లోక్ సభ ఎన్నికల మెజారిటీల విషయంలో మరో కొత్త రికార్డు నమోదైంది. నరేంద్రమోడీ మొన్నటి ఎన్నికల్లో వడోదరలో సాధించిన 5 లక్షల 70వేల భారీ రికార్డును తొలిసారి పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేసిన ఓ అమ్మాయి అవలీలగా దాటేసింది. మోడీని దాటేయడమే కాదు.. ఇప్పటివరకూ అత్యధిక మెజారిటీగా సీపీఎంకు చెందిన అనిల్ బసు (5,92,500 ఓట్లు ) పేరుతో ఉన్న అత్యధిక మెజారిటీ రికార్డును కూడా తిరగరాసింది. మహారాష్ట్రలోని బీడ్ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన ప్రీతమ్ ఏకంగా దాదాపు 7లక్షల మెజారిటీ సాధించడం విశేషం. మొత్తం ఆమెకు తొమ్మిదిన్నర లక్షల ఓట్లు పోలయ్యాయి. మరి ఈ రేంజ్ లో ఓట్లు పడ్డాయంటే ఆమె బ్యాక్ గ్రౌండ్ కూడా ఘనంగానే ఉండాలి కదా.. అవును మరి ఆమె గత జూన్ నెలలో రోడ్డుప్రమాదంలో మరణించిన కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే కుమార్తె. ఆయన మరణంతోనే ఈ ఉపఎన్నిక జరిగింది. సానుభూతి పవనాలకు తోడు మోడీ మానియా కూడా తోడవడంతో ప్రీతమ్ హవాకు అడ్డూఅదుపూలేకుండా పోయింది. ముండేపై ఉన్న గౌరవంతో శివసేన, ఎన్సీపీ ప్రీతమ్ పై అభ్యర్థులను పోటీకి నిలపలేదు. ద్విముఖ పోరు కావడంతో ప్రీతమ్ భారీ మెజారిటీ సాధించారు. ఆమెపై కాంగ్రెస్ పోటీకి నిలిపిన అభ్యర్థి అశోక్ పాటిల్ కు కేవలం రెండున్నర లక్షల ఓట్లు మాత్రమే లభించాయి. ప్రధాని మోడీ కూడా మరాఠా గడ్డపై తన ప్రచారం ఇక్కడి నుంచి ప్రారంభించడం విశేషం. ఇక గతంలో చెప్పుకోదగిన లోక్ సభ ఎన్నికల మెజారిటీల విషయానికి వస్తే.. 5లక్షల మెజారిటీ దాటిన వారిలో మన తెలుగు నేతలు ఇద్దరున్నారు.. పీవీ నర్సింహారావు 5లక్షల 80వేలు సాధించగా.. వై.ఎస్ జగన్ 5 లక్షల 21వేలు సాధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: