కాశీకి పోయాను రామాహరి.. గంగ తీర్థమ్ము తెచ్చాను రామాహరి.. కాశీకి పోలేదు రామాహరి.. మురుగు కాల్వలో నీళ్లండీ రామాహరి.. శ్రీశైలమెళ్లాను రామాహరి.. శివుని విభూది తెచ్చాను రామాహరి.. శ్రీశైలం పోలేదు రామాహరి.. ఇది కాష్టంలో బూడిద రామాహరి.. ఈ తరం వారికి ఈ పాట పరిచయం లేకపోయినా విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తరం వారికి మాత్రం.. హాస్యభరితమైన ఈ సినీ గీతం సుపరిచితమే. అప్పు చేసి పప్పు కూడు సినిమాలో రేలంగి సన్యాసం వేషంలో రాగా.. అదంతా జనాన్ని మాయచేసే ప్రయత్నమని.. వాటిని నమ్మవొద్దంటూ గిరజ పాట రూపంలోనే కౌంటరిచ్చి ఆ సందర్భాన్ని రక్తి కట్టిస్తుంది. మరో కోణంలో అన్వయించుకుంటే... లగడపాటికి ఈ పాట సరిగ్గా అతికినట్లు సరిపోతుంది. లగడపాటి అప్పటికి కాంగ్రెస్ పార్టీలో ఎంపీ. అత్యంత కీలకమైన నేత. రాష్ట్రం విడిపోదని గట్టిగా చెప్పారు. విడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించేశారు. ఆయనకు ప్రతికూలంగా కేంద్రం నుంచి నిర్ణయం రావటంతో తీవ్ర అసంతృప్తితో.. అదే రోజే.. ఇచ్చిన మాటకు కట్టుబడి తనదైనశైలిలో రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఐతే లగడపాటి వారు చెప్పే మాటలకు చేసే పనులకు మాత్రం ఎక్కడా.. ఏమాత్రం.. పొంతన కుదరటం లేదు. రాజకీయ సన్యాసం చేశానంటూనే.. మళ్లీ కొత్త రాజకీయ పార్టీలో కీలకంగా కొనసాగుతూ తన జిత్తుల మారి రాజకీయాన్ని బయటపెట్టారు. మైకు దొరికితే చాలు గంటల గంటలు స్పీచ్ ఇచ్చే ఈ మైకాకుసురుడి.. ఉద్దేశంలో రాజకీయ సన్యాసం అంటే ఏంటో మరి. రాజకీయ సన్యాసం అంటే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవడం అని అందరికీ తెలుసిన విషయం. తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ ఆమరణ దీక్ష చేస్తే.. అదంతా సెలైన్ ఉద్యమమని నిరూపించటానికి తనూ దీక్షకు దిగి... అసలు దీక్షలంటేనే ప్రజలు ఛీత్కరించుకనేలా చేసిన లగడపాటి... ఇప్పుడు రాజకీయ సన్యాసానికీ తనదైన శైలిలోనే సరికొత్త నిర్వచనాన్ని ఇస్తున్నారు. నోటి వెంట రాజకీయాలు మాట్లాడుతూనే రాజకీయ సన్యాసం చేస్తారట..! ఇదేం సన్యాసమో అంటూ ఆయన చుటుపక్కలున్న జనం నోరెళ్ల బెట్టి మరీ చూస్తున్నారు. శకునం చెప్పే బల్లి కుడితి కుండీలో పడ్డట్టు.. మాజీ ఎంపీ పర్వతనేని ఉపేంద్ర అల్లుడిగా రాజకీయాల్లోకి వచ్చిన లగడపాటి విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. రెండు పర్యాయాలు ఎంపీ అయిన ఆయనకు... సర్వేల విషయంలో హస్తవాసి బాగానే ఉన్నట్లు ప్రచారం ఉంది. అందుకు తగ్గట్టే ఆయన చెప్పే అంచనాలు... ఫలితాలకు కాస్త దగ్గరగానే ఉంటున్నాయి. ఇంకేముందు ఈ విషయంలో సారువారు చెలరేగిపోతారు. తాను చెప్పానంటే... అది జరిగిపోవాల్సిందే అన్నంతగా రెచ్చిపోతారు. ఇదే సమయంలో ఈ జిత్తుల మారి... సర్వేలను సాకుగా చూపి... చెప్పాల్సిన విషయాలను చాలానే చెబుతారు. రాష్ట్ర విభజన విషయంలోనూ పలుసార్లు ఎట్టిపరిస్థితుల్లో రాష్ర్టం సమైక్యంగానే ఉంటుందని నమ్మించే ప్రయత్నం చేసి... ఆనక నోరు కరుచుకున్నారు. సర్వేలను నమ్ముకున్న లగడపాటి ఐదు రాష్ట్రాల ఎన్నికలపై సర్వే చేయించి నివేదికలు పంపించామని, అవి నిజమని తేలిన తర్వాత కేంద్రం విభజన విషయంలో వెనక్కి తగ్గుతుందని ప్రకటించారు. ఐతే ఆశ్చర్యకరంగా, మన సర్వేల సారును విస్మయానికి గురిచేస్తూ.. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ విభజన విషయంలో వెనక్కు తగ్గటం మాట అటుంచితే.. మరింత వేగం పెంచి రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసింది. రాష్ట్ర విభజన జరగదు. తెలుగు జాతి విడిపోదు. పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలంటేనే భయపడేలా చేస్తామంటూ.. ఊకదంపుడు కబుర్లు చెబుతూ.. నానా హడావుడి చేసిన లగడపాటి.. విభజన విషయంలో అధికార పార్టీ ఎంపీగా చేతులెత్తేసి.. రాజకీయ సన్యాసాన్ని ప్రకటించారు. ఐతే ఇక్కడే ఓ తిరకాసు ఉంది. సారు ఇక రాజకీయాల్లో ఉండరని, వ్యాపారాలు చేసుకుంటూ జీవితం గడిపేస్తారని అందరూ భావించారు. అదే జరిగితే లగడపాటి రాజగోపాల్ ఎందుకు అవుతారు. అందుకే ఆయన మరుసటి రోజు నుంచి నిత్యం రాజకీయాల్లోనే మునిగి తేలుతున్నారు. అంతటితో ఆగక మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పెట్టిన జై సమైక్యాంధ్ర పార్టీకి అన్నీ తానై వ్యవహరించారు. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించిన ఈ రాజకీయ సన్యాసి లగడపాటి.. జై సమైక్యాంధ్ర పార్టీలో వ్యూహకర్త బాధ్యతల్లో తరిస్తూ... రాజకీయనేతల మాటంటే నీటమూటలని నిరూపించారు. లగడపాటి ఏది చేసినా పెద్ద ఎత్తున ప్రచారాన్ని కోరుకుంటారు. అదే క్రమంలో రాజకీయ సన్యాసం నిర్ణయాన్ని ప్రకటించి విజయవాడ వచ్చిన సందర్భంగాను పెద్ద హైడ్రామాకు తెరతీశారు. తనకు అనుకూలంగా ఉండే కార్యకర్తలు, నాయకులను భారీగా సమీకరించి లగడపాటి రాజకీయాల్లో కొనసాగాల్సిందేనంటూ వారితో హడావుడి చేయించారు. దీని కోసమే చాట్రాయిలో ఓ కార్యకర్త ఆమరణ నిరాహార దీక్షకూ దిగారు. అక్కడికి వెళ్లిన లగడపాటి రాష్ట్ర విభజనపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చినా, కిరణ్ పార్టీ పెట్టినా రాజకీయాల్లో కొనసాగుతానంటూ రాజకీయాలపై తనకున్న మక్కువను బయటపెట్టుకున్నారు. తాజాగా విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ తరపున సొంత ప్యానల్‌ పెట్టి రాజకీయంగా ఉనికి కోల్పోకుండా ప్రయత్నాలకు తెరతీశారు. రాజకీయం అనే నీటిలో చేపలా మారిన లగడపాటి.. ఏదో ఒక సాకుతో మళ్లీ ఎన్నికలకు సిద్ధమవుతారని స్థానికులు చర్చించుకుంటున్నారు. తనలో మార్పు వస్తే జగడపాటి ఎలా అవుతారు.. అందుకే తాజాగా నా పైత్యం అంటూ ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయో సర్వే చెప్పారు లగడపాటి. ఆఖరి విడత ఎన్నికలు ముగిసే వరకు ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ పై నిషేధం ఉన్నా.. ఏ మాత్రం నిబంధనలు పాటించని లగడపాటి రాజగోపాల్ కు ఈసీ షాక్ ఇచ్చింది. ఒపీనియన్ పోల్స్ వెల్లడించిన లగడపాటికి ఈసీ నోటీసులు జారీ చేసింది. మొత్తానికి రాజకీయాల్లో ఉన్నా.. లేకపోయినా లగడపాటి పైత్యం ఏ మాత్రం తగ్గడం లేదుసరి కదా మరింతా పెరుగుతూనే వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: