టైటిల్ చూసి కంగారు పడకండి.. ఆ లడ్డూబాబు మన లడ్డూబాబు కాదు.. ప్రపంచ లడ్డూ బాబు.. ప్రపంచం మొత్తంలోనే అత్యధిక బరువున్న లడ్డూబాబు కన్నుమూశాడు. ఇంతకీ ఆయన బరువెంతో తెలుసా... అక్షరాలా 560 కేజీలు.. అతని పేరు మాన్యుయేల్ యురిబ్. దేశం - మెక్సికో. 48 ఏళ్ల యురిబ్ గుండెపోటుతో మరణించాడు. 560 కేజీల భారీ కాయానికి అతని చిన్ని గుండె రక్తం సరఫరా చేయలేక ఒత్తిడి గురైంది. కొన్నాళ్లుగా యురిబ్ మంచానికే పరిమితమైపోయాడు. అంత భారీ శరీరంతో కనీసం నడవడం కూడా చేతనయ్యేది కాదట. గుండెపోటు రాగానే అతన్ని క్రేన్ ద్వారా ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. 2006లో ప్రపంచంలోనే అత్యధిక బరువున్న వ్యక్తిగా గిన్నిస్ రికార్డులకెక్కాడు యురిబ్. ఇప్పటివరకూ ఆ రికార్డు ఎవరూ అధిగమించలేదట. తన ఆరోగ్య సమస్యతోనే యురిబ్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఆకర్షించాడు అనడం కంటే.. తన గోడు వెళ్లబోసుకున్నాడనడం సముచితంగా ఉంటుంది. ఎనిమిదేళ్ల కిందట తన సమస్యను టీవీల ద్వారా ప్రజలకు వివరించి సహాయం కోరాడు. అలా మీడియా దృష్టిలో పడ్డాడు. సహృదయుల విరాళాలు.. వైద్యుల సహకారంతో ఊబకాయం తగ్గించుకునే పనిలో పడ్డాడు. 560 కేజీల నుంచి 381 కేజీలకు తగ్గాడు కూడా. ఇక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుందని ఆశించేలోపే.. అంత ఒత్తిడి అతని గుండె తట్టుకోలేకపోయింది. యురిబ్ కు భార్య, ఓ కొడుకు ఉన్నారు. ఊబకాయం సమస్య మొదలైన తొలినాళ్లలోనే.. తనను పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోయేసరికి.. ఆయన మరో లడ్డూ భామనే పెళ్లాడాడు. వారికో బాబు పుట్టాడు. యురిబ్ లావు అంతకంతకూ పెరిగిపోయేసరిక భార్య, కొడుకు దూరమయ్యారు. ఊబకాయం ఇప్పుడు ప్రపంచం ముందున్న మరో పెద్ద సమస్య. శారీరక శ్రమ పెద్దగా లేకపోవడం, వ్యాయమం చేయకపోవడం, జంక్ ఫుండ్, హై కెలోరీ ఫుడ్ లాగించడం, ఆరోగ్య స్పృహలేకపోవడం.. ఈ కారణాలతో ఊబకాయ బాధితులు పెరిగిపోతున్నారు. 24 గంటలున్న రోజులో మన ఆరోగ్యం గురించి ఓ అరగంటైనా కేటాయించకపోతే.. ముందు ముందు ఇబ్బంది పడేది మనమే.. కాదంటారా..

మరింత సమాచారం తెలుసుకోండి: