ఆంధ్రా అసెంబ్లీలో సవాళ్ల పర్వం మొదలైంది. హుద్ హుద్ తుపాన్ పై జరిగిన చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య వాడివేడిగా సవాళ్లు సాగాయి. విశాఖ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ప్రతిపక్షనేత జగన్ మండిపడ్డారు. ప్రత్యేకించి మంత్రి గంటా శ్రీనివాసరావు టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. కనీవినీఎరుగని తుపాను వచ్చి జనం ఇబ్బందుల్లో ఉంటే.. మంత్రి గంటా తన సొంత నియోజకవర్గంలో కూడా పర్యటించలేదని ఘాటుగా విమర్శించారు.                             హుద్ హుద్ తుపాన్ వచ్చిన తర్వాత తాను పదిరోజుల పాటు బాధిత ప్రాంతాల్లో పర్యటించానని జగన్ చెప్పుకున్నారు. ఇదే సమయంలో జగన్ విమర్శలపై స్పందించిన మంత్రి గంటా.. తుపానుపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో ప్రపంచమంతా చూసిందన్నారు. ఇక తనపై జగన్ నేరుగా చేసిన విమర్శలకు గంటా శ్రీనివాసరావు అంతే దూకుడుగా సమాధానమిచ్చారు. తాము.. తుపాను సహాయ చర్యలు సరిగ్గా నిర్వహించలేదని జగన్ భావిస్తే..ఉపఎన్నికల్లో పోటీ చేసి సత్తానిరూపించుకుందాం.. జగన్ రెడీయా అని ప్రశ్నించారు.                   రాజీనామాకు తాను సిద్దమని.. తాము సహాయ చర్యలు బాగా చేయలేదని జగన్ భావిస్తే.. రాజీనామా చేసి..తనపై భీమిలో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. జగన్ విమర్శలపై గంటా ఈ స్థాయిలో సవాల్ విసరడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. మరి ఈ సవాల్ కు జగన్ ఎలా స్పందిస్తారో.. గంటా ప్రతిష్టకుపోయి సవాల్ విసిరినా.. జగన్ దాన్ని స్వీకరించే అవకాశాలు తక్కువే. సొంత నియోజకవర్గంలో పోటీకి ఆహ్వానించి గంటా మంచి ఎత్తే వేశారు. జగన్ ఎలాగూ పోటీ చేయడు కాబట్టి.. తనదే పైచేయి అవుతుందన్నది గంటా ఆలోచన.. మరి గంటా సవాల్ ను స్వీకరించే దమ్ము జగన్ కు ఉందా.. ?

మరింత సమాచారం తెలుసుకోండి: