసాద్ లతోపాటు పలువురికి ఎమ్మేల్యేలుగానూ సీట్లు ఇచ్చారు. మొత్తంమీద జగన్ జాబితాలో కాపులు, కమ్మలు, రెడ్లు, ఎస్సీలు , బీసీలు వంటి సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేశారు. ఆయా వర్గాల ఓట్లు ఎక్కువగా ఉన్నచోట ఎటువంటి బేషజాలకు పోకుండా వారికే టికెట్లు ఇచ్చారు. మొత్తంమీద గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చారు. మరి, వీరిలో ఎంతమంది విజయం సాధిస్తారో వేచి చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: