కేసిఆర్ బలం తగ్గింది. ఇది ఎవరో కాదు ప్రచారపర్వంలో అన్నది కాదు. స్వయంగా కేసిఆర్ మాటలు, టిఆర్ఎస్ నేతల తీరు చూస్తే ఈ విషయం అర్థం అవుతోంది. తెలంగాణ రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన నేపథ్యం నుంచి పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన తర్వాత వరకు కేసిఆర్ గ్రాఫ్ తెలంగాణలో అమాంతం పెరుగుతూనే ఉంది. సర్వేలు కూడా ఈ విషయాన్నే స్పష్టం చేసాయి. వీటిని చూసుకునే కెసిఆర్ తన దూకుడు అమాంతం పెంచేసారు. జెఎసి ని పట్టించుకోలేదు. కాంగ్రెస్ పొత్తు, విలీనం కాదు పొమన్నారు. టికెట్ ల కేటాయింపు తన చిత్తానికి, విత్తానికి కానిచ్చారు. కాని ప్రస్తుతం పరిస్థితులు తారుమారైనట్లు కనిపిస్తున్నాయి. సెటిలర్ల ఓట్లు ఎక్కడ వున్నా, అవి టీఆర్ఎస్ కు వెళ్లవన్న సంగతి తెలిసిందే,. అదే సమయంలో పట్టణాల్లోని కాస్త ఆలోచనాపరుల ఓట్లు మోడీ పుణ్యమా అని భాజపా దిశగా మళ్లుతున్నాయి. దీంతో మొత్తం మీద అరడజనుకు పైగా జిల్లాల్లో టీఆర్ఎస్ విజయానికి ఎదురీదాల్సి వస్తోంది. నల్గొండ, ఖమ్మం,వరంగల్, హైదరాబాద్,రంగారెడ్డి వంటి జిల్లాల్లో గెలుపు కోసం కష్టపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయిదారు జిల్లాల్లో ఒకటి రెండు సీట్లయినా టిఆర్ఎస్ గెలుస్తుందా అన్న అనుమానాలు స్వయంగా గులాబి దండులోనే నెలకొన్నాయి. టీఆర్ఎస్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుగుర్రంగా మారుతోంది. ఒకప్పుడు ఆయనకు అండగా పని చేసిన ఓయు విధ్యార్థులు ఈ రోజు చెప్పులు చేతపట్టి అడ్డం పడ్డారంటే పరిస్థితి ఎంతదాకా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ కోసం ఎంతకైనా పోరాడతాను అని ప్రకటించిన కేసిఆర్ తీరా వచ్చాక అధికారం కోసం అంతకు అంతా దిగజారారు. అంతే కాదు టిఆర్ఎస్ నిన్నటిదాకా ఉద్యమ పార్టీ నేడు రాజకీయ పార్టీ అంటూ ప్రకటించారు. జెఎసి ని పట్టించుకోవడం మానేసారు. ఉద్యమాల్లో పాల్గోన్న వారికి అరకొర సీట్లు విదిలించారు. పెట్టుబడి దారులను తెచ్చి పెద్ద పీట వేసారు. సరేలే 12 ఏళ్లు పోరాడిన నాయకునికి ఇంత మాత్రం స్వార్థం ఉండదా అనుకున్నారు. తెలంగాణ వచ్చేదాక ఇక్కడి సీమాంద్రులకు తానే రక్ష అంటూ చెప్పుకున్నారు. కొన్ని రోజులు అదే స్టాండు మీదున్న కేసిఆర్ తెలంగాణలో గెలుపు కోసం మళ్లీ తెలంగాణ వాదులను రెచ్చగొట్టడం మొదలెట్టారు. ఉద్యోగులకు ఆఫ్షన్లు ఉండవన్న ప్రకటనతో మొదలైన ఈ పర్వం మెల్లమెల్లగా ఉద్యమం పాకాన ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించారో అంత దాకా వెళ్లింది. ఉద్యోగాలు దొరుకుతాయనే యువత ఆయనకు బాసటగా నిలిచింది. విద్యార్థులు కూడా అదే ఆశపడ్డారు. ఇప్పుడు కాంట్రాక్టు ఉద్యోగులందరిని రెగ్యులర్ చేస్తాననగానే ఇంకా కొత్త ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయని ఓయు విధ్యార్థుల్లో ఆగ్రహం పెల్లుబుకింది. ఇది అంతటితో ఆగకుండా ఉద్యమాన్ని అణచివేసేందుకు కుట్రలు పన్నిన కొండా సురేఖ వంటి వారిని పార్టీ లో చేర్చుకుని టికెట్ ఇవ్వడం కేసిఆర్ ఒంటెద్దు పోకడకు పరాకాష్టగా నిలచింది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను మోసం చేయడం, తెలంగాణ ఉద్యమకారులును, తెలంగాణ వాదులను పక్కన బెట్టడం, విధ్వేషాలను రెచ్చగొట్టడం ఇలా ఎన్నో ఎన్నెన్నో కారణాలు. దీంతో టీఆర్ఎస్ లేదా కేసిఆర్ ప్రతిష్ట మసకబారడం ప్రారంభమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: