భారత్‌ నూతన్‌ ప్రధాన మంత్రిగా మే 26వ తేదీన రాష్ట్రపతిభవన్‌ లో నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే! ఇప్పటికే ఆ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లూ శరవేగంగా జరిగిపోతున్నాయి. అలాగే ఈ వేడుకకు దేశవిదేశాల నుండి ప్రముఖులెందరో తరలి వస్తుండడంతో భారతరాజధాని నగరం ఢిల్లీ పూర్తిగా రక్షణకవచంలో, నిఘావ్యవస్థల కనుసన్నల్లో మెలుగుతోంది. మోడీ ప్రమాణ స్వీకారానికి దేశంలోని ప్రముఖులు చాలామందికి మోడీ తరపున, భాజపా తరపున ఆహ్వానం అందినట్టుగా తెలుస్తోంది. వీరిలో ప్రముఖంగా భారతీయ సినిమారంగంలో అగ్రపథాన వెలుగొందుతున్న బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌, దక్షిణాది సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌, గానకోకిల లతామంగేష్కర్‌ ఆహుతుల లిస్టులో ఉన్నారు. రాష్ట్రపతిభవన్‌ లో జరగబోయే ఈ వేడుకకు ఆహ్వానం అందుకున్న 2500 మంది ఆహుతుల జాబితాలో ఈ ముగ్గురినీ కూడా మోడీ ప్రత్యేకంగా కలిపినట్టు భాజపా వర్గాల సమాచారం. లోక్‌ సభ మరియు రాజ్యసభ సభ్యులందరికీ ఈ వేడుకకకు ఆహ్వానం అందుతుంది. వీరందరికీ రాష్ట్రపతిభవన్‌ తరపున ఆహ్వానం పంపిస్తారు. అలాగే భద్రతా కారణాల దృష్ట్యా వీరు సింగిల్‌ గానే రావలసి ఉంటుంది. పూర్వ రాష్ట్రపతులు ప్రతిభాపాటిల్‌, అబ్దుల్‌ కలాంలతో పాటు మాజీప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ఆయన క్యాబినెట్‌ అంత్రులు కొందరు విచ్చేస్తారని తెలుస్తోంది. నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్‌, మోడీ ముగ్గురు సోదరులు కూడా సభకు విచ్చేయవచ్చనేది భాజపా వర్గాల సమాచారం. ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న మోడీ తన తరపున ప్రత్యేకంగా 20మంది గెస్టులను, అలాగే మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్న వారు నలుగురిని వ్యక్తిగతంగా ఆహ్వానించవచ్చనేది రాష్ట్రపతిభవన్‌ వర్గాల సమాచారం. రాష్ట్రపతి తరపున 1250 మంది. భాఝపా తరపున మరో 1250మందిని ఆహ్వానించడానికి అనుమతి ఉంటుంది. ఆహ్వానితుల్లో మిగిలిన వారిని పరిశీలిస్తే ఆర్‌ ఎస్‌ ఎస్‌ నుండి సురేశ్‌ సోనీ, ఎన్డీఏ లోని మిత్రపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులు, గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన కొందరు ప్రముఖ భాజపా నేతలు, మోడీ మరియు భాజపాకు దగ్గరైన మరికొందరు వ్యాపార, సినీరంగ ప్రముఖులు జాబితాలో ఉన్నారు. అలాగే మొట్టమొదటి సారిగా సార్క్‌ దేశాల నేతలకు కూడా ఈ ప్రమాణస్వీకారానికి ఆహ్వానం అందింది. ఇప్పటికే ఏడు దేశాల నుండి ఆహుతులు వస్తున్నట్టు ధృవీకరించగా, పాకిస్థాన్‌ నుండి ఇంకా బదులు రావలసి ఉంది. ఈ కార్యక్రమం మొత్తాన్ని రాష్ట్రపతిభవన్‌ వారు దేశవ్యాప్తంగా ప్రజలు వీక్షించడానికి వీలుగా లైవ్‌ కవరేజ్‌ అందిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: