ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు చాలవన్నట్టు.. మళ్లీ కొత్త వివాదం మొదలైంది. వాస్తవానికి ఇది కొత్తదేంకాదు. తెలంగాణ ఏర్పాటుతోనే మొదటగా ఉహించిన వివాదాల్లో నీళ్లకు సంబందించినదే. నీళ్ల పంపకాలపై రెండు రాష్ట్రాల మధ్య గొడవలు తప్పవని అందరూ ఊహించిందే వాస్తవంలోకి నిజమవుతోంది. తాజాగా.. గోదావరిపై తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులపై ఆంధ్రా కేంద్రానికి ఫిర్యాదు చేసింది. కేంద్ర జలసంఘం అనుమతి పొందని గోదావరి ప్రాజెక్టులన్నీ అపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు విజ్ఞప్తి చేస్తూ కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ తన లేఖలో తెలంగాణలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను ప్రస్తావించింది. ప్రాణహిత - చేవెళ్ల , కంతనపల్లి, రాజీవ్ సాగర్ , దుమ్ముగూడెం, ఇందిరాసాగర్, రుద్రమకోట ఎత్తిపోతలు , ఎల్లంపల్లి, కాళేశ్వరం , కొమరంభీం ప్రాజెక్టులకు కేంద్ర జలసంఘం నుంచి అనుమతి లభించలేదన్న సంగతిని గుర్తు చేసింది. వాస్తవానికి ఇవన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గోదావరి నదిపై చేపట్టిన ప్రాజెక్టులే. నీటి లభ్యతను సమగ్రంగా వివరించలేకపోవడం సహా ఇతర కారణాల వల్ల వీటికి కేంద్రజలసంఘం అనుమతులు ఇంకా రాలేదు. కేసీఆర్ సర్కారు జలరంగంపై ప్రధానంగా దృష్టిసారించనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏపీ తన జాగ్రత్త తాను తీసుకుంటోంది. అందులో భాగంగానే ఈ ఫిర్యాదు లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టం మేరకు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు ఏర్పడ్డాయి. వీటితో పాటు రెండు నదీ యాజమాన్యాలకు అపెక్స్ కౌన్సిల్ లు ఉన్నాయి. కేంద్ర జలవనరుల శాఖా మంత్రి ఛైర్మన్ గా ఉండే ఈ కౌన్సిల్ లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలు కొత్త ప్రాజెక్టులు చేపట్టాలంటే కౌన్సిల్ అంగీకారం తప్పని సరి. గోదావరిపై కేంద్ర జలసంఘం అనుమతి పొందని ప్రాజెక్టులన్నీ తాజాగా అపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందాల్సి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ కేంద్రం, నదీయాజమాన్య బోర్డులకు లేఖ రాసింది. గోదావరి అవార్డు పరివాహకప్రాంతంలోని రాష్ట్ట్రాలకు మొత్తంగా నీటిని కేటాయించారు తప్ప ప్రాజెక్టుల వారిగా కేటాయింపులు చేయలేదని తెలిపింది. తెలంగాణలో నీటి వినియోగంలో ఎలాంటి మార్పులు జరిగినా... ఆ ప్రభావం దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ లోని ప్రాజెక్టులపై నేరుగా ఉంటుందని పేర్కొంది. మరి ఈ వివాదంపై కేంద్రం, తెలంగాణ ఎలా స్పందిస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: