జుట్టు ఉంటే ఎన్ని కొప్పులు అయినా వేసుకోవచ్చు. అసలు జుట్టే లేకపోతే..? కొప్పు కాదు కదా.. అసలు ముడి వేసుకోవడానికి కూడా కుదరదు. ఇదే ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి. చంద్రబాబు నాయుడు తన వ్యూహ చతురతతో తెలంగాణలో దూకుడు పెంచారని చెప్పుకొన్నాం కదా. నిజంగానే ఆయన చివర్లో మంచి వ్యూహం రచించారు. కానీ, గతంలో చేసిన తప్పుల కారణంగా ఆయన, ఆయన పార్టీ భారీ మూల్యాన్నే చెల్లించాల్సి వస్తోంది. పవన్ కల్యాణ్ ను ప్రచారానికి ఒప్పించడం, బీసీలకే ముఖ్యమంత్రి పదవిని ఇస్తానని ప్రకటించడం, టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్యను ప్రకటించడం నిజంగానే అద్భుత వ్యూహాలు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితే టీడీపీకి ప్రతికూలంగా మారింది. చంద్రబాబు బీసీ ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని కొంతమంది టీడీపీ నాయకులతో మాట్లాడినప్పుడు ఈ విషయం స్పష్టమైంది. ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా తెలుగుదేశం పార్టీ లేఖ ఇచ్చినా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఏర్పాటుతో తెలంగాణలో ఆ పార్టీ చాలా వరకు ఖాళీ అయిపోయిన సంగతి తెలిసిందే. టీడీపీ నేతలంతా కాంగ్రెస్, టీఆర్ఎస్ ల్లోకి వెళ్లిపోయారు. అప్పట్లో పార్టీ నేతలను కాపాడుకోవడంలో చంద్రబాబు దారుణంగా విఫలమయ్యారు. ఒకళ్లు వెళ్లిపోతే పది మంది నేతలను తయారు చేసుకోగల దమ్ము తెలుగుదేశానికి ఉందంటూ బీరాలు పోయారు తప్పితే నిజానికి ఆ పని కూడా చేయలేదు. దీంతో ప్రస్తుతం చాలా నియోజక వర్గాల్లో తెలుగుదేశానికి గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థులు కరువయ్యారు. దీనికితోడు గత ఎన్నికల్లో మహా కూటమితో పొత్తు పెట్టుకుని చాలా స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను నిలపలేదు. అక్కడ టీఆర్ఎస్, వామపక్షాలకు టికెట్లు ఇచ్చింది. అక్కడ ఆయా పార్టీలు గెలవలేదు. కానీ, అక్కడ కాంగ్రెస్ బలపడడానికి అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం విషయానికి వస్తే, పార్టీలో మిగిలిన ద్వితీయ శ్రేణి నాయకులకు టికెట్లు ఇచ్చినా.. ప్రత్యర్థి పార్టీల నుంచి బలమైన నాయకులు ఉన్నప్పుడు వీళ్లు అంతగా పోటీ ఇవ్వలేకపోతున్నారు. కేవలం టీడీపీ తరఫున బలమైన అభ్యర్థులు ఉన్నప్పుడే ఆయా నియోజక వర్గాల్లో త్రిముఖ పోటీ ఉంది తప్పితే.. టీడీపీ బరిలో ఉన్నప్పటికీ పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యనే నెలకొంది. ఉదాహరణకు, మెదక్ జిల్లా ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. టీడీపీ అత్యధిక నియోజక వర్గాలను ఇక్కడే గెలిచేది. కానీ, 2009 ఎన్నికల్లోనే ఇక్కడ చతికిలపడింది. కేవలం మెదక్ నుంచి మైనంపల్లి హనుమంతరావు తప్పితే మిగిలిన ఏ నియోజకవర్గాల్లోనూ గెలవలేదు. రెండు మూడు నియోజక వర్గాల్లో మాత్రం 2, 3 వేల తేడాతో టీడీపీ అభ్యర్థులు ఓడిపోయారు. తాజా ఎన్నికల్లో మెదక్ లోని పది నియోజక వర్గాల్లో కేవలం గజ్వేల్, జహీరాబాద్, పటాన్ చెరుల్లోమాత్రమే టీడీపీ కాస్త పోటీ ఇస్తోంది. ఇక్కడ గజ్వేల్ బరిలో కేసీఆర్ బరిలో ఉన్నారు కనక ఆ సీటును వదులుకోవాల్సిందే. ఇక మిగిలిన జహీరాబాద్, పటాన్ చెరుల్లో ఏదో ఒక సీటు గెలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక, రంగారెడ్డి జిల్లా కూడా టీడీపీకి కంచుకోటే. దాదాపు ఇక్కడ అన్ని సీట్లూ ఆ పార్టీ గెలుచుకునే పరిస్థితి ఉంటుంది. కానీ, 2009 ఎన్నికల ఫలితాలే ఇప్పుడు కూడా పునరావృతం కానున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 14 అసెంబ్లీ నియోజక వర్గాలుంటే గత ఎన్నికల్లో ఐదు చోట్ల గెలిచింది. ఇప్పుడు కూడా ఐదారు చోట్ల గెలిచే పరిస్థితి ఉందంతే. మిగిలినచోట్ల ఆ పార్టీ గట్టి పోటీనే ఎదుర్కొంటోంది. ఇక, తెలంగాణ ఉద్యమం బలంగా ఉండే కరీంనగర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఒక్క సీటును కూడా గెలుచుకునే పరిస్థితి లేదు. ఆ జిల్లాలో కరీంనగర్ పట్టణ స్థానంలో బీజేపీకి కొంచెం అనుకూల పరిస్థితి ఉన్నా.. మిగిలిన చోట్ల టీడీపీ, బీజేపీలకు ఏమాత్రం అవకాశాలు లేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే, చంద్రబాబు బీసీ కార్డును ప్రయోగించిన తర్వాత ఆయా జిల్లాల్లోని పరిస్థితి ఏమిటని ప్రశ్నించినప్పుడు.. అక్కడి నేతలు పెదవి విరిచారు. నియోజక వర్గంలో బలమైన నేతలు ఉంటే చంద్రబాబు ప్రయోగించిన బీసీ కార్డుతో ఉపయోగం ఉంటుందని, అసలు నియోజక వర్గాల్లో బలమైన నేతలే లేరని వారంతా స్పష్టం చేశారు. అందుకే, చంద్రబాబు చివర్లో మేలుకుని బలమైన అస్త్రాలను ప్రయోగించినా మొదట్లో చేసిన తప్పులు ఆ పార్టీని వెంటాడుతున్నాయి. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన నేపథ్యంలో పార్టీ నేతలు వెళ్లిపోకుండా ఆయన అడ్డుకట్ట వేసి ఉండాలి. కానీ, ఆ పని చేయలేదు. దీనికితోడు, పొత్తులో భాగంగా బీజేపీకి అత్యధిక సీట్లు ఇవ్వడం కూడా టీడీపీకి ప్రతిబంధకంగా మారింది. 2009 ఎన్నికల్లో మహా కూటమితో, తాజా ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని దాదాపు 50 సీట్లను ఇచ్చేయడం కారణంగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ చతికిలపడిపోయింది. పార్టీ నాయకులంతా ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. మహబూబ్ నగర్లో ఇటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. ఇవన్నీ ఒక అంశం అయితే, పార్టీ అధికారంలో లేని పదేళ్లు డబ్బులు ఖర్చు పెట్టుకుని, పార్టీనే అంటుకుని ఉన్న నాయకులను కాదని, పార్టీలోకి చివర్లో వచ్చిన నేతలకు టికెట్లు ఇవ్వడం కూడా టీడీపీ విజయావకాశాలను దెబ్బతీస్తోంది. ఉదాహరణకు, ఎల్ బీ నగర్ నియోజక వర్గాన్నే చూసుకుందాం. ఇక్కడ గత తొమ్మిదేళ్లుగా సామ రంగారెడ్డి, ఎస్వీ కృష్ణప్రసాద్ పార్టీకి అండగా నిలిచారు. కానీ, చివర్లో ఇక్కడి టికెట్ ను వారిద్దరికీ కాదని ఆర్.కృష్ణయ్యకు ఇచ్చారు. కృష్ణప్రసాద్ ను ఒప్పించినా రంగారెడ్డి రెబల్ గా బరిలో నిలిచారు. మొహమాటానికి ఒప్పుకున్న కృష్ణప్రసాద్ టీడీపీకి అనుకూలంగా పని చేసే పరిస్థితి లేదు. దీంతో, బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో నిలిచిన కృష్ణయ్య స్వయంగా గెలవడమే సందేహంగా మారింది. ఇక మల్కాజిగిరిలో మైనంపల్లి హనుమంతరావు గత కొన్నేళ్లుగా నియోజకవర్గంపై దృష్టి సారించి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మల్కాజిగిరి తోపాటు టీడీపీ గెలుస్తుందనుకున్న స్థానాలను బీజేపీకి అప్పగించడంతో ఆ స్థానాలను అప్పనంగా ఇతర పార్టీలకు అప్పగించినట్లే అవుతోంది. రాజకీయాల్లో ముందు నుంచీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తేనే ఒక్కో సందర్భంలో గెలుపు దక్కని పరిస్థితి. ఇక, ముందు నుంచీ తప్పులన్నీ చేసి చివర్లో మేలుకుంటే ఉపయోగం ఏమి ఉంటుంది? తర్వాత తీరిగ్గా ఐదేళ్లూ వగచడం తప్ప?

మరింత సమాచారం తెలుసుకోండి: