బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరేంద్రమోడీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మోడీ పేరును బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ ప్రతిపాదించగా.. పార్టీ సీనియర్ నేతలు మురళీ మనోహర్ జోషి, వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ బలపర్చారు. ఆ వెంటనే సమావేశం జరుగుతున్న పార్లమెంట్ సెంట్రల్ హాల్లోని బీజేపీ నేతలంతా హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ పార్లమెంటరీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన మోడీ తన వినయ విధేయతలను, సంస్కారాన్ని మరో సారి చాటుకున్నారు. పార్లమెంటరీ నేతగా ఎన్నికైన మోడీని అద్వానీ పుష్పగుచ్చంతో అభినందించారు. వెంటనే అద్వానీకి మోడీ పాదాభివందనం చేసి పెద్దల పట్ల తనకున్న విధేయతను ప్రదర్శించారు. అనంతరం మోడీని అద్వానీ గుండెలకు హత్తుకున్నారు. ఎన్నికల్లో బీజేపీ సాధించిన సంచలన విజయం మోడీకే దక్కుతుందని పార్టీ అగ్రనేత ఎల్ కే అద్వానీ చెప్పారు. మోడీ ప్రభంజనం వల్లే బీజేపీ ఇంతటి విజయాన్ని సొంతం చేసుకోగలిగిందన్నారు. దేశ ఆకాంక్షలను మోడీ నేరవేరుస్తారన్న నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతి వ్యక్తి జీవితంలోనూ కొన్ని చారిత్రాత్మక ఘట్టాలు, పరిణామాలు ఉంటాయని, తన జీవితంలో ఈ రోజు ప్రసంగం కూడా ఆ కోవలోకే చెందుతుందని అద్వానీ చెప్పారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో మోడీ ప్రసంగిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రతి క్షణం, శరీరంలోని ప్రతి కణం దేశం కోసం పరితపిస్తోందని ఆయన అన్నారు. భరతమాతకు సేవ చేసే భాగ్యం ఆ దేవుడు, బీజేపీ ఇచ్చిన వరమని ఆయన చెమ్మగిల్లిన కళ్లతో చెప్పారు. బీజేపీ దయవల్లే భరతమాతకు సేవ చేసే అవకాశం దక్కిందని ఆయన అన్నారు. ప్రజల ఆకాంక్షలు, కలలు నెరవేరుస్తామన్న ఆశలు తమపై పెట్టుకున్నారన్నారు. మార్పు కోసం యావత్ భారతదేశం కదిలిందని మోడీ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: