తెలంగాణ ఇచ్చినందుకు ఎట్టిపరిస్థితుల్లో కూడా తమకు అధికారం అందించాల్సిందే అని కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రజలను డిమాండ్‌ చేస్తోంది. 60 సంవత్సరాల కలను సాకారం చేసినందుకు తమకు మెజారిటీ స్థానాలు ఇవ్వాలని ఎమ్మెల్యేలతో పాటు అత్యధికంగా ఎంపీ స్థానాలను కూడా తమకే ఇవ్వాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు నుండి కింది స్థాయి నేతల వరకు ప్రజలను కోరుతున్నారు. ఎలాగైనా తెలంగాణలో అధికారం దక్కించుకోవడం కోసం పావులు కదుపుతున్నారు కాంగ్రెస్‌ నాయకులు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న కాంగ్రెస్‌ గతంలో దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తాం అని ప్రకటించారు. దాంతో మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహాతో పాటు ఇంకా పలువురు దళిత నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఆ తర్వాత బీసీ ముఖ్యమంత్రి అన్నారు. తాజాగా రాహుల్‌గాంధీ హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్‌ పార్టీకి అధికారం ఇస్తే ఒక మహిళను ముఖ్యమంత్రిగా చేస్తాం అని ప్రకటించాడు. మహిళల సాధికారత కోసం కాంగ్రెస్‌ నిలుస్తుందని ఈ సందర్బంగా రాహుల్‌ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశాడు. రాహుల్‌ ప్రకటనతో కాంగ్రెస్‌ నాయకుల్లో గుబులు మొదలైంది. మరోవైపు కాంగ్రెస్‌ మహిళా నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కావాలనే కోరికతో పలువురు మహిళా నాయకురాల్లు పావులు కదుపుతున్నారు. వీరిలో ముఖ్యంగా డీకే అరుణ్‌, గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలు ఉన్నారు. వీరి ముగ్గురితో పాటు ఇంకా కొంత మంది మహిళా నాయకులు కూడా ముఖ్యమంత్రిగా ఆ సీటును అలంకరించాలని కోరుకుంటున్నారు. ఈ వ్యూహంతో బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించిన తెదేపాను, టీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది కాంగ్రెస్‌. మరి తెలంగాణ కాంగ్రెస్‌ మహిళా ముఖ్యమంత్రి ఎత్తు ఫలిస్తుందా? కాంగ్రెస్‌కు ఓట్లు రాలుతాయా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: