బెల్లం చుట్లూ ఈగలు ముసరటాన్ని పోల్చాల్సి వస్తే మన రాజకీయ నేతలే దీనికి పర్ ఫెక్ట్ ఎగ్జాంపుల్. టీడీపీ అధికారంలోకి రావడంతో.. ఆ పార్టీని చుట్టుముట్టే నేతలనే ఈగలూ ఎక్కవయిపోయాయని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. టీడీపీలోకి అలా వలసవస్తున్న వారు ఏం మాయ చేస్తున్నారో తెలీదు కానీ.. చంద్రబాబు మాత్రం వారి మాటలకు మైమరచిపోతున్నారు. అడిగిందే తడవుగా వారికి అధికారాలూ.. పదవులూ కట్టబెట్టేస్తున్నారు. మరి పార్టీ ఆవిర్భావం నుంచి ఒకే విధమైన కమిట్ మెంట్ తో పనిచేస్తున్న తమను బాబు ఎందుకు పట్టించుకోవడం లేదో తమ్ముళ్ళకు బొత్తిగా అర్థం కావడం లేదు. అయితే పార్టీ శ్రేణుల గోడును ఏమాత్రం పట్టించుకోని బాబు మాత్రం.. నారాయణ, కేశవ అంటూ వారి సేవలో తరిస్తున్నారు. చిత్రమేమిటో కాని తెలుగుదేశం పార్టీ పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్న కాలంలో ఏనాడూ ఆ పార్టీని కాని, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కాని తలచుకోని కొందరు టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నామస్మరణ చేస్తున్నారు. మొన్నటికి మొన్న నారాయణ విద్యాసంస్థల అధిపతి పి. నారాయణ తెలుగుదేశం తీర్థం పుచ్చుకుని ఏకంగా అమాత్య పదవిని కూడా చేపట్టి ప్రస్తుతం రాజధాని ఎంపిక కమిటీకి సారథ్యం కూడా వహిస్తుండగా తాజాగా మరో ప్రముఖ విద్యాసంస్థల చైర్మన్ కూడా టిడిపి పట్ల ఆకర్షితులయ్యారు. కేశవరెడ్డి విద్యాసంస్థల చైర్మన్ కేశవరెడ్డి తాజాగా టిడిపి నాయకులను సైతం విస్మయపరుస్తూ సైకిల్ ఎక్కుతున్నట్లు ప్రకటించారు. అయితే కేశవరెడ్డి వచ్చే ఉపఎన్నికల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తారా లేక పార్టీలో చేరినందుకు ‘ప్రయోజనం’ పొందుతారా అన్నది ఇంకా తేలనప్పటికీ ఎన్నికల అనంతరం ఆయన పార్టీలో చేరడమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే, చంద్రబాబు నాయకత్వ లక్షణాల పట్ల విశ్వాసం ఉన్నందున కేశవరెడ్డి టిడిపిలో చేరారంటూ ఆ పార్టీ వర్గాలు వాదిస్తుండగా కొందరు మాత్రం అదంతా ఫార్సంటూ కొట్టిపారేస్తున్నారు. మరి..అసలు రహస్యమేమిటనేది.. నారాయణకే సారీ.. ఆ శ్రీమన్నారాయణుడికే తెలియాలి. అయితే.. విద్యాసంస్థల అధిపతులకు టీడీపీలో ఉన్నత స్థానాలు లభిస్తుండడంతో.. రానున్న రోజుల్లో ఎంతమంది విద్యాసంస్థల అధిపతులు సైకిల్ సవారీకి సై అంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: