చంద్రబాబుకు రెండు కళ్ల సిద్దాంతం అచ్చివచ్చింది. దాన్నే పట్టుకు వేలాడినందుకు ఫలితంగా ఈ రోజు తెలంగాణలో కాస్త గట్టి ఫైట్ ఇవ్వగలుగుతున్నాడు. అందుకే ఆయన ఇక అన్నింటా రెండు తరహా వ్యవహారాలనే నమ్ముకోవాలనుకున్నట్లు కనిపిస్తోంది. ప్రచారానికి కొడుకును కొడుకు మామగారిని నమ్ముకున్నాడు. టికెట్ లు ఇచ్చేందుకు వలస వచ్చిన వారిని, తనకు కావాల్సిన వారిని ఎంచుకున్నాడు. ఇప్పుడు ప్రచారం కూడా రెండు అంశాల ప్రాతిపదికగా ముందుకు వెళ్తున్నాడు. ఒక పక్క జగన్ అవినీతి అంటూ పాత పాట పాడుతున్నారు. కానీ మళ్లీ అక్కడో అనుమానం. గడచిన రెండు ఎన్నికల్లో ఇదే పాట పాడితే, ప్రజలు పట్టించుకోలేదు. ఫలితం లేకపోయింది. అయినా అలవాటైపోయిన పాట మానలేకపోతున్నారు. అందుకే మరో కొత్త పాట కూడా నేర్చుకున్నారు. అభివృద్దికి బాటలు వేస్తానంటూ ప్రచారం సాగిస్తున్నారు. గడచిన తొమ్మిదేళ్ల పాలన జనాలకు ఇంకా గుర్తుందన్న భయంతో, ప్రజలకు అండగావుండానని, కళ్లలో పెట్టుకుని చూసుకుంటానని చెబుతున్నారు. ఇలా అవినీతి, అభివృద్ధి అనే రెండు కళ్ల సిద్ధాంతాన్ని ప్రచారాస్త్రాలుగా చేసుకున్నారు. ఇప్పుడు ఇది బాగానే జనంలోకి వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా సీమాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కావడంతో, భవిష్యత్ పై ప్రజలకు కాస్త బెంగ పట్టుకుంది. అది సరిగ్గా బాబుకు కలసి వస్తోంది. ప్రజల ఆలోచన పసిగట్టి, తాను మాత్రమే అభివృద్ధి సాధించగలనని చెబుతున్నారు. చిత్రమేమిటంటే, బాబు కొమ్ము కాసే పచ్చపత్రిక కూడా ఈ విధానాన్నే అనుసరిస్తోంది. అభివృద్ధి చేస్తానంటూ బాబు చెబుతున్న మాటలను పతాక శీర్షికలతో ప్రకటిస్తూ, మళ్లీ గడచిన ఎన్నికల సమయంలో రాసిన అవినీతి రాతలన్నింటినీ తిరగరాయించే పనిలోపడింది. మొత్తానికి అర్థమవుతున్నదేమిటంటే, ఒక పక్క అభివృద్ధి చేసేవాడు కావాలి..కానీ జగన్ అవినీతి పరుడు కాబట్టి నన్ను ఎన్నుకోండి..ఇదే బాబు అండ్ కో రెండు కళ్ల ప్రఛారం.

మరింత సమాచారం తెలుసుకోండి: