కాంగ్రెస్ పార్టీలో ఇక రాహుల్ కాలం మొదలవుతున్నట్టే కనిపిస్తోంది. నవంబర్ 2న రాహుల్ గాంధీకి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు అప్పగిస్తారన్న వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే రాహుల్ కొత్త బాధ్యత కాంగ్రెస్ కు ఏ మేరకు పనికొస్తుందన్నదానిపై చర్చ మొదలైంది. వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు 2014 ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తోంది. పార్టీ బలోపేతమే ప్రధానాంశంగా జరిగిన కేంద్ర మంత్రి వర్గ విస్తరణ పరిశీలిస్తే అదే విషయం అర్ధమవుతుంది. ఇప్పుడు మరో మలుపుకు కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధమవుతోంది. అదే రాహుల్ గాంధీకి కీలకబాధ్యత. రాహుల్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించేందుకు సర్వం సిద్ధమైంది. నవంబర్ 2న దీనికి ముహూర్తం ఖరారైందని సమాచారం. వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా సెక్రటరీ జనరల్ పోస్టును రాహుల్ కు అప్పజెప్తారని ఏఐసీసీ వర్గాలంటున్నాయి. కొత్త రక్తం పార్టీ కీలకబాధ్యతలు అందుకునేందుకే మంత్రి పదవిని రాహుల్ పక్కనపెట్టారని ముందునుంచే ప్రచారం జరిగింది. దీనిపై ప్రధాని మన్మోహన్ కూడా క్లారిటీ ఇచ్చారు. పార్టీ బలోపేతానికే రాహుల్ మొగ్గుచూపుతున్నారని తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులుగానూ కొత్త టీమ్ రానుంది.అదికూడా రాహుల్ టీమేనని చెప్తున్నారు. మంత్రిపదవికి రాజీనామా చేసిన అంబికాసోనీ కూడా పార్టీ బాధ్యతలు చేపట్టనున్నారు. గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తిగా రాహుల్ ఇమేజ్ పార్టీని బలోపేతం చేస్తుందన్న ఆశ కాంగ్రెస్ లో ఉంది. అందుకే రాహుల్ కు కీలకబాధ్యతలు అప్పగించాలన్న వాదన పార్టీలో ఎప్పట్నుంచో వినిపిస్తోంది. యువనేత మ్యాజిక్ పని చేస్తుందా? మరోవైపు రాహుల్ కీలకబాధ్యతలు చేపడితే కాంగ్రెస్ బలోపేతం సంగతి అటుంచి... ఇప్పుడున్న ఆ కాస్త గ్రిప్ కూడా పోతుందన్న విమర్శలు మొదలయ్యాయి. యూపీలో జరిగిన పరాభవాన్ని విమర్శకులు గుర్తు చేస్తున్నారు. దాదాపు 6నెలల పాటు రాహుల్ గాంధీ ప్రచారం చేసినా... ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయింది. మరి యువనేత ఎటువంటి ప్రయోగాలతో పార్టీని భుజాన వేసుకుంటారు. తన పనితీరుతో అందరి నోళ్లు మూయిస్తారా... 2014లో అయినా రాహుల్ మ్యాజిక్ పనిచేస్తుందా అన్నదే కాంగ్రెస్ లో కీలకమైన ప్రశ్న. 

మరింత సమాచారం తెలుసుకోండి: