పదేళ్ల యూపీఏ పాలన చూశాక.. జనం మార్పు కోరుకున్నారు. లెక్కకు మిక్కిలిగా జరిగిన అవినీతి బాగోతాలపై కోపోద్రిక్తులయ్యారు. ఘటన ఏదైనా... సోనియా చిలుకపలుకులే వల్లె వేసే రోబో ప్రధానిని గద్దె దించాలనుకున్నారు. ఉందంటే ఉందనే తరహాలో సాగిన ప్రభుత్వాన్ని మార్చి.. ఉత్తేజభరితమైన, ధైర్యసాహసాలతో కూడిన నిర్ణయాత్మక శక్తికి పీఠం కట్టబెట్టాలనుకున్నారు. నరేంద్ర దామోదర్ దాస్ మోడీ రూపంలో అద్భుతమైన ప్రత్యామ్నాయం వారికి కనిపించింది. అంతే. ఓట్ల వరద పారించారు. మూడు పదుల సంకీర్ణాల శకానికి ముగింపు పలికారు. కొన్ని రాష్ట్రాలు మినహా.. ఆసేతు హిమాచలం నరేంద్రుని నాయకత్వాన్ని స్వాగతించింది. మరి నూటపాతిక కోట్ల జనం మోడీపై పెట్టుకున్న ఆశలేంటి..? మోడీ నుంచి సామాన్యుడి నుంచి మేథావుల వరకూ ఏం ఆశిస్తున్నారు..? అలాగే.. మోడీ ప్రధాని అయ్యాడన్న వార్తని ఏమాత్రం జీర్ణించుకోలేని భారతీయులూ ఉన్నారు.. ఎందుకు..? వారికున్న భయాలేంటి..? ఓసారి చూద్దాం.. మోడీ అంటే అభివృద్ధి సాధకుడు.. గుజరాత్ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపి చూపాడు.. వరుసగా నాలుగుసార్లు గుజరాత్ పీఠాన్ని అధిరోహించాడు. ఓ విజన్ తో ముందుకు దూసుకుపోయే నేత. పారిశ్రామిక వేత్తలను ఆకర్షించడంలో దిట్ట. మంచి వ్యూహకర్త.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సుగుణాలు మోడీ గురించి ప్రచారంలో ఉన్నాయి. అయితే మోడీ పేరు చెప్పగానే వీటి కంటే.. ముందుగా గుర్తొచ్చేది 2002 గుజరాత్ మారణహోమం. గోద్రా అనంతర అల్లర్ల నాటి భయోత్పాతాన్ని పుష్కరకాలం దాటినా దేశం ఇంకా మర్చిపోలేదు. అమెరికా వంటి దేశాలు నిన్న మొన్నటి దాకా ఆ మచ్చ కారణంగానే వీసా ఇచ్చేందుకు తటపటాయించాయి. శతాబ్దాల తరబడి.. మతసామరస్యంతో జీవిస్తున్న గొప్ప దేశం మనది.. మైనారిటీలు కూడా స్వేచ్ఛగా.. తమ భక్తి విశ్వాసాలకనుగుణంగా జీవించే లౌకిక దేశం మనది. ఆనాడు రాజుల కాలంలోనూ.. ఆ తర్వాత ప్రజాస్వామ్యయుగంలోనూ లౌకికత్వానికి పాలకులు ఇచ్చిన ప్రాధాన్యం అంతా ఇంతా కాదు.. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది..? 2002 నాటి గుజరాత్ అల్లర్లు దేశవ్యాప్తమవుతాయన్నఆందోళన మైనారిటీల్లో గూడుకట్టుకుని ఉంది. దాదాపు 2000 మందిని ఊచకోత కోశారని భావించే ఆ మారణకాండ పునరావృతం కావచ్చనే భయం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేయకపోయినా.. అవినీతిమయమైనా.. లౌకికత్వం విషయంలో దాన్ని తప్పుబట్టలేం. అభివృద్ధిని కేవలం జీడీపీల్లోనే కొలవలేం. మానవాభివృద్ధి సూచికల్లోనూ ఆ మేరకు ప్రగతి కనిపించాలి. కాంగ్రెస్ అభివృద్ధి చేయకపోయినా అరాచకం చేయలేదు. గొప్పగా పాలించకపోయినా.. మతఘర్షణలకు తావివ్వలేదు. అలాంటి భరోసాను మోడీ సర్కారు నుంచి మైనారిటీలు ఆశించలేకపోతున్నారు. పేరుకు మోడీ పాలనగా కనిపిస్తున్నా... మన్మోహస్ సింగును సోనియా ఆడించినట్టు.. మోడీని ఆర్ఎస్ఎస్ ఆడిస్తుందన్న సంగతి తెలిసిందే.. దశాబ్దాల తరబడి.. ఇలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్న హిందుత్వ శక్తులు ఇప్పుడు జూలు విదులుస్తాయా.. అధికారం కాషాయ దళాలకు దఖలుపడుతుందా..? ఇవీ ప్రధానంగా మైనారిటీల్లో ఉన్న భయాలు.. ఆందోళనలు.. మైనారిటీల భయాలకు అర్థం ఉన్నా.. వారికి ఊరటనిచ్చే కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. వారు మరీ అంతగా భయపడనక్కర్లేదేమో. ఎందుకంటే.. మోడీ హయాంలో గుజరాత్ అల్లర్లు 2002లో జరిగినా.. ఆ తర్వాత ఆ రాష్ట్రంలో అలాంటి ఘటనలు పునరావృతం కాలేదు. గుజరాత్ అల్లర్లను ఓ అరుదైన ఘటనగానే చూడాలని.. అది మోడీ నైజంలో భాగంకాదనీ ఆశించొచ్చు.. గుజరాత్ మైనారిటీలు 2002 తర్వాత ఏళ్ల తరబడి బీజేపీకి దూరమైనా.. మూడు నాలుగేళ్లుగా వారు కూడా మోడీ పాలనపై సంతృప్తిగానే ఉన్నారని ఆ పార్టీ వర్గాలు చెప్పుకుంటాయి. ఇటీవలి కాలంలో గుజరాత్ ఓటరు.. ఇస్తున్న తీర్పు కూడా బీజేపీకి ఏకపక్షంగా ఉండటాన్ని వారు గుర్తు చేస్తున్నారు. మంచిదే.. మత సామరస్యం గొప్పగా వెల్లివిరియనవసరం లేదు. దానికి విఘాతం కల్గించకుండా పాలన సాగిస్తే చాలు.. మోడీ నుంచి మైనారిటీలు, శాంతికాముకులు కోరుకునేది ఇదే. భారతదేశం హిందువులు మెజారిటీలుగా ఉన్న దేశం. అయినా రాజ్యాంగ నిర్మాతల దార్శనికత కారణంగా లౌకిక రాజ్యంగా పరిఢవిల్లుతోంది. అన్నివర్గాలకూ సమాన అవకాశాలు కల్పిస్తోంది. హిందువులదే పైచేయి కావాలి.. సనాతన హిందూ సాంప్రదాయాలు కొనసాగాలన్న భావజాలం ఉన్న హిందూ సంస్థలు.. మోడీ అధికారపీఠం అధిరోహించగానే రెచ్చిపోతాయా అన్న భయాలున్నాయి. ఒడిశా గ్రాహం స్టెయిన్స్ దహనం వంటి దారుణాలు పునరావృతమవుతాయా..? మోడీ సుపరిపాలన సాగించాలని భావించినా.. దేశవ్యాప్తంగా వేళ్లూనుకుని ఉన్న ఈ కాషాయదళాలు.. ఇక మాదే అధికారం అని విచ్చలవిడిగా రెచ్చిపోతాయా..? అన్న భయాలు లేకపోలేదు. ఎన్నికల ప్రచారంలోనే బీజేపీ సీనియర్ మోడీని వ్యతిరేకించే వారి చోటు పాకిస్తాన్ మాత్రమేనంటూ రంకెలు వేసిన సంగతిని వారు మరచిపోలేరు. ఎన్నికలకు ముందే అలాంటి పరిస్థితి ఉంటే.. ఇప్పుడు ఇంకెలా ఉంటుందోనన్న వారి ఆందోళనకు అర్థం ఉంది. బీజేపీ తమ మేనిఫెస్టోలోనే రామ మందిర నిర్మాణం చేస్తామని ప్రకటించింది. ఇప్పుడా తేనెతుట్టెను కదపడం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనన్న భయాలూ ఉన్నాయి. ప్రధానిగా మోడీ ప్రమాణం చేసిన మరుక్షణమే.. పీఎంఓ వెబ్ సైట్లో మోడీ ప్రకటన కనిపించింది. అందులో మోడీ నేపథ్యం గురించి క్లుప్తంగా వివరిస్తూ.. దేశభక్తి మూర్తీభవించిన సంస్థలతో కలసి పనిచేశారాయన.. అని పరోక్షంగా ఆర్ ఎస్ ఎస్ గురించి పేర్కొనడం దేనికి సంకేతం..? ఆలోచించాల్సిందే.. మోడీ పాలనపై మరో భయం.. కార్పొరేట్ శక్తులు రెచ్చిపోతాయనేది. మోడీ అదాని, అంబానీలకే తొలి ప్రాధాన్యమిస్తారని.. వారి సమస్యల తర్వాతే ప్రజాసమస్యలు పట్టించుకుంటారన్న అపవాదు ఉంది. అతి తక్కువ కాలంలో మోడీ దేశవ్యాప్తంగా సాగించిన ఎన్నికల ప్రచారం వెనుక, హంగూ ఆర్భాటాలకు తోడు విపరీతమైన ఖర్చుతో కూడిన త్రీడీ ప్రచారం, పత్రికలు, చానళ్లు, హోర్డింగులు, సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలోనూ విచ్చలవిడిగా సాగించిన ప్రచారం ఖర్చు కార్పొరేట్ శక్తులే భరించాయని చాలామంది భావిస్తారు. గుజరాత్ లోని ప్రభుత్వ భూములను అతి తక్కువ ధరలకే కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టారని.. ఆరోపణలున్నాయి. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత భారతీయ ఓటరు ఏకపక్షంగా కమలదళానికి అధికారం కట్టబెట్టాడు. గతంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చినా.. మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వం నడుస్తున్నందు వల్ల తన విశ్వరూపం చూపే అవకాశం కమలదళానికి రాలేదు. రామమందిరం సహా అనేక అంశాలను పక్కకుపెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు పరిస్థితి వేరు. మిత్రపక్షాలను పరిగణలోకి తీసుకోకుండానే బీజేపీకి సాధారణ మెజారిటీ ఉంది. ప్రతిపక్షం చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే సంఖ్యకు దిగజారి బలహీనమైపోయింది. ఈ నేపథ్యంలో మోడీ పాలన నియంతృత్వానికి దారి తీస్తుందా అన్న భయాలూ లేకపోలేదు. సహజంగానే మోడీ రాజకీయాల్లో దూకుడు ప్రదర్శిస్తారు. గుజరాత్ శాసనసభలో అడుగుపెట్టకుండానే నేరుగా ముఖ్యమంత్రిగా నియమితులైన ఆయన.. ఆ తర్వాత పార్టీలో తనకు ప్రత్యామ్నాయం లేకుండా చేసుకోగలిగారు. అదే సీన్ పార్లమెంటు విషయంలోనూ రిపీటైంది. తొలిసారి పార్లమెంటులో ప్రధాని హోదాలోనే అడుగుపెడుతున్నారు. అద్వానీ శతవిధాలా అడ్డుపడేందుకు ప్రయత్నించినా... బీజేపీ ప్రధాని అభ్యర్థిగా తనను పేరును ప్రకటింపజేసుకోవడంలో చాణక్యనీతి ప్రదర్శించారు. పార్టీలో తనకు పోటీ లేకుండా చేసుకోవడంలోనూ.. అంతా తన పేరే జపించేలా చక్రం తిప్పారు. ఒకప్పుడు ఇండియా అంటే ఇందిర.. ఇందిర అంటే ఇండియా అన్నంతగా సాగిన ఇందిరమ్మ పాలన.. ఇప్పుడు మోడీ విషయంలోనూ రిపీటయ్యేలా ఉంది. మోడీ అంటే బీజేపీ.. బీజేపీ అంటే మోడీ.. అన్నట్టుగా భజనతంత్రం సాగుతోంది. దీనికితోడు సంపూర్ణ మెజారిటీ.. ఈ పరిణామాలన్నీ ఎక్కడ నియంతృత్వానికి దారి తీస్తాయోనన్న అనుమానాలున్నాయి.. అయితే ఎంతసేపూ మోడీలోని నెగిటివ్ కోణాలనే చూసి భయపడనక్కర్లేదు. సోనియా, మన్మోహన్ల పదేళ్ల అసమర్థ పాలన తర్వాత.. దేశాన్ని ఏకం చేయగలిగిన.. పరుగెత్తించగలిగిన నేత నరేంద్ర మోడీ రూపంలో దేశానికి లభించాడు. ఒకనాడు పార్లమెంటులో కేవలం 2 స్థానాలున్న పార్టీని ఒంటిచేత్తో అధికారపీఠంపై కూర్చొబెట్టగలిగాడు.. ఒక్కడు.. ఒకే ఒక్కడు.. సుడిగాలిగా.. ప్రభంజనమై విజృంభించాడు.. మోడీకి అధికారం దఖలుపడటం ఖాయమన్న సంకేతాలు కనిపించగానే.. అప్పటిదాకా పడుతూ లేస్తూ ఉన్న స్టాక్ మార్కెట్ పరుగులు తీయడం మొదలుపెట్టింది. కొనుగోలుదారుల చిన్నచూపుకు గురైన ప్రభుత్వ కంపెనీల షేర్లు.. లేడిపరుగందుకున్నాయి. ఇదీ మోడీ పట్ల మార్కెట్ కు ఉన్న విశ్వాసం.. ఒక స్థిరమైన, సమర్థమైన పాలన అందుతుందన్న భరోసా మోడీ రూపంలో లభించింది. వాస్తవానికి భారత ప్రభుత్వ యంత్రాంగం.. పీఎంగా ఎవరున్నా.. సీఎంగా ఎవరున్నా.. తనదారిలో తాను సాగిపోతూనే ఉంటుంది. ఓ ఏడాది పాటు ప్రధానిగా ఎవరూ లేకున్నా.. జరగాల్సిన పనులు జరిగిపోతాయి. కాకపోతే వ్యవస్థలను సమర్థంగా నడిపించే నేత చేతిలో పగ్గాలుంటే ప్రగతిరథం పరుగులు పెడుతుంది. లేకుండా నత్తతో పోటీపడుతూ అడుగులు వేస్తుంది. మోడీ భారతీయ సంప్రదాయాలను, మూలాలను ఎంతగా గౌరవిస్తారో.. సాంకేతికతనూ అంతగానే అందిపుచ్చుకుంటారు. ప్రపంచంలో ప్రస్తుతం ఏదేశానికీ లేని గొప్ప అవకాశం మానవ వనరుల రూపంలో ఉంది. కోట్ల సంఖ్యలో ఉన్న నవ యువకులను సరిగ్గా దిశానిర్థేశం చేసి.. వారికి అవకాశాలు చేతికందిస్తే అద్భుతాలనే చేసి చూపుతారు.. ఆ అవకాశం మోడీ కల్పిస్తారన్న నమ్మకం అందరిలోనూ కలుగుతోంది. అందులోనూ ఆయన ఒంటరి. కుటుంబ పాలన, బంధుప్రీతి, ఆశ్రితపక్షపాతం వంటి దుర్లక్షణాలు ఎంతమాత్రం ఉండే అవకాశం లేని పెళ్లైన బ్రహ్మచారి. పని రాక్షసుడు. 60నెలలు తనకు అవకాశం ఇస్తే... 60 ఏళ్లలో జరగని అభివృద్ధి చేసి మంచి సేవకుడిగా నిరూపించుకుంటానన్న మోడీ మాటలను భారతదేశం ఆలకించింది. విశ్వసించింది. పట్టంగట్టింది. అశేష భారతావని ఆయన చూపిన నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకుంటే.. మరో ఐదేళ్లే కాదు.. వచ్చే పదేళ్లూ ఆయన పాలనకు అడ్డుండదు.. ఆయన తన గుజరాత్ నమూనాను సమర్థంగా అమలుచేయగలిగితే.. అంతర్జాతీయ యవనికపై భారత్ సగర్వంగా నిలబడుతుంది. అమెరికా, చైనాల సరసన.. సమున్నతంగా నిలబడుతుంది. అలా జరగాలనే ఆశిద్ధాం.. పుణ్యభూమి నాదేశం "నమో" నమామి.

మరింత సమాచారం తెలుసుకోండి: