దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం అన్ని విపక్ష పార్టీల్లోనూ తీవ్ర కలకలాన్నే రేపుతోంది. మోదీ గాలిలో కొట్టుకుపోయిన జెడియు, ఆర్జేడి లో ఇప్పటికే కలకలం మొదలవగా, దిగ్గజపార్టీ కాంగ్రెస్ లోనూ కుదుపులు మొదలయ్యాయి. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తమ పదవులకు రాజీనామా చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి దారి తీసిన పరిస్థితులను అధ్యయనం చేసేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రేపు (సోమవారం) సమావేశమవుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తున్నట్టు సోనియా, రాహుల్ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం విదితమే. వీరు సోమవారం తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమైనా అది కేవలం రికార్డు కోసమే తప్ప వాస్తవంగా రాజీనామా చేయవలసిన అవసరం రాకపోవచ్చునని పలువురు అంటున్నారు. సోనియా, రాహుల్ నిజంగానే తమ పదవులకు రాజీనామా చేసి వెళ్లిపోతే కాంగ్రెస్ పార్టీ కుప్పకూలుతుంది కాబట్టి వారి రాజీనామాలకు ఒప్పుకునే ప్రసక్తే లేదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. సోనియా, రాహుల్ ఆధారంగానే కాంగ్రెస్ నడుస్తోందని, వారే వెళ్లిపోతే ఇక కాంగ్రెస్ ఎక్కడుంటుందని వారంటున్నారు.కాంగ్రెస్ పరాజయానికి దారి తీసిన పరిస్థితులను సిడబ్ల్యుసి సమావేశంలో లోతుగా విశే్లషించిన అనంతరం పార్టీని పటిష్టవంతం చేసేందుకు తీసుకోవలసిన చర్యలపై దృష్టి సారిస్తారని ఏఐసిసి వర్గాలు చెబుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 10 రాష్ట్రాల్లో కాంగ్రెస్ కనీసం ఖాతా కూడా తెరవకపోవడంపై నాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఈ పతనాన్ని ఇక్కడితో అదుపుచేసి పరిస్థితిని మెరుగు పరిచేందుకు అత్యంత తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవచ్చని సీనియర్ నాయకులు భావిస్తున్నారు. పార్టీకి చెందిన కొందరు ఆశించిన స్థాయిలో పని చేయలేదు. ముఖ్యంగా ప్రధాన కార్యదర్శులు తమకు కేటాయించిన రాష్ట్రాల్లో పార్టీని పటిష్టపరచడంలో ఘోరంగా విఫలమయ్యారు. వీరిపై చర్యలు తప్పకపోవచ్చని ఏఐసిసి వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ను విభజించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినా అక్కడ పార్టీకి కేవలం 2 లోక్‌సభ సీట్లు, 20 అసెంబ్లీ సీట్లు మాత్రమే లభించటం కాంగ్రెస్ అధినాయకత్వాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి ఓడిపోయేందుకు అవకాశం ఉందని, అయితే తెలంగాణలో ఈ పరిస్థితి ఎందుకు ఎదురైందని వారు మదనపడుతున్నారు. సీమాంధ్ర ప్రాంతంలో పార్టీని పణంగా పెట్టిమరీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినా అధికారంలోకి రాలేకపోవటం, మెజారిటీ లోక్‌సభ సీట్లు గెలుచుకోలేకపోవటంలో మర్మమేంటని కాంగ్రెస్ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఏఐసిసితో పాటు రాష్ట్రాల పిసిసి కార్యవర్గాలను పునర్‌వ్యవస్థీకరించాలని పలువురు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్‌ను పటిష్టం చేసేందుకు ప్రియాంకా గాంధీని పార్టీలోకి తీసుకురావలసిన అవసరం ఆసన్నమైందని వారు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: