కొన్ని పార్టీలు గెలవడానికి పోటీ చేస్తాయి. కొన్ని పార్టీల వల్ల గెలిచేవారికి ఝలక్ తగులుతుంటుంది. తెలంగాణలో ఇప్పుడు వైకాపా పరిస్థితి ఇలాంటిదే. విభజన ఉద్యమం నేపథ్యంలో తెలంగాణలో వైకాపా దుకాణం ఖాళీ అయింది. అది నిన్నటి మాట. ఇప్పుడు మళ్లీ దుకాణం తెరిచారు. అది నేటి మాట. సుమారు ఎనభై స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అంటే ఇంతో అంతో చిగురు తొడిగినట్లే. అయితే ఈ చిగుర్లు విజయం వరకు ఉపకరిస్తాయన్నది అనుమానం. కానీ గెలిచే అవకాశం వున్న టీఆర్ఎస్, తేదేపాల కొంపల్లో ఒకరి కొంప ముంచడం మాత్రం ఖాయం. నిన్నటి దాక తెలంగాణలో వైకాపాలేదు. జగన్ పార్టీ టోటల్ గా ఖాలీ అయింది. జెండా ఎత్తేవాడు కాదు కదా, వైకాపా మాట కూడా ఎత్తేవాడు తెలంగాణలో లేరు అన్నారు. కాని ఇప్పుడు ఏకంగా తెలంగాణలో 80 అసెంబ్లీ, 10 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టింది వైకాపా. ఇది అందరిని ఆశ్యర్యపరచింది. ఇక నామినేషన్ల పర్వం నాటికి ఒక్కసారిగా నేతలు పుట్టుకు రావడం అంటే మాటలు కాదు కదా. 117 నియోజకవర్గాల్లో ఏకంగా 80 నియోజకవర్గాలకు పోటీ చేసే స్థాయి లీడర్లు ఆయా నియోజకవర్గాల్లో దొరికారంటే దానర్థం పార్టీ ఇంకా బతికి వుందనే కదా.. చోటా మోటా లీడర్, గల్లీ లీడర్ అయితే పోటీ చేయడానికి ముందుకు వస్తే రావచ్చు కానీ, మరీ టికెట్ లు బఠానీ లు పంచినట్లు పంచేయరు కదా? . టిడిపి వంటి పార్టీకే కొన్ని నియోజక వర్గాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకని పరిస్తితి. ఎదురు లేదు అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీనే నల్గొండ జిల్లా కోదాడకు అభ్యర్థిని నిలబెట్టలేక పోయింది. సిపిఐకి ఇచ్చి తప్పించుకోవాలని చూసి ఫెయిలయింది. చివరకు చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా పరువు కోసం ఒకరిని రంగంలోకి దించింది. అలాంటిది అసలు ఏమీ లేదనుకున్న వైకాపాకు ఏకంగా వందమంది లీడర్లు పుట్టుకొచ్చారంటే మాత్రం ఆషా మాషీ కాదు. వారంతా జనాల్లో అంతో ఇంతో పేరున్న వారే. ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉంటున్నవారే, వారి వెంట ఇంతో అంతో బలము, బలగము ఉన్నవారే. ఎంత హీన పక్షంలోనైనా కనీసం రెండు మూడు వేలమందిని కలిగి ఉంటారు వెంట ఆ మాత్రం బలం లేని వారు రాజకీయాల్లో ఉండరు కదా. అందుకే జగన్ ఇప్పుడు తెలంగాణలో ఎవరికి ఝలక్ ఇస్తారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఝలక్ ఇస్తారా, లేక నిజంగానే కొన్నింటిని తన ఖాతాలో వేసుకుంటారా అన్నది కూడా ఆలోచించాల్సిందే. ఎందుకంటే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో జగన్ బలాన్ని తీసి పారేయలేం. ఖమ్మ, నల్గొండ జిల్లాల్లో వైకాపాకు మంచి పట్టుంది. ఎందుకంటే టికెట్లు కేటాయించాక జగన్ పార్టీలోని ఖమ్మం, వరంగల్ నేతల్లో టికెట్లు విషయంలో గోల జరిగింది. లీడరే లేడను కుంటే పోటీ పడ్డారంటే అక్కడ పార్టీ పట్టు గెలుపునకు దగ్గరలో ఉన్నట్టే. ఖమ్మంలో నయితే వైకాపా ఎంపీ అభ్యర్థిని నామినేషన్ వేయకుండా టిఆర్ఎస్ అడ్డుకునే ప్రయత్నం చేసింది. అంటే అక్కడ వైకాపా తో టిఆర్ఎస్ కు ముప్పు ఉన్నట్టే కదా. లేకుంటే అంత భయమెందుకు. సరే గెలుస్తారా, లేదా అన్నది పక్కన బెడితే ఓట్లను మాత్రం చీలుస్తారు. ఇది చాలు గెలిచే పార్టీని ఓడించడానికి, ఓడి పోయే పార్టీని గెలిపించడానికి . అందుకే తెలంగాణలో జగన్ ఝలక్ ఇచ్చేదెవరికి అన్న టాక్ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: