రాజధాని మాస్టర్‌ప్లాన్ డిజైన్ కోసం ప్రభుత్వం సింగపూర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే.. మరోవైపు మన విద్యార్థులు అద్భుతమైన డిజైన్లు రూపొందించి అందరినీ విస్మయంలో ముంచెత్తారు. రాజధాని నిర్మాణం పేరిట ప్రభుత్వం 33 వేల ఎకరాల భూ సమీకరణకు నోటిఫికేషన్లు జారీ చేసింది. విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (స్పా) విద్యార్థులు కేవలం 250 నుంచి 300 ఎకరాల్లో రాజధానికి అవసరమైన సచివాలయం, అసెంబ్లీ, రాజ్‌భవన్ ఇతర కీలకమైన పరిపాలనా భవనాలను అత్యంత ఆధునికంగా ఎలా నిర్మించవచ్చో తమ డిజైన్లలో చూపించారు.

పలుదేశాల్లోని ఆధునిక నగరాల నిర్మాణ రీతులు, సాంకేతికతను అధ్యయనం చేసి మరీ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పక్కాగా ఈ డిజైన్లు తయారు చేశారు. ఆరు నెలల క్రితం 'స్పా' మేనేజ్‌మెంట్ బీఆర్క్ (బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్) ఆఖరి సంవత్సరం విద్యార్థులకు అకడమిక్ ప్రాజెక్టు కింద రాజధాని డిజైన్లు తయారు చేయాలని సూచించింది. 72 మంది విద్యార్థులను 16 గ్రూపులుగా విభజించి ఈ మూడు ప్రదేశాలను వారికి కేటాయించింది. ఆ గ్రూపులు రూపొందించిన డిజైన్లను సెలక్షన్ కమిటీ పరిశీలించి వాటిలో ఎనిమిదింటిని వార్షికోత్సవంలో ప్రదర్శించడానికి ఎంపిక చేసింది.

అందులో నాలుగు మంగళగిరి ప్రదేశానివి కాగా, మూడు ఆగిరిపల్లి, ఒకటి నాగార్జున వర్సిటీ ప్రాంతానికి చెందినవి. వాటిలో తెలుగుదనం ఉట్టి పడేలా, రాష్ట్ర ఖ్యాతి తెలిసేలా ఆధునిక టెక్నాలజీతో మంగళగిరి ప్రదేశం కోసం రూపొందించిన ఒక డిజైన్ సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్‌ను అమితంగా ఆకర్షించింది. ఈ నమూనాను మరింత అభివృద్ధి చేసి తనకివ్వాలని శ్రీకాంత్ స్పా మేనేజ్‌మెంట్‌ను కోరడం విశేషం. మరో బృందం సిడ్నీ ఒపెరా హౌస్ తరహాలో రెండు కొండల మధ్య మట్టిలోంచి మొలకెత్తే మొక్కల ఆకారంలో భవనాలకు రూపకల్పన చేసింది.

.

మరింత సమాచారం తెలుసుకోండి: