కేసీఆర్.. చూడ్డానికి బక్కపలుచగా ఉన్నా... ఒక ప్రాంతీయ ఉద్యమాన్ని పద్నాలుగేళ్ల పాటు నడిపి... గమ్యాన్ని ముద్దాడిన నాయకుడు. ఈ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా... చివరకు అసాధ్యమనుకున్నదాన్ని సుసాధ్యం చేసి చూపిన నేత. తెలంగాణ ప్రజల్లోని ప్రత్యేక రాష్ట్ర కాంక్షను గుర్తించి గతంలో ఎందరో నాయకులు ఉద్యమం చేశారు. 1979లో ఇప్పటి కన్నా ఉధృతస్థాయిలో ఉద్యమం నడిచింది. అయినా తెలంగాణ ప్రజల కల సాకారం కాలేదు. దాదాపు 14 ఏళ్ల ఉద్యమంలో ఇక కేసీఆర్ పనైపోయిందని పోయిందని చాలాసార్లు.. చాలా మంది అనుకున్నా.. ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో ఉద్యమాన్ని పార్టీని కాపాడుకుంటూ వచ్చి.. చివరకు తాను కూడా నమ్మలేని రీతిలో ప్రత్యేక రాష్ట్రం సాధించాడు. ఉద్యమాన్ని ఉధృతం చేసే క్రమంలో.. కేసీఆర్ అనుసరించిన వ్యూహంపైన, వాడిన భాషపైన ఎందరికో అభ్యంతరాలు, తీవ్ర విబేధాలు ఉన్నా.. తెలంగాణ విషయంలో ఆయన్ను విస్మరించలేమన్నది మాత్రం అందరూ అంగీకరిచే వాస్తవం. పచ్చగా ఉన్న సమైక్య రాష్ట్రాన్ని తన రాజకీయ స్వార్థంతో.. మాటల మాయాజాలంతో, యాసతో రెచ్చగొట్టి రాష్ట్రాన్ని విడగొట్టారని ఆయన్ను విమర్శించేవారు ఉన్నా... ప్రజల్లోని ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష బలంగా ఉండటం వల్లే.. కేసీఆర్ వ్యూహం ఫలించిందన్నది వాస్తవం. గతం గతః, ఎలాగైతేనేం.. కేసీఆర్ ప్రత్యే రాష్ట్రాన్ని సాధించడంతోపాటు ఆ కొత్త రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా అధికారపగ్గాలు చేపట్టే అవకాశం చేజిక్కించుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ వ్యూహం ఏంటి.. ఆయన ముందున్న సవాళ్లేంటి.. ఈ అంశాలను విశ్లేషిస్తే.. కేసీఆర్ కు ముందున్నది మొసళ్ల పండుగేనని చెప్పక తప్పదు. ఎందుకో ఓసారి చూద్దాం.. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచిందే కొన్ని అంశాల కారణంగా. వాటిలో ప్రధానమైనవి ఉద్యోగాలు, నీళ్లు. ఆంధ్రోళ్లు మన నీళ్లు దోచుకున్నారు.. మన ఉద్యోగాలు దోచుకున్నారు.. అనే మాటలతోనే ఉద్యమం ప్రధానంగా ఎగసింది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు అందులోనూ ముఖ్యంగా యువత ఎన్నో ఆశలతో ఉన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే తమకు ఉద్యోగాలు వచ్చేస్తాయని.. ఉపాధి దొరుకుతుందని భావిస్తున్నారు. ఇక రైతులు తమ పొలాల్లోకి నీళ్లు వచ్చేస్తాయని.. బంజరు భూములు సస్యస్యామలమవుతాయని భావిస్తున్నారు. వీటితో పాటు మొన్నటి ఎన్నికల్లో తెరాస ఎన్నో వాగ్దానాలు చేసింది. బడుగులకు డబల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని.. లక్ష లోపు రైతు రుణాలు మాఫీ చేస్తామని... కేజీ టు పీజీ ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తానని.. ఇంకా చాలా.. వీటన్నింటినీ నెరవేర్చడం మాటలు చెప్పినంత సులభం కాదన్న సంగతి కేసీఆర్ కూ తెలియంది కాదు. ఉద్యమంలో మాటలు ఎక్కువ చేతలు తక్కువ ఉన్నా సరిపోతుంది. కానీ పాలనలో మాటలు తక్కువ చేతలు ఎక్కువ ఉండాలి. కేసీఆర్ కు సొంత రాష్ట్ర్రంలోని నాయకుల కంటే.. పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రితోనే ఎక్కువ సమస్య. ఎందుకంటే.. కొత్తగా ఏర్పడిన రెండు రాష్ట్రాలకు చంద్రబాబు, కేసీఆర్ ఒకేసారి ముఖ్యమంత్రులయ్యారు. వీరి పనితీరును రెండు రాష్ట్రాల ప్రజలు ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటుంటారు. చంద్రబాబు రాజకీయంపై ఎవరికెన్ని అభిప్రాయాలున్నా.. ఆయన ఓ పని రాక్షసుడన్న విషయాన్ని ఆయన విమర్శకులు కూడా ఒప్పుకుంటారు. ప్రత్యేకించి హైదరాబాద్ అభివృద్ది, సాఫ్ట్ వేర్ పరిశ్రమ అభివృద్ధి వంటివి బాబు పనితీరుకు ఉదాహణలన్న సంగతి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రాన్నిప్రగతిపథంలో పరిగెత్తించాలని చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు. అందులోనూ పదేళ్లు అధికారానికి దూరంగా ఉండి.. ముఖ్యమంత్రి కుర్చీ సాధించుకున్న ఆయన... దాన్ని మరో పదేళ్లు కాపాడుకోవాలనే ప్రణాళికతో ఉన్నారు. ఆయనతో పోటీపడటం కేసీఆర్ కు అసాధ్యంకాకపోవచ్చు కానీ.. అంత సులభం మాత్రం కాదు. కేసీఆర్ అంటేనే సీమాంధ్రులకు ముందుగా గుర్తొచ్చేవి.. బాగో, జాగో నినాదాలు, తిట్లు, శాపనార్థాలు. హైదరాబాద్ లోనూ, దాని చుట్టుపక్కల ఉన్న ఎందరో పారిశ్రామిక వేత్తలు ఆంధ్రులేనన్నసంగతి అందిరికీ తెలిసిందే. ఉద్యమం సమయంలో గులాబీ నేతలు ఎన్నోసార్లు వారిని భయపెట్టో బెదిరించో.. చందాల పేరుతోనే వసూళ్లపర్వానికి తెరతీశారన్న సంగతీ బహిరంగ రహస్యమే. ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత కూడా కేసీఆర్ అదే తరహా వైఖరి కొనసాగిస్తే.. వారు కష్టసాధ్యమే అయినా సొంత రాష్ట్ర్రానికి తరలిపోయే ప్రయత్నాలు తప్పక చేస్తారు. అందులోనూ సీమాంధ్రకు ఐదేళ్లు ప్రత్యేక రాష్ట్రహోదా ఉండటం వల్ల వచ్చే రాయితీలు ఒక కారణమైతే.. గులాబీ నేతల వైఖరి కారణంగా ఎన్నాళ్లున్నా.. వెళ్లిపోక తప్పదనే భయం మరో కారణం అయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఎదుర్కొనే సమస్యల్లో ప్రధానమైంది విద్యుత్ సమస్య. అసలే విద్యుత్ లోటు. దీనికి తోడు నీటి కొరత కారణంగా ఇక్కడి వ్యవసాయం ఎక్కువగా విద్యుత్ ఆధారితం. విద్యుత్ తగినంత లేకపోవడం తెలంగాణ అభివృద్ధికి ప్రతిబంధకం కావచ్చు. నిర్మాణంలోని జల ప్రాజెక్టుల పూర్తికి నిధుల సమస్యకు తోడు కొత్త ప్రాజెక్టులు సాధించుకునేందుకు కేంద్రంలో అనుకూలమైన ప్రభుత్వం లేకపోవడం కూడా కేసీఆర్ కు ఒక మైనస్ పాయింటే. ఎన్డీఏలో భాగస్వామి అయిన చంద్రబాబు ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులతో పాటు ఐదేళ్లలో పోలవరం పూర్తిచేయాలని పట్టుదలతో ఉన్నారు. మోడీ అండ చంద్రబాబుకు కలసి వచ్చే అవకాశం ఉంటే.. కేసీఆర్ కు ఆ సానుకూలత, వెసులుబాటు లేవు. రాష్ట్రవిభజన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీ చెప్పుకోదగ్గ సీట్లు గెలుచుకున్న సంగతి మర్చిపోకూడదు. కేసీఆర్ తప్పుటడుగులు వేసి.. అసమర్థ పాలనతో విసిగిస్తే ఐదేళ్ల తర్వాత జనం టీడీపీ వైపు మొగ్గినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత గులాబీ బాస్ దే. సినిమాల్లో ప్రతినాయకుడు ఎంత బలంగా ఉంటే హీరో అంతగా ఎలివేట్ అవుతాడు. రాజకీయాల్లోనూ అంతే. ప్రతిపక్షం ఎంత బలంగా ఉంటే.. పోటీ అంత రసవత్తరంగా ఉంటుంది. చంద్రబాబు అధికారంలోకి రాగలిగినా.. జగన్ ను తక్కువ అంచనా వేసే సాహసం ఆయన ఎంత మాత్రం చేయడు. బలమైన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్ కూడా.. చంద్రబాబు పాలనలోని మైనస్ లను అందిపుచ్చుకునేందుకు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఈ పోటీ కారణంగా అంతిమంగా లాభపడేది సీమాంధ్ర ప్రజలేనని చెప్పొచ్చు. తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు. కేసీఆర్ కు సమఉజ్జీగా కాదు కదా.. కనీసం పోటీ ఇచ్చే స్థాయి నాయకులు ఏ పార్టీలోనూ లేరు. స్టార్ హీరో సినిమాపై అంచనాలు విపరీతంగా ఉంటే.. సినిమా ఒక మాదిరిగా ఉన్నా కూడా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. అలాగే తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలతో ఉన్నఈ సమయంలో కేసీఆర్ చెమటోడిస్తే తప్ప వారిని సంతృప్తి పరచడం అసాధ్యం. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. అవకాశం వస్తే గానీ ఏ వ్యక్తిలోని సమర్థత అయినా బయటకు రాదు. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలన తర్వాత.. ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే ముఖ్యమంత్రి అనే స్థాయిలో మీడియాలో ప్రాచుర్యం లభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. చంద్రబాబు స్థాయిలో వైఎస్ ఫలితాలు సాధిస్తాడని ఎవరూ ఊహించలేదు. కాంగ్రెస్ లోని అంతర్గత కుమ్ములాటలతో ఐదేళ్లు బండి నడపడమే కష్టం అనుకున్న వాళ్లూ ఉన్నారు. అవినీతి బాగోతాలు, నీకది-నాకిది తరహా ఉదంతాల సంగతి పక్కకు పెడితే వైఎస్ పాలనలో సామాన్యులు, గ్రామీణులు, విద్యార్థులు లబ్ది పొందారు. వైఎస్ పై కొండంత అభిమానం పెంచుకున్నారు. అదే ఇప్పటికీ ఆయన మరణం తర్వాత కూడా జగన్ కు శ్రీరామరక్ష అవుతోంది. కేసీఆర్ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే.. వైఎస్ తరహాలోనే వెనుకబడిన తెలంగాణ ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయే అవకాశమూ ఉంది. మరి దాన్ని కేసీఆర్ ఎంతవరకూ సద్వినియోగం చేసుకుంటారనేది ఆయన అనుసరించే వ్యూహాలపై, పాలనపై ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా కేసీఆర్ ముందుంది మాత్రం పూలబాట కాదు. దారిలో ముళ్లను ఒడుపుగా దాటుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపి మరిన్ని పేరు ప్రతిష్టలు పొందుతారా.. రాష్ట్రవిభజన తర్వాత కూడా తీరు మార్చుకోకుండా వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుని.. ప్రత్యేక రాష్ట్రసాధనతో తెచ్చుకున్న ప్రతిష్టను కూడా మసకబార్చుకుంటారా.. అన్నది కాలం చెప్పాల్సిన సమాధానం.

మరింత సమాచారం తెలుసుకోండి: