సమక్యాంధ్ర రెండు రాష్ట్రాలుగా మారే సమయంలో జగన్ ఉన్నట్లుండి సమైక్య స్టాండ్ తీసుకోవడంతో తెలంగాణలో ఆ పార్టీ దాదాపు ఖాళీ అయింది. ఈ సంగతి అందరికీ తెలిసిందే. ఆ తరువాత జగన్ కూడా తెలంగాణలో పార్టీ నిర్మాణంపై పెద్దగా దృష్టి పెట్టలేదు కూడా. కానీ ఎన్నికల తరుణంలో వైకాపాకు తెలంగాణ అంతటా ఒకటి రెండు స్థానాలు వదిలేస్తే, అన్నిచోట్లా అభ్యర్థులు రాత్రికి రాత్రి పుట్టుకొచ్చారు. ఎలా..హౌ? దీనికి ఒకటే సమాధానం కమ్ ప్రశ్న..టిఆర్ఎస్, వైకాపాలు ఫిక్సయ్యాయా, ఆ రెండు పార్టీలు ఒకే రకమైన విధానంతో ముందుకు పోతున్నాయా, రెండు పార్టీలు లోపాయికారీ అవగాహన పెట్టుకున్నాయా? తమ పార్టీలకే రెండు చోట్ల అధికారం దక్కుతుందని భావిస్తున్నాయా, గెలిచాకా రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా ముందుకుపోవాలని అనుకుంటున్నాయా... ఇలా ప్రశ్నలు వేసుకుంటే, అవును అనే సమాధానమే వినిపిస్తోంది. కారణం ఆ రెండు పార్టీల వైఖరి దీనిని బలపరుస్తోంది. ప్రస్తుతం ప్రచార పర్వంలో టిఆర్ఎస్ కు వైకాపాను విమర్శించడం లేదు. వైకాపా తెలంగాణలో ఏకంగా 80 మంది అభ్యర్థులను నిలబెట్టింది. ఆ పార్టీ తరఫున జగన్ సోదరి షర్మిల ప్రచారాన్ని కూడా ఉదృతం చేసింది. అయినా సరే కేసిఆర్ కాని తెరాస నేతలు కాని ఎక్కడ వైకాపాపై నోరు జారడంలేదు. పల్లెత్తు మాట అనడంలేదు. విభజనను అడ్డుకున్నది టిడిపి అంటూ దుమ్మెత్తి పోస్తున్న టిఆర్ఎస్ వైకాపాను ఆ విషయంలో ఎందుకు విమర్శించడం లేదు అంటే వైకాపాతో టిఆర్ఎస్ కు ఏదో ఫిక్సింగ్ ఉన్నట్టే కదా. నిజానికి టిడిపి కంటే వైకాపానే రాష్ట్ర విభజనను గట్టిగా వ్యతిరేకించింది. ఏకంగా సమైక్యాంధ్ర ఉద్యమమే చేసింది.అయినా సరే షర్మిల ప్రచారం పర్వంలో తెలంగాణ వాదుల నుంచి నిరసనలు వ్యక్తం కావడంలేదు. అదే లోకేష్ పర్యటిస్తే ఆయనపై గుడ్లు రాళ్లు పడ్డాయి. చంద్రబాబుకు కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి. అదే వైకాపా విషయంలో జరగడం లేదంటే దాని పట్ల టిఆర్ఎస్ సానుకూలంగా ఉన్నట్టే కదా. అంతే కాదు షర్మిల కూడా తన ప్రచారంలో టిఆర్ఎస్ ను విమర్శించడంలేదు. తెలంగాణలో వైకాపా గెలవాలంటే టిఆర్ఎస్సే ప్రధాన ప్రత్యర్థి. అయినా కూడా టిఆర్ఎస్ నాయకులను, కేసిఆర్ ను విమర్శించడంలేదు. జగన్, విజయమ్మ, వైకాపా నేతలు రాష్ట్రం విడిపోక ముందు నుంచి కూడా కేసిఆర్ ను విమర్శించలేదు. కేసిఆర్ పార్టీ పెట్టిందే తెలంగాణకోసం, ఆయన సిద్దాంతమే అది, అందుకే విభజన విషయంలో కేసిఆర్ ను తప్పు పట్టాల్సిన అవసరం లేదని జగన్ స్వయంగా ఎన్నో సభల్లో చెప్పారు కూడా. పైగా ఇప్పుడు ఆరెండు పార్టీలు కూడా ఒకే రకమైన విధానాలతో ముందుకు పోతున్నాయి. వైకాపా కూడా సీమాంద్రలో ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోలేదు. టిఆర్ఎస్ కూడా తెలంగాణలో ఒంటరిగానే పోటీలోకి దిగింది. అంటే రేపు ఎన్నికలయ్యాక ఎలాగా సీమాంద్రలో జగన్, తెలంగాణలో కేసిఆర్ లే ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తారన్న ధీమా వారికి ఉండి ఉండాలి. అలా జరిగితే విడిపోయి పక్కపక్క రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటే రేపు అభివృద్దికి పరస్పర సహకారం అవసరం. అంతే కాదు ఈ ఇద్దరికే మెజారిటి ఎంపీ స్థానాలు కూడా వస్తే రేపు కేంద్రంలో తమ మద్దతుతో ఎవరు అధికారంలోకి వస్తే వారికి మద్దతివ్వాలని కూడా భావిస్తున్నారని సమాచారం. అప్పుడు ఈ ఇద్దరు స్నేహితులు అవుతారు. సమిష్టిగా అభివృద్దిలో సహకరించుకుంటారు. ఇదే ఆలోచనతో ఈ రెండు పార్టీలు ఇప్పుడు పోట్లాడుకోకుండా అలా ఫిక్సయ్యారు అన్న టాక్ వినిపిస్తోంది.​

మరింత సమాచారం తెలుసుకోండి: