అది హిందూపూర్ కావచ్చు..రాజంపేట కావచ్చు..విశాఖ కావచ్చు..విజయవాడ కావచ్చు. పార్టీలు ఏవైనా, అభ్యర్థులు ఎవరైనా విజయం కోసం చెమటలు కక్కాల్సిందే. సర్వేలు చెప్పేస్తున్నట్లు ఇక్కడ విజయం ఎవరి సైడూ కాదు. పార్టీలన్నీ నూటికి తొంభై శాతం టికెట్ లు ఆచి తూచి, కాచి వడబోచి ఇచ్చాయి. పార్టీ విధేయతలు, జంప్ జిలానీలు, నిబద్ధత, సిద్ధాంతం, స్థానికత ఇవేవీ కాదు కీలకం. పలుకుబడి, డబ్బు, కులం ఈ మూడే కీలకపాత్ర వహించాయి ఈ సారి టికెట్ ల ఎంపికలో. అది వైకాపా కావచ్చు, తెలుగుదేశం కావచ్చు. ఈ మూడే ప్రాతిపదిక. ముందుగా అభ్యర్థి కులాన్ని ప్రాతిపదికగా తీసుకున్నారు. ఆ కులం ఓట్లు ఎన్నివున్నాయి అన్నది బేసిక్ అర్హతగా చూసుకున్నారు. ఆపైన ఎంత ఖర్చు పెట్టగలవు అన్నది అభ్యర్థులకు ఎదురవుతున్న రెండో ప్రశ్న. ఒకప్పుడు ఎన్నికలు వస్తే, టికెట్ తెచ్చుకుంటే చాలు, పార్టీ డబ్బులు పెట్టేది.ఢిల్లీ నుంచి కావచ్చు, హైదరాబాద్ నుంచి కావచ్చు, డబ్బు సంచులు దిగేవి. చిత్రంగా కొందరు అభ్యర్థులు వాటిల్లోనే కాస్త కక్కుర్తి పడి మిగుల్చుకునే వారుకూడా. రాను రాను కొత్త పద్దతి వచ్చింది. గాట్టి అభ్యర్థిని ఎంపీ కేండిడేట్ గా ఎంపిక చేసి, అతగాడి తలపై ఆరేడుగురు ఎమ్మెల్యేల భారం మోపడం. ఇప్పుడు ఆ ట్రెండూ మారింది. ఎవరి కి వారే కనీసంలో కనీసం మూడు కోట్లు ఖర్చు పెట్టగలవారే ఎమ్మెల్యే అభ్యర్థి. కనీసం పాతిక కోట్లు ఖర్చుచేయగలవారే ఎంపీ కేండిడేట్. వైకాపా అధ్యక్షుడు జగన్ ఈ విషయంలో చాలా పట్టుదలగా వ్యవహరించారని వినికిడి. కేవలం ఖర్చు చేయగలరా అని అడిగి ఊరుకోకుండా, తాను ఏమీ ఇవ్వలేనని స్పష్టం చేసేసారని తెలిసింది.అంతే కాకుండా ఖర్చు చేస్తారంటే సరిపోదని, అంత మొత్తం ఎలా సమకూర్చుకోగలరో కాస్త చెప్పాలని కూడా అడిగారని వినికిడి. తీరా టికెట్ ఇచ్చాక చేతులు చాచితే కుదరదని చంద్రబాబు అండ్ కో కూడా అభ్యర్థులకు గట్టిగానే చెప్పారట. ఇక్కడ ఇంకో ముచ్చట వుంది. నిజానికి బాబు, అయినా, జగన్ అయినా ఇంత గట్టిగా చెప్పనక్కరలేదు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు డబ్బున్న మారాజులకే సాధ్యమయిపోయాయి కనుక. ఈ నిబంధన కూడా పాస్ అయిపోయారు చాలా మంది. ఇప్పుడు సమరం ప్రారంభమైంది. విశాఖ చూడండి..హరిబాబు- విజయమ్మ. వైకాపా తమ ప్రతిష్ట కోసం విజయమ్మను గెలిపించేందుకు ఎంతయినా ఖర్చు చేస్తుంది. అది తెలిసిందే. గతంలో ఎమ్మెల్యేగా గెలిచినపుడే హరిబాబు, రోయ్యల కంపెనీల వ్యాన్లలో డబ్బు సంచులు దింపారని ప్రతీతి. పైగా విశాఖలో వ్యాపార, రాజకీయ రంగంపై ఇప్పటికే పట్టు సాధించిన కమ్మ వర్గం సహజంగా, హరిబాబు కోసం ఎంతయినా ఖర్చుచేస్తుంది. రాజమండ్రి మురళీ మోహన్. ముచ్చటగా మూడోసారి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటపడు ఆయన డబ్బు దగ్గర వెనక్కు తగ్గుతారా? రాష్ట్రంలోనే కీలకం విజయవాడు. అందరూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన బడా బడా వ్యాపారులే. ఖర్చు వందల కోట్లలో వుంటుదని వినికిడి. రాయపాటి, మేకపాటి, బాలకృష్ణ, జగన్, గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్, కోడెల శివప్రసాదరావు, ఇలా రాసుకుంటే పోతే వందకు పైగా పేర్లు కోట్లు ఖర్చు చేయగల అభ్యర్థులవే. అందువల్లే ఈ సర్వేలు, కులాల వ్యవహారాలు అన్నీ పైపైన మాట్లాడుకునేందుకే. చివరి రోజుల్లో ఎవరు ఎంత ఖర్చు చేయగలరు? స్థానిక నాయకులను ముందుగానే ఎవరు కొనేసారు? ఇలాంటి వ్యవహారాలపై ఆధారపడి వుంటుంది. ఎన్టీటీవీ చేసినా, ఐబిఎన్ చేసినా, ఎన్ టీ వీ చేసినా, ఈ ఫ్యాక్టర్లేవీ వాటిలోవుండవు. ఇవన్నీ లోగుట్టుగా జరిగే వ్యవహారాలు. గ్రామాలే అసలు సిసలైన నిర్ణేతలు. దానికి మార్గం డబ్బు మాత్రమే. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలకే ఒక్కో గ్రామానికి ఒక్కో పార్టీకి అయదులక్షల కనీసపు ఖర్చు నుంచి కోటి రూపాయిల వరకు లెక్క తేలింది. ఒక ఎమ్మెల్యే నియోజకవర్గం పరిథిలో ఎన్ని గ్రామాలు వుంటాయి. ఎంత ఖర్చు లెక్కలు వేసుకుంటే గుండెలు గుభేలు మంటాయి. ఫలితాలను ప్రభావితం చేసేవి అవే. డబ్బులు వాటిని ఒడిసిపడతాయి..సర్వేలు వాటిని పట్టలేవు.

మరింత సమాచారం తెలుసుకోండి: