పార్టీల ప్రచారాలు హోరెత్తాయి.. ఓటర్లకు తాయిలాలు గుప్పించారు.. బందుత్వాలు కలుపుకుంటు ఓట్లు అభ్యర్థించారు.. డబ్బులు, మందు కుమ్మరించారు.. అయితే ఓటరు దేవుని మనసులో ఏముందో ఎవరికి ఎరుక. తన తీర్పును ఈవీఎం మీట నొక్కి తీర్పు చెప్పనున్నారు. బుధవారం ఉదయం నుంచే పోలింగ్ ప్రారంభం కానుంది. ఓటరు తన తీర్పును వెల్లడించబోతున్నాడు. విలువల వలువలూడిన నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికలివి. గొంగట్లో భోంచేస్తూ వెంట్రుకలు ఏరినట్టుగా, ఇలాంటి చర్చ కోసం వెతకలేము. కానీ రాజకీయ పార్టీలు, అభ్యర్థులు అనుసరించిన ప్రచార పద్ధతులు, వీరి చరిత్ర తదితర అంశాలు ఓటర్లు ప్రత్యక్షంగా చూశారు. చైతన్యంతో తీర్పునివ్వాల్సిన సమయమిది. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గన్నట్టు, ఎన్నికలు ప్రకటించిన తర్వాత కూడా రెండు మూడు పార్టీలు మారిన అభ్యర్థులున్నారు. ఏక కాలంలో రెండు పార్టీల 'బి' ఫారాలు పట్టుకుని, ఏది లాభమో ఎంచుకున్న వారున్నారు. తామేపార్టీ అభ్యర్థిగా ఉన్నారో కూడా మరచిపోయి, మరోపార్టీకి అనుకూలంగా నినాదాలిచ్చిన అభ్యర్థులు, ఉపన్యాసాలిచ్చిన అభ్యర్థులున్నారు. నాయకుల ఉపన్యాసాలు తిట్ల పురాణాలకు ఈ ఎన్నికల ప్రచారం పరాకాష్ఠగా నిలిచింది. జాతీయ స్థాయిలో బీజేపీ - కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది. రాహుల్ తో సహా కాంగ్రెస్ నేతలు మోడీ పెళ్లి విషయాన్ని వివాదం చేయాలని చూసే సరికి... బీజేపీ మరింత రెచ్చిపోయింది. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా ఆస్తుల అనూహ్య పెరుగుదలను బీజేపే నేతలు వివాదం చేసేందుకు ప్రయత్నం చేశారు. దీనిపై బీజేపీ నేతలు ఏకంగా ఒక సీడీ, బుక్ లెట్ కూడా తీసుకొచ్చారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్ నేతలు.. మోడీకి ఒక హవాలా వ్యాపారితో సంబంధాలున్నట్టు కొత్త సీడీని బయట పెట్టారు. ఈ ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్ధులు విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేయడం జుగుప్స కలిగించింది. అక్రమ డబ్బు, మద్యం పంపకాలలో మన రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నదని ఎన్నికల కమిషన్‌ ప్రకటించిందంటేనే దాని తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ఇందుకు పాల్పడిన పార్టీలు, నేతలు నాగరిక ప్రపంచం ముందు తెలుగు ప్రజలను తలదించుకునే స్థితిని సృష్టించారు. పేదరికాన్ని ఆసరా చేసుకునే నేతలు ఓటును.. నోటుకమ్ముడుపోయే సరుకుగా మార్చి అందలం ఎక్కుతున్నారనీ, అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేదల పొట్టలే కొడుతున్నారనీ గుర్తించిన రోజున ఓటరు మూడో కన్ను తెరవడం ఖాయం. పనికి రాని సర్వేలు పార్టీలు లోపాయికారీగా కోట్లు ఖర్చు చేసి సర్వేలు చేయించాయి. ఎవరికనుకూలంగా వారు ప్రకటించుకున్నారు. దీంతో సర్వేలు సైతం సరుకుగా మారాయి. సర్వే సంస్థలు విశ్వసనీయత గురించి కూడా పట్టించుకునే స్థితిలో లేవు. సంపాదనే ముఖ్యం కదా! సర్వేల ఫలితాల మధ్య ఓటరును ఒకింత గందరగోళ పరిచారనవచ్చు. వాగ్దానాల వరద వెల్లువెత్తింది. నిన్నటి దాకా అధికారంలో ఉన్న వారు, గతంలో తగినంతకాలం ఏలిన వారు కూడా పోటీలు పడి హామీలు గుప్పించారు. వీరు అధికారంలో ఉండగా ఎందుకు చేయలేకపోయారని ఆలోచించే విచక్షణ ప్రజలు ప్రదర్శించలేరని వీరికి గట్టి నమ్మకమేమో!. అందుకే వాగ్దానాలే తప్ప, విధానాల ప్రస్తావన లేదు. తెలంగాణా ఇచ్చిన వారికి ఓటేయమని ఒకరు. తెచ్చిన వారికి వేయమని మరొకరు. ఇందుకు సహకరించిన వారికి వేయమని ఇంకొకరు. అంటే తాము ప్రజలకు చేయాల్సింది చేశామని, భవిష్యత్తులో చేయాల్సిందేమీ లేదని, ఇక రుణం తీర్చుకోవాల్సింది ప్రజలేనని చెప్పకనే చెప్పారు. సీఎం అభ్యర్థుల ప్రకటన ఒక పార్టీ నేత తెలంగాణా తొలి ముఖ్యమంత్రి దళితుడేనని ప్రకటించారు. తెలంగాణా ప్రకటన వచ్చిన నాటి నుంచి మళ్లీ ఆ మాట మాట్లాడ లేదు. మరొకాయన తెలంగాణాకు బిసి ముఖ్యమంత్రి అన్నాడు. సీమాంధ్రకు బిసి ముఖ్యమంత్రి ఎందుకవసరం లేదో చెప్పడు. ఇంకో కేంద్ర నాయకుడు వచ్చి తెలంగాణా తొలి ముఖ్యమంత్రి మహిళ కావాలన్నారు. సామాజిక తరగతులకు గాలం వేస్తున్న వీరు, ఒక్కరిని ముఖ్యమంత్రిని చేస్తే, ఆ తరగతికి చెందిన కోట్ల మందికి ఏమి ఒరుగుతుందో మాత్రం చెప్పరు. మొత్తం మీద ఎన్నికలను, రాజకీయాలను సైతం వ్యాపారమయం చేశారు. విలువలకు తిలోదకాలిచ్చారు. అధికార పార్టీ అకృత్యాలు మరిచి పొత్తులు ప్రత్యక్షమయ్యాయి. అధికార దాహం ముందు లౌకిక విలువలు కూడా దిగుదుడుపే అయ్యాయి. అభివృద్ధి ముసుగులో లౌకిక విలువలకు తిలోదకాలిచ్చి, పొత్తులకు సిద్ధపడ్డారు. పార్టీ పెట్టి ఏకంగా దానినే సరుకుగా మార్చి వేసిన దుస్థితికి కూడా రాష్ట్రం వేదికగా మారింది. ఈ దురవస్థకు ముగింపు పలకాలి. తెలంగాణా వస్తే ఏదో జరుగుతుందనుకున్నారు జనం. ఎన్నికల వేళ మాత్రం తేడా ఏమీ కనిపించలేదు. భవిష్యత్తు తెలంగాణా నిర్మాణానికి ఆచరణాత్మకమైన ఎజెండాను ఏ పార్టీ కూడా స్పష్టంగా ప్రజల ముందుంచలేక పోయింది. గతమంతా ప్రజల నంటిపెట్టుకుని, ప్రజల కోసం పని చేసిన చరిత్ర కమ్యూనిస్టులది. భవిష్యత్తులోనూ ప్రజల ఎజెండాతో ముందుకు సాగేది కమ్యూనిస్టులే. ఓటరు విజ్ఞత ప్రదర్శించాలి. విలువలు పునరుద్ధరించాలి. ప్రజల కోసం అంకితమై విలువలకు కట్టుబడి, చట్ట సభల్లో ప్రజాప్రయోజనాలు ప్రతిబింబించే ప్రతినిధులనే ఎన్నుకోవాలి. ఇదే ఓటరు ముందున్న కర్తవ్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: