టిడిపి, బిజేపిల వ్యవహారం సీమాంద్రలో వైకాపా లాభదాయకంగా మారింది. దీంతో జగన్ శిబిరంలో ఆనందం వెల్లి విరుస్తోంది. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు వైకాపా కోరుకున్న విజయాలను ఆ రెండు పార్టీలు అప్పనంగా అందిస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం సీట్ల విషయంలో టిడిపి, బిజేపిలో పొసగని పొత్తు ఇప్పుడు వైకాపాకు వరంగా మారింది. సీట్లు రాని సీనియర్లు టిడిపి, బిజేపిలనుంచి రెబల్స్ గా పోటీకి దిగారు. ఇలా వీరు రెబల్స్ దిగిన స్థానాలు ఒకటో రెండో అయితే ఫర్వాలేదు. ఏకంగా 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టిడిపి, బిజేపిలు రెబల్స్ ను ఎదుర్కుంటున్నారు. దీంతో ఆ రెండు పార్టీల ఓట్లు చీలి వాటి బలం తగ్గుతుంది. వీరి మద్య వైకాపా అఖండ విజయం కాకపోయినా ఎంతో కొంత మెజర్టీతో విజయం సాధిస్తుందన్నది జగన్ పార్టీ వర్గాల అంచనా. ప్రతిసారి ఎన్నికల్లో రెబల్స్ ఉన్న చోట ఆపార్టీలు నష్టపోయి ప్రత్యర్థికి విజయాన్ని అందించాయి. అదే ఆనవాయితి ఇప్పుడు జరుగుతుంది అన్నది వైకాపా ధీమా. పైగా వైకాపా కూడా ఆయా స్థానాల్లో వీక్ గా లేదు. ఆ రెండు పార్టీలు కలిసి రెబల్స్ లేకుండా పోటీ చేసినా కూడా గెలిచే స్థాయిలో ఉంది. ఇక రెబల్స్ ఉన్నాక అది మరింత సునాయాసమే కదా. పైగా బిజేపికి సీమాంద్రలో బలం తక్కువ. అది పూర్తిగా టిడిపి పైనే ఆదారపడింది. అలాంటిది బిజేపి స్థానాల్లో టిడిపి నుంచి రెబల్స్ రంగంలోకి దిగారు. ఇంకేముంది అక్కడ వైకాపా విజయం నల్లేరుపై నడకే అన్న భావం నెలకొంది. ఇక టిడిపి అభ్యర్థులు నిలబెట్టిన చోట టిడిపి సీనియర్లే టికెట్లు రాక రెబల్స్ గా పోటీలో ఉన్నారు. ఈ స్థానాల్లో అక్కడక్కడా బిజేపి అభ్యర్థులు కూడా రెబల్ గా దిగారు. దీంతో అక్కడ ఆ రెండు పార్టీల పరిస్థితి దయనీయంగా తయారైంది. వైకాపా దీమాకు మరో కారణం కూడా ఉంది. టిడిపి రెబల్ అభ్యర్థులు ఉన్నది కూడా ఈ మద్య కాంగ్రెస్ లో ఉండి గెలవలేక టిడిపిలోకి వచ్చిన వారే. వారిపై ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎంపీలు గా ఉండి అభివృద్ది ఏమి చేయలేదు. పోని రాష్ట్ర విభజననైనా ఆపారా అంటే అదీ లేదు. పదవుల కోసం పాకులాడారు అన్న భావం ప్రజల్లో ఉంది. టిడిపి నుంచి రెబల్ గా బరిలోకి దిగిన వారు ప్రధానంగా ఇదే ప్రచారం చేస్తున్నారు. పదేళ్లు కాంగ్రెస్ లో ఉండి పదవుల్లో ఉండి ఏమి చేయలేక ఇప్పుడు జెండా మారినంత మాత్రానా చేస్తారా అన్న భావం సహజంగా ఉంటుందని వైకాపా ఆలోచన. రాజకీయ పరిశీలకులు కూడా ఈ భావంతో ఏకీభవిస్తున్నారు. మనుషులు వారే, జెండా, గుర్తు మారిందంతే. పైగా ప్రచారంలో తిరిగేది వారే, ఓట్లు అడుక్కునేది వారే. పైగా టిడిపి కూడా కొంత విభజన పాపం అంటుకుంది. బిజేపికయితే ఏకంగా విభజన జరిగిందే ఆ పార్టీ వల్ల అన్నది సీమాంద్రలో బలంగా ఉంది. రెండు ఒకటే కాబట్టి పొత్తు పెట్టుకున్నాయి. అంతే కాదు కాంగ్రెస్ లో ఉండి విభజనకు సహకరించిన వారినే తమ పార్టీలోకి తీసుకుని టికెట్లు ఇచ్చాయి. అంటే వారిది పూర్తిగా విభజన వాదమే అన్నభావం ప్రజల్లో బాగా నెలకొందని ఇది కూడా వైకాపా కు లాభిస్తుందని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: