మారిషస్ కమర్షియల్ బ్యాంకుకు బకాయిల వివాదం కేంద్రమంత్రి సుజనా చౌదరిని వదిలేలా లేదు. ఇప్పటికే ఈ అంశంపై విపక్షాలు ఓ రేంజ్ లో ఫైరయ్యాయి. బకాయిలు ఉన్న కంపెనీకి చెందిన వ్యక్తికి కేంద్రమంత్రిపదవి ఎలా కట్టబెడతారని నిలదీశాయి. తాజాగా ఈ బకాయిల విషయంలో.. మూడురోజుల్లో వివాదాన్ని పరిష్కరించుకోవాల్సిందిగా సుజానా చౌదరికి చెందిన సుజనా యూనివర్శల్ ఇండ్రస్టీస్ కు హైకోర్టు తేల్చిచెప్పింది. వివాదం పరిష్కరించుకోలేని పక్షంలో అందుకు కారణాలు వివరిస్తూ పిటీషన్ దాఖలు చేయాలని సూచించింది.                                 వివాదం మూలాల్లోకి వెళ్తే.. మారిషన్ కమర్షియల్ బ్యాంకు దగ్గర సుజనా చౌదరికి చెందిన హేస్టియా అనే కంపెనీ 100 కోట్ల రూపాయల రుణం తీసుకుంది. ఈ అప్పుకు సుజానా చౌదరికి చెందిన సంస్థ సుజనా యూనివర్శల్ ఇండస్ట్రీస్ పూచీకత్తులు ఇచ్చింది. ఐతే నాలుగేళ్లయినా ఇంతవరకూ అప్పు తీర్చే దిశగా ఆ కంపెనీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో కోర్టుకెక్కి మారిషన్ బ్యాంకు.. తన సొమ్ములు తనకు వచ్చేలా చూడాలని కోర్టును కోరుతోంది. హేస్టియా తన అప్పు తీర్చలేని పక్షంలో.. తనకు పూచీగా ఉన్న సుజనా యూనివర్శల్ కంపెనీ ఆస్తులు అమ్మయినా సరే తన బాకీ వసూలయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరుతోంది.                           ఈ విషయంలో సుజనా యూనివర్శల్ సంస్థ వాదన మరోలా ఉంది. తాము అప్పు తీర్చేందుకే ప్రయత్నిస్తున్నామని.. అందుకు మారిషస్ బ్యాంకు సహకరించాలని కోరుతోంది. ఇప్పటికే అనేక వాయిదాలు కోరిన కేంద్రమంత్రి సుజనాకు చెందిన కంపెనీ.. మరికొంత సమయం ఇస్తే.. అప్పు తీర్చే ప్రతిపాదనలతో ముందుకు వస్తామని కోర్టుకు తెలిపింది. దీనిపై మారిషన్ బ్యాంకు న్యాయవాది మండిపడ్డారు. ఇప్పటికే అనేక సార్లు సుజనా కంపెనీ మాటలు విన్నామని... సాగతీత కోసమే సుజనా కంపెనీ ఇలాంటి వాదనలు వినిపిస్తోందన్నారు. ఈ తీరు చూస్తే వంద కోట్ల అప్పు ఎగ్గొట్టేందుకే సుజనా కంపెనీ ప్రయత్నిస్తున్నట్టుందని ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: