ఆరు నెలలుగా రైతులతోపాటు అన్ని వర్గాల ప్రజలను మోసంచేస్తూ కాలయాపన చేస్తున్న ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు రాజధాని భూ సమీకరణ గ్రామాల్లో సింగపూర్ మంత్రి పర్యటనకు గుట్టుచప్పుడు కాకుండా సిద్ధంచేస్తుండడం ఆయనను మోసగించేందుకా? లేక సింగపూర్ ప్రభుత్వంతో చంద్రబాబు రహస్య ఒప్పందం చేసుకున్నాడేమోనని అనుమానం కలుగుతోందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆరోపించారు. రాజధాని భూ సమీకరణపై చంద్రబాబు విధి విధానాలు ప్రకటించిన నేపథ్యంలో ఈనెల 10వ తేదీ సింగపూర్ మంత్రి రాజధాని గ్రామాల్లో పర్యటిస్తున్నారనే సమాచారంతో రైతులను సమాయత్తం చేసేందుకు ఎమ్మెల్యే ఆర్కే సోమవారం రాత్రి నిడమర్రు గ్రామంలో రైతులతో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని రైతులు, రైతుకూలీలు, కౌలు రైతులతో పాటు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న ప్రతి కుటుంబం సంఘటితమై పర్యటనను అడ్డుకుంటారని చెప్పారు. భూ సమీకరణ గ్రామాల్లోని ప్రతి ఒక్కరికీ తాను అండగా వుంటానని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ అధికార గర్వంతో చంద్రబాబు ఎవ్వరినీ పరిగణలోకి తీసుకోవడం లేదని, తాము భూములను ఇచ్చే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు. తమ భూములను కాపాడుకునేందుకు ఆత్మ బలిదానాలకైనా సిద్ధమని, సింగపూర్ మంత్రి పర్యటన అడ్డుకుని తీరుతామని తేల్చిచెప్పారు. సమావేశంలో ఎంపీపీ పచ్చల రత్నకుమారి, సర్పంచ్ మండెపూడి మణెమ్మ, ఉప సర్పంచ్ గాదె సాగర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, కొదమకొండ్ల నాగరత్నం, రైతు సంఘం నాయకులు, మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు. పెనుమాక (తాడేపల్లి రూరల్):రాజధాని భూ సేకరణ విషయంలో ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, కుయిక్తులు పన్నిన, అన్నదాతలకు కడదాక అండగా ఉంటానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణరెడ్డి (ఆర్కే) హామీఇచ్చారు. సోమవారం రాత్రి పెనుమాక గ్రామంలో జరిగిన రైతుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. మంగళగిరి నియోజకవర్గంలో ఏ ఒక్క రైతు కూడా తమ పంట భూములను రాజధాని నిర్మాణం నిమిత్తం ఇవ్వడానికి సిద్ధంగా లేడన్నారు. ప్రాణాలైనా ఆర్పిస్తాం, సెంటు భూమి కూడా వదలుకునేది లేదంటూ, రైతులు ఒక పక్కన మొత్తుకుంటున్నా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం అన్నదాత గోడు పట్టించుకోకుండా సింగపూర్, జపాన్ పర్యటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. చట్టబద్ధత లేని ప్యాకేజీల వల్ల రైతన్నలకు ప్రయోజనం లేదన్నారు. మాజీ ఎంపీపీ దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎంపీపీ పచ్చల రత్నకుమారి, ఎంపీపీ కత్తిక రాజ్యలక్ష్మి, మున్సిపల్ చైర్‌పర్సన్ కొయ్యగూర మహాలక్ష్మి, మండల పార్టీ కన్వీనర్ పాటిబండ్ల కృష్ణమూర్తి, భీమవరపు సాంబిరెడ్డి, దంటూ గోవర్ధనరెడ్డి, సొసైటీ ప్రెసిడెంట్ మేకా శివారెడ్డి తదితర పెద్దలు అన్నదాతలకు అండగా ఉంటామని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: