ఆయనకు కొంచెం తిక్కుంది..దానికీ ఓ లెక్క వుంది. ఆ లెక్క ఏమిటంటే, విజయవాడ పార్లమెంటు సీటు. తను అడిగిన ఒక్కగానొక్క సీటు, అదీ తన మిత్రుడు, జనసేనకు ఫైనాన్సియర్, ఒకప్పటి జగన్ బినామీ, సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చారని చెబుతున్న పరమ్ వి పొట్లూరికి టికెట్ ఇవ్వక పోవడంతో పవన్ కళ్యాణ్ కు తిక్కరేగింది. ఆ తిక్క కాస్తా ఆగ్రహంగా మారుతోంది. నిజానికి పలువురు అభ్యర్థులు పవన్ ను కలిసి మద్దతు కోరారాని బుధవారం ఉదయం నుంచి వార్తలు వినవచ్చాయి. కానీ అసలు సంగతి ఏమిటంటే, తెలుగుదేశం పార్టీకి ఝలక్ ఇవ్వడం కోసమే ఈ హడావుడి అన్నది. అసలు పివిపి కి టికెట్ ఎప్పుడు ఇవ్వడం లేదని తెలిసిందో, అప్పుడే సంధించిన తొలి అస్త్రం మల్కాజ్ గిరిలో తెలుగుదేశం పార్టీకి కాకుండా లోక్ సత్తా జయప్రకాకష్ నారాయణ్ కు మద్దతు ప్రకటించడం. అక్కడితో ఆగకుండా తను తొలుత అనుకున్నట్లు కొంత మందిని స్వతంత్రులుగా బరిలోకి దింపాలని ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అయితే ఇలా చేస్తే తను అన్న మాటలపై నిలబడనట్లు అనిపిస్తుంది. అందుకే లేస్తే మనిషిని కాను అన్న రీతిలో ఇప్పుడు పవన్ హడావుడి చేస్తున్నారు. మొత్తం ఎనిమిది స్థానాలను ఎంపిక చేసినట్లు సమాచారం. వాటిలో అరకు స్థానం కూడా వుంది. ఇక్కడ అరకు స్థానం ప్రస్తావన ఎందుకంటే, అక్కడ ఓ విశేషం వుంది. ప్రజారాజ్యం సమయంలో ప్రారంభించిన ఓ స్వచ్ఛంద సంస్థ వుంది. దాని పేరు డూ ఇట్. అది గడచిన ఆరు నెలలుగా అరకు ఏజెన్సీ ప్రాంతంలో చాలా ఏక్టివ్ గా పని చేస్తున్నట్లు వినికిడి. దాని ఫండింగ్ కోసమే పవన్ టీడీపీ కి మద్దతు ఇచ్చాడని కూడా వదంతులు వున్నాయి. . ఆ సంగతి అలా వుంచితే, తన రాజకీయ చిత్రం జనసేన కు నిర్మాత అయిన పొట్లూరికే టిడిపి హ్యాండిచ్చేసరికి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిన పవన్ కళ్యాణ్ కు ఏం చేయాలో తోచని పరిస్థితులు నెలకొన్నాయి. సీమాంద్రలో 8మంది అభ్యర్థులు పవన్ కళ్యాణ్ మద్దతుతో లోక్ సభ బరిలోకి దిగేందుకు సిద్దమయ్యారట. విజయవాడ టికెట్ ఆశించి భంగబడ్డ పొట్లూరి నేతృత్వంలోనే వీరంతా రెడీ అయ్యారని మీడియా లో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. పరిస్థితులు కూడా ఆ విధంగానే ఉండడంతో ఇక టిడిపికి అనుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ మద్దతు లభించే పరిస్థితులు దూరమయినట్టే. అంతే కాదు పవన్ రహస్యంగా లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణతో కూడా చర్చలు జరిపినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. జేపి కూడా టిడిపి, బిజేపితో పొత్తుకోసం ప్రయత్నించి ఫెయిల్ అయ్యిన వారే. ముఖ్యంగా బాబు సాచివేత ధోరణి అంటే జెపికి కాస్త లోలోపల కాస్త కోపంగానే వుంది. పవన్ కళ్యాణ్ లోక్ సత్తా అభ్యర్థుల తరఫున కూడా ప్రచారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే టిడిపికి తన పవరేంటో చూపించేందుకే పవర్ స్టార్ రెడీ అవుతున్నారని తెలుస్తోంది. తన అంతటి స్టార్ మద్దతిస్తుంటే కేవలం అడిగిన ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం పవన్ కు కూడా ఆగ్రహం తెప్పించింది. కారణం పొట్లూరికి తన మద్దతు ఉందని, ఆయనకు టికెట్ కోసం తను ప్రయత్నిస్తున్నానని లోకమంతటా తెలిసిపోయింది. ఆయనకే టికెట్ ఇవ్వకపోతే పవన్ కు రాజకీయంగా టిడిపి, బిజేపిలు ఇస్తున్న విలువ ఇదేనా, ఆయనను అసలు పట్టించుకోవడం లేదా, ఆయన పవర్ అంతా వట్టిదేనా అన్న బావం ప్రజల్లోకి వెళుతుంది, కాదు వెళ్లిపోయింది. ఇప్పుడు తన పవర్ చూపెట్టకపోతే ఇక రాజకీయ జోకర్ గా మిగిలిపోవాల్సి వస్తుందన్న భావం కూడా పవన్ కు కలిగింది. ఆయన ప్రకటించింది మోడీని ప్రధాని చేయడానికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. బిజేపి లోక్ సభ అభ్యర్థులు లేని చోట తన మద్దతుదారులను ఎంపీ అభ్యర్థులుగా నిలబెడతారు. అంతే కాదు బిజేపి కి తను, తనకు బిజేపి మద్దతు లభిస్తుంది. తన వారు గెలిచినా బిజేపికే మద్దతుంటుంది కాబట్టి బిజేపితో చెడిపోయేదేది లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: