విజయవాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతరపున ఎంపీగాపోటీ చేస్తున్న కోనేరు ప్రసాద్ ఆస్తుల ప్రకటన భలే విచిత్రంగా ఉంది. జగన్ ఏరి కోరి ఎన్నుకొన్న ఈ అభ్యర్థి తన ఆస్తుల ప్రకటనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈసీకి సమర్పించిన పత్రాల్లో తన వార్షిక ఆదాయం కేవలం 2,280 రూపాయలు అని పేర్కొన్నాడు. మరి ఎమ్మార్ స్కామ్ లో నిందితుడు, ఒక పార్లమెంటరీ నియోజకవర్గంలో అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి ఆదాయం ఇంత తక్కువా? అనే అనుమానం కలుగుతోందిప్పుడు. సాధారణంగా ఏదైనా కంపెనీలో ఆఫీస్ బాయ్ గా పనిచేసే వ్యక్తికి కూడా ఆ మాత్రం ఆదాయం ఉంటుంది. అలాంటిది వందల కోట్ల స్కామ్ లో నిందితుడు అయిన కోనేరు రాజేంద్రప్రసాద్ కు ఒక ఆఫీస్ ప్యూన్ కు వచ్చినంత ఆదాయం కూడా రాదా? అనే అనుమానం కలుగుతోంది. అయితే ఆదాయం తక్కువగా చూపించిన ఆస్తులు మాత్రం దండిగా చూపించాడు కోనేరు. తన పేరిట, తన భార్య పేరిట ఉన్న స్థిర చరాస్తుల జాబితాను ఆయన ఈసీకి అందజేశాడు. తన భార్య విమలా దేవికి ఏడాదికి మూడు కోట్ల ఏడు లక్షల రూపాయల ఆదాయం వస్తుందని కోనేరు ప్రకటించాడు. ఆమె పేరు మీద దాదాపు 90 కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు ఆయన ఈసీకి తెలియజేశాడు. అలాగే ఆమె పేరు మీద 50 కోట్ల రూపాయల విలువజేసే స్థిరాస్తులున్నాయని పేర్కొన్నాడు. తన పేరు మీద రెండు కోట్లా 25 లక్షల రూపాయల విలువజేసే స్థిరాస్తులున్నాయని తెలిపాడు. ఓవరాల్ గా 150 కోట్ల రూపాయల స్థిర చరాస్తులను ప్రకటించాడు కోనేరు ప్రసాద్.

మరింత సమాచారం తెలుసుకోండి: