అధికారం కోల్పోయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఇనప్పెట్లె తాళాలను దక్కించుకొన్నాడు టి.సుబ్బరామిరెడ్డి. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కోశాధికారిగా ఆయన నియమితం అయ్యాడు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరిగిన ఎన్నికల్లో సుబ్బరామిరెడ్డి కోశాధికారిగా ఎన్నికయ్యాడని ఆ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. సుబ్బరామిరెడ్డి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడి హోదాలో ఉన్నాడు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయని ఆయనకు ఇంకా దాదాపు ఐదేళ్ల పదవీకాలం ఉంది. ఈ నేపథ్యంలో సుబ్బరామిరెడ్డి ట్రెజరర్ గా కూడా ఎన్నిక కావడం విశేషం. ఇది వరకూ కూడా సుబ్బరామిరెడ్డి ఈ బాధ్యతల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ గా బాధ్యతలు నిర్వహించాడు. కాంగ్రెస్ పార్టీ నేతల్లోని ప్రముఖ కాంట్రాక్టర్ గా, వ్యాపారవేత్తగా సుబ్బరామిరెడ్డికి పేరుంది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ ఖజానా బాధ్యతలను కూడా సొంతం చేసుకొంటూ వస్తున్నాడు. తన ప్రత్యేకతను నిరూపించుకొంటున్నాడు. రాష్ట్రానికే చెందిన మరో ఇద్దరు ఎంపీలకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక కమిటీలో చోటు దక్కింది. రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్ , జేడీ శీలంలు కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక కమిటీలో స్థానం దక్కించుకొన్నారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సభ్యుల్లో కూడా ఏపీ, తెలంగాణ వాళ్ల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో వీరికి ఈ సభ్యత్వాలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: