రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నట్టుండి ఓ సంచలనం. మునుపెన్నడు లేని ఓ సంచలన ప్రకటన చేసి రాజకీయపార్టీలన్నింటికి ముచ్చెమటలు పట్టించారు చంద్రబాబు. తమ పార్టీని గెలిపిస్తే తెలంగాణలో బిసిని ముఖ్యమంత్రి చేస్తాను, ముఖ్యమైన పదవులు ఇస్తాను అన్నారు. ఇది రాజకీయంగా ఎంత దుమారం లేపిందో అందరికి తెలిసిందే. ఈ దెబ్బతో సిఎం పోస్టుపై ఆశతో బిసి సంక్షేమసంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య టిడిపిలో చేరి బాబును ఆకాశానికి ఎత్తి తాను మాత్రం సిఎం పదవి ఊహాలోకాల్లోకి వెళ్లిపోయారు. ఇదంతా కొన్ని రోజుల మాట.ఇప్పుడు అంతా మారిపోయింది. తాను చెప్పడం కాదు, చేసి చూపిస్తాను, ఈ ఎన్నికల్లో బిసిలకు వంద సీట్లు కేటాయిస్తాను అన్న చంద్రబాబు ఒక్కసారిగా మారిపోయారు. మాట మరిచిపోయారు, బిసిలను నట్టేట ముంచారు. అతి తక్కువగా ఉండే అగ్రవర్ణ సామాజిక వర్గానికే పెద్దపీట వేసారు. దీంతో ఆయన బిసి జపం అంతా వట్టిమాటే అని తేలిపోయింది. తెలంగాణలో బిసిని ముఖ్యమంత్రిని చేస్తానన్న చంద్రబాబు అక్కడ బిసిలకు ఎన్ని సీట్లు కేటాయించాలి. కనీసం 50 సీట్లు కేటాయించాలి. కాని ఆయన తెలంగాణలో బిసిలకు కేటాయించింది కేవలం 18 మాత్రమే. ఈ 18లో వారు గెలిచేదెన్ని, గెలిచిన వారిలో సిఎం పదవి కాదు కదా, మంత్రిపదవులు కూడా దక్కించుకునే వారెంత అన్నది ఎవరికి వారు అర్థం చేసుకోవాల్సిందే. తానే ముఖ్యమంత్రిని అని ప్రకటించుకున్న సీమాంద్రలో పరిస్థితి చూడండి. సీమాంధ్రలో కమ్మ సామాజిక వర్గానికి 36 సీట్లు కేటాయించారు. ఇక్కడ బిసిలకు మాత్రం అందరికంటే ఎక్కువ 40 సీట్లు కేటాయించారు. రెడ్డిలకు 28,కాపుకు 16 సీట్లు కేటాయించారు. దీనర్థం ఏంటో చంద్రబాబుకే తెలియాలి. మెజారిటి వర్గం ఉన్న వారికి తక్కువ, తక్కువగా ఉన్నవారికి ఎక్కువ సీట్లు కేటాయించారంటే ఆయన సీట్ల విషయంలో సామాజిక వర్గాలు చూడలేదని, వారి వెనుక ఉన్న డబ్బును చూసి టికెట్లు ఇచ్చుకుంటూ పోయాడని అర్థమవుతోంది. పోని రెండు రాష్ట్రాలలో కలిపి వంద సీట్లు బిసిలకు కేటాయించారా అంటే అదీ లేదు. సీమాంద్రలో 40, తెలంగాణలో 18 అంటే మొత్తం 58 సీట్లు మాత్రమే బిసిలకు ఇచ్చారు. రాష్ట్రంలో బిసిల జనాబా 60శాతం ఉందని ఆయనే చెప్పారు. కనీసం ఆ శాతం ప్రకారం ఇచ్చినా బాగుండేది. మొత్తం సీట్లలొ 60శాతం కాదు కదా, తాను ఇస్తానన్న వందసీట్లలో కూడా 60శాతం సీట్లు కేటాయించలేదు. A టికెట్లు కేటాయించేదాకా తాను బిసి భాణం సంధించాను చూడండి నా తడాఖా అన్నారు. ఏసభలో మాట్లాడినా, ఏరోడ్ షోలో మాట్లాడినా తన వల్లే బిసిల సాధికారికత జరుగుతుందన్నారు. సామాజిక తెలంగాణ తనతోనే సాద్యమన్నారు. తీరా టికెట్ల పంపిణీలో తన అసలు రంగు బయటపెట్టుకున్నాక ఆ మాటే మరిచిపోయారు. ఇప్పుడు ఆయన నోట బిసిల మాటే రావట్లేదు. బిసిల డిక్లరేషన్ చేసిన ఆయన ఆ మాట కూడా ఇప్పుడు మర్చిపోయారు. ఇప్పుడైనా బాబుకు అర్థమయివుంటుంది... చెప్పినంత ఈజీగా సీట్ల పంపకం చేయలేమని. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేమని. అంతే కాదు పైకి ఎంతగా ప్రేమను ఒలకబోసినా లోపల ఉన్న ఒరిజినాలిటి బయట పడడాకికి సమయం కూడా ఎక్కువ పట్టదని. అందుకే ఇప్పడు బిసి బాబు ఏమయ్యారు అంటున్నారు అంతా. బాబు ఆ మాటే ఎత్తకున్నా కూడా ఏమి కాకపోయేది. తనే బిసిల్లో లేనిపోని ఆశలు కల్పించి ఇప్పుడు మాట మార్చేసరికి గాలికి పోయిన కంపను తగిలించుకున్నట్టు కోరికోరి బిసిలనుంచి వ్యతిరేకత మూటగట్టుకున్నారు అన్న భావం సర్వత్రా వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: