బస్సు అంటే చాలు ప్రతి పౌరునికి ముందుగా గుర్తుకొచ్చేది రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. అంటే ఎపిఎస్ఆర్టీసీనే. అది ఎర్రబస్సా లేక పచ్చబస్సా లేదా ఆధునిక హంగులతో ఉన్న బస్సా అనేది కాదు. ఆర్టీ బస్సు అంటే చాలు సరసమైన ఛార్జీలతో సురక్షితమైన ప్రయాణం అనేదాంట్లో ఎలాంటి సందేహం లేదు. కోట్ల మంది సామాన్యులకు అనేక మంది సంపన్నులకు కూడా ఆర్టీసీ అంటే ప్రత్యేక విశ్వాసం.. అభిమానం.. గర్వకారణం కూడా. అన్నింటికి అతీతంగా అన్ని వర్గాల ప్రజల రవాణా అవసరాలను తీరుస్తూ సామాజిక సేవకు పూర్తిగా అంకితమై దేశంలోనే ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నది మన ఆర్టీసీ. కానీ ప్రైవేటీకరణ, గ్లోబలైజేషన్ ఊబిలో చిక్కుకుంటున్న ప్రభుత్వాల కన్ను అప్పుడప్పుడు ఆర్టీసీపై కూడ పడుతుంది. ఇప్పటికే వేల సంఖ్యలో ప్రైవేట్ బస్సుల అక్రమ రవాణాను ప్రోత్సహిస్తూ ఆర్టీసీని నిర్వీర్యం చేయటానికి గతకొంతకాలంగా అధికారంలోకి ఎవరు వచ్చిన అవకాశం దొరికినప్పుడల్లా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఆర్టీసీ బస్సులతో ప్రజలుకున్న బంధాన్ని గమనించి సంస్థ ప్రైవేటీకరణకు పాలకులు ముందడుగు వేయలేకపోతున్నరనేది వాస్తవం. దేశ విదేశాలలో స్థిరపడిన తెలుగువాళ్లు తమ స్వస్థలానికి వచ్చినప్పుడల్లా ఒక్కసారి ఆర్టీసీ బస్సులు తిరగాలని కోరుకునే వారు లేకపోలేదు. ఇలా ఆర్టీసీ బస్సులో తిరగటం అంటే వారి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోవటమే. తెలుగు ప్రజల జీవితాలతో అంతగా ఇమిడిపోయింది మన ఆర్టీసీ బస్సు. ఎప్పుడో నిజాం నవాబు కాలంలో హైదరాబాద్ స్టేట్ ట్రాన్స్ పోర్టుగా అవతరించి నేటి వరకు అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం సుమారు 23 వేల బస్సులతో పల్లె పల్లెకు విస్తరించిన ఎపిఎస్ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయటానికి ప్రభుత్వం అనేక మార్గాలను వెతుకుతున్నది. ప్రైవేట్, కాంట్రాక్టు, అక్రమ రవాణా సాగిస్తున్న ఎప్పుడు ప్రమాదాలకు గురై ప్రయాణికులను పొట్టన పెట్టుకుంటాయో అప్పుడు మాత్రం ఆర్టీసీ బస్సులపై చర్చ మొదలవుతుంది. ప్రైవేట్ బస్సుల రాకపోకలపై మోటారు వాహనాల చట్టంలో కచ్చితమైన మర్గదర్శకాలున్నాయి. ముఖ్యంగా 1988లోని చట్టంలో గల సెక్షన్ 74, 1989లోని రూల్స్లో గల 82 రూల్స్ చాలా పకడ్బందీగా ఉన్నాయి. కానీ ఈ చట్టాన్ని రూల్స్ను పాలకులు ఏనాడు అమలు చేయటానికి ప్రయత్నించలేదు. పైగా రవాణా రంగంలో ప్రైవేటీకరణను వేగంగా అమలుపర్చి ఆర్టీసీని నిర్వీర్యం చేసేది ఎప్పుడెప్పుడూ అంటూ వారి దృష్టి దానిపై పెట్టారు.ఇలాంటి ఆలోచనలు ఎంతవరకు సమంజసంఆర్టీసీని ముక్కలు చెక్కలు చేస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే దానిపై తెలుగు ప్రజలెక్కడున్న వారి మధ్య చర్చ జరగాల్సిన అవసరం సమయం ఆసన్నమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: