నిన్న మొన్నటి దాక ఉన్న పరిస్థితులు తెలంగాణలో ఇప్పుడు లేవు. పోలింగ్ ఘడియలు సమీపించిన ఈ తరుణంలో అప్పటి వరకు బలంగా కన్పించిన టిఆర్ఎస్ బలం తగ్గినట్టు కనిపిస్తోంది. బలహీనంగా ఉందనుకున్న కాంగ్రెస్ కాస్త బలం పుంజుకుంది. అసలే లేదు అనుకున్న టిడిపి బిజేపితో పొత్తుతో అది కూడా పుంజుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో హంగ్ ఏర్పడుతుందన్న అనుమానాలు మెుదలయ్యాయి. నిజంగా హంగ్ పరిస్థితి వస్తే, కాంగ్రెస్ వైఖరి ఎలా వుంటుంది? నమ్మకద్రోహం చేసిందని ఆరోపిస్తున్న టీఆర్ఎస్ తో కలుస్తుందా? టీఆర్ఎస్ అయితే అప్పుడే ఇందుకు అనుకూలమైన సిగ్నళ్లు ఇచ్చేసింది. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ మోడీతో కలిసేది లేదని స్పష్టం చేసేసింది. కాంగ్రెస్ కు, రాహుల్ ప్రధాని అయ్యేందుకు తాము మద్దతు ఇస్తామని కెసిఆర్ చెప్పేసారు. దీనికి నేపథ్యం ఏమిటన్నది ఓ సారి చూడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో అతి పెద్ద పార్టీలు అంటే అధిక స్థానాలు గెలుచుకునే మొదటి రెండు స్థానాల్లో టిఆర్ఎస్, కాంగ్రెస్ లు ఉంటాయి. రెండు పార్టీల్లో దేనికి పూర్తి మెజార్టీ రాకున్నా, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఒకటి మరో దానికి మద్దతివ్వాలి. వారి మద్య తేడా ఎక్కువ లేక పోతే మాత్రం ఇబ్బందే. అయితే అందుకే టీఆర్ఎస్ రాహుల్ కు మద్దతు అన్న తురుపు ముక్కను ఇప్పటి నుంచే ప్రయోగిస్తున్నట్లు అర్థమైపోతోంది. అంతే కాదు ఈ రెండు పార్టీలకు అధికారం కోసం మరో పార్టీతో జత కట్టే అవకాశాలు కూడా లేవు. కారణం అంతో ఇంతో సీట్లు దక్కించుకునే పార్టీలైమైనా ఉంటాయా అంటే అవి టిడిపి, బిజేపిలే. కాంగ్రెస్ ఎలాగు బిజేపి పొత్తును అంగీకరించదు. కెసిఆర్, భాజపా ఎన్డీఏకు ఎట్టి పరిస్థితుల్లోను పొత్తు పెట్టుకోను అని ప్రకటించేసారు.అంటే టిఆర్ఎస్,కాంగ్రెస్ లు కలిస్తేనే తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. నిజానికి ఎన్నికల ముందు కెసిఆర్ ఈ ఆలోచనలో లేరు. ఎంతవరకు ఒకటే ఆలోచన. సోలోగా సీట్లు కేటాయించుకోవాలి. సోలోగా అధికారం అందుకోవాలి. ఇప్పుడు సీట్లు కేటాయింపు, వాటిలో లావాదేవీలు, లాలూచీలు అయిపోయయి. ఇక మిగిలింది అధికారం అందుకోవడం. ఇక్కడ అవసరమైతే కాంగ్రెస్ సహాయం తీసుకోవడానికి ఆయనకేమీ మొహమాటం లేదు. కానీ ఇప్పటికే కాంగ్రెస్ నేతలు రాహుల్ తదితరులు టిఆర్ఎస్ నే తెలంగాణ సమాజం ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసారు. తాము కేసిఆర్ కు చెప్పిన విధంగా తెలంగాణ ఇచ్చాం. కాని ఆయనే విలీనం చేస్తానని ఇచ్చిన మాట తప్పారు అని కుండ బద్దలు కొట్టారు. పోని పొత్తకయినా సిద్దమే అంటే అధికార దాహంతో అది కూడా వద్దన్నది కేసిఆరే అంటూ కాంగ్రెస్ కేసిఆర్ ను ఎంత బదనామ్ చేయాలో అంతా చేసింది. అదే ఇప్పుడు కాంగ్రెస్ బలం పుంజుకోవడానికి కారణం అయింది. అందుకే రేపు తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ కీలకం అవడం కాదు, తనే ఏర్పాటు చేసే స్థాయికి వచ్చినా ఆశ్చర్య పోనక్కరలేదు. ఢిల్లీ తీర్పువలే కాంగ్రెస్, టిఆర్ఎస్ ల మద్య తేడా స్వల్పంగా ఉంటే మరీ ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడవచ్చు. అప్పడు తామే మప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ బెట్టు చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ అప్పడు టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందా? ఢిల్లీలో మాదిరిగా నన్ను ముట్టద్దు అంటూ మూలన కూర్చుని, అసెంబ్లీ అనేదే లేకుండా చేస్తుందా? ఎమ్ఐఎమ్, వైకాపా కూడా కాంగ్రెస్ ను కాదని టీఆర్ఎస్ వెంట రావు. అలాంటపుడు విధిలేని పరిస్థితుల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తే, ఇక అంతే సంగతులు. అది మరో ప్రజారాజ్యం పార్టీ అయిపోతుంది. అంతకన్నా, పక్కన వుండి మరోసారి ఎన్నికల కోసం ప్రయత్నించడం మేలు అని కేసిఆర్ అనుకున్నా అనుకోవచ్చు. లేదా, అప్పుడు విలీనం చేస్తా, సిఎమ్ పదవి ఇవ్వండి అని అడిగినా అడగొచ్చు. అంతే కాదు కేంద్రంలో అధికారంలోకి వచ్చేలా ఉంటే కాంగ్రెస్ వైఖరి ఒక రకంగా, ఆపరిస్తితి లేకుంటే మరో రకంగాను ఉండొచ్చు. అందుకే హంగ్ ఏర్పడితే తెలంగాణ రాజకీయాలు మహా రంజుగా వుంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: